
ఆ గృహస్థుకు కోపమొచ్చింది. ‘నేను ఇంటికి పిలిచి మీకు మర్యాదలు చేసిందానికి ఇదా ఫలితం? నాతో పరిహాసం ఆడుతున్నారా?’ అన్నాడు.
ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఊరి మర్రిచెట్టు కింద కూర్చుని, వచ్చిపోయేవారికి తన బోధనలు చేస్తున్నాడు. సాధువుల పట్ల గౌరవం ఉన్న ఒకాయన ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. భక్తిశ్రద్ధలతో ఆతిథ్యం ఇచ్చాడు. సాధువు దానికి ఎంతో సంతోషించాడు. ఇంట్లోంచి సెలవు తీసుకునేముందు ఏమైనా కోరుకొమ్మని గృహస్థును అడిగాడు. దానికా గృహస్థు, తరతరాలకు కొనసాగే అసలైన సంపద ఏదైనా ఉంటే అది ప్రసాదించమని అడిగాడు. సాధువు చిరునవ్వి, ‘తండ్రి మరణిస్తాడు, కొడుకు మరణిస్తాడు, మనవడు మరణిస్తాడు’ అని పలికాడు. దాంతో ఆ గృహస్థుకు కోపమొచ్చింది. ‘నేను ఇంటికి పిలిచి మీకు మర్యాదలు చేసిందానికి ఇదా ఫలితం? నాతో పరిహాసం ఆడుతున్నారా?’ అన్నాడు.
‘నాయనా, నా మాటల్లో పరిహాసం ఏమీలేదు. నీవుండగానే నీ కుమారుడు మరణిస్తే నీకు మిగిలేది శోకమే. నీవూ, నీ కుమారుడూ ఉండగానే నీ మనవడు మరణిస్తే మీ ఇద్దరికీ కలిగేది అమితమైన దుఃఖమే. అలా కాకుండా, ముందు నువ్వు వెళ్లిపోయి, తర్వాత నీ కుమారుడు, అటుపై నీ మనవడు నిష్క్రమిస్తే... అది ఒక సహజ క్రమం. మీ తరతరాల్లోనూ ఇలాగే జరిగితే ఇంతకంటే సంపద ఏముంటుంది?’ అని వివరించాడు సాధువు. అందులోని ఆంతర్యం అర్థమైన ఆ గృహస్థు వినమ్రంగా సాధువుకు నమస్కరించాడు.
Comments
Please login to add a commentAdd a comment