మంచి మనిషి | George Floyd Likes His Daughter More Says Roxy | Sakshi
Sakshi News home page

మంచి మనిషి

Published Fri, Jun 5 2020 12:01 AM | Last Updated on Fri, Jun 5 2020 12:01 AM

George Floyd Likes His Daughter More Says Roxy - Sakshi

జార్జి ఫ్లాయిడ్‌కి కూతురంటే ప్రాణం. మంచి లైఫ్‌ని ఇవ్వాలని ఇల్లొదిలి వచ్చాడు. చెమటోడ్చిన ప్రతి డాలర్‌.. అదనంగా ప్రతి పని గంట.. కూతురి కళ్లలో మెరుపుల కోసమే. ‘కాంట్‌ బ్రీత్‌.. ప్లీజ్‌’ అంటున్నప్పుడు.. కూతురు కళ్ల ముందుకొచ్చే ఉంటుంది. ఆయన భార్య ఇప్పుడు.. కూతుర్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. ‘‘ఫ్లాయిడ్‌ మంచి మనిషి.. కూతుర్ని చూసి చెప్పొచ్చు’’ అంటోంది.

ప్రతి మనిషిలో గుట్టు చప్పుడు కాకుండా ఒక హీరో ఉంటాడు. మే 25న  మినియాపలిస్‌లోని ఒక పోలీస్‌ ఆఫీసర్‌ తన మోకాలితో తొక్కిపట్టి ఉంచినప్పుడు ఊపిరి ఆడక చనిపోయిన జార్జి ఫ్లాయిడ్‌ కూడా ఒక హీరోనే. కూతురికి హీరో డాడీ. భార్యకు హీరో హస్బెండ్‌. హ్యూస్టన్‌లో తన కాలనీవాళ్లకు హీరో నైబర్‌. మరికాస్త వెనక్కి వెళితే..  జాక్‌ యేట్స్‌ హైస్కూల్‌లో హీరో ఫుట్‌బాలర్, కాలేజ్‌లో హీరో బాస్కెట్‌బాలర్‌. కూతురికి మరింత మెరుగైన జీవితాన్ని ఇవ్వడం కోసం ఫ్లాయిడ్‌  టెక్సాస్‌ నుంచి మినియాపలిస్‌ వచ్చాడు. ఇరవై డాలర్ల నోటు మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దొంగనోటు అది! అరెస్ట్‌ చేశారు. చేతులకు సంకెళ్లు వేశారు. పెనుగులాడాడు ఫ్లాయిడ్‌. ఆ నోటు ఎలా వచ్చిందో తనకూ తెలీదన్నాడు. పోలీసులతో ఘర్షణ పడ్డాడు. కింద పడ్డాడు. అప్పుడే డెరెక్‌ షువాన్‌ అనే పోలీస్‌ అధికారి అతడి గొంతును మోకాలితో తొక్కిపట్టాడు. తొమ్మిదో నిముషంలో ఫ్లాయిడ్‌ చనిపోయాడు! 
కూతురుతో రాక్సీ; ఇన్‌సెట్‌లో ఫ్లాయిడ్‌

గుండె ఆగిపోయినంత పనైంది రోక్సీ వాషింగ్టన్‌కు. టెక్సాస్‌లోని తన ఇంట్లో టీవీ చూస్తోంది ఆవిడ. టీవీ చూడ్డం కాదు, టీవీలో తన భర్తను చూస్తోంది. నేలపై పడి ఉన్నాడు. అతడి నోట్లోంచి నాలుక బయటికి వచ్చింది. పోలీస్‌ ఆఫీసర్‌ తన మోకాలితో భర్త గొంతును నొక్కి ఉంచిన క్లిప్‌ను పదే పదే టీవీలో చూపిస్తున్నారు. 
‘‘డాడీకి ఏమైంది మమ్మీ?’’.. గియానా వచ్చి అడిగింది. ఆరేళ్లు తనకు.   
‘‘ఊపిరి ఆడట్లేదు’’ అని చెప్పింది కూతుర్ని దగ్గరకు లాక్కుని. తల్లి చెప్పలేకపోయినా అమెరికాలో ఉవ్వెత్తున ఎగసిపడిన నిరసన జ్వాలలు గియానాకు చెప్పాయి.. తన హీరో డాడీని పోలీసులు చంపేశారని! ‘పోలీసులు’ అన్నంత వరకే ఆ చిన్నారికి తెలుసు. ‘తెల్ల పోలీసులు’ అనే స్పృహ ఇంకా రాలేదు. బుధవారం మినియాపలిస్‌లో నల్లజాతి నిరసనకారులతో కలిసి రోక్సీ మీడియా ముందుకు వచ్చారు. భర్త మరణించాక మొదటిసారి ఆమె బయటికి రావడం. కన్నీరు ఆమెను మాట్లాడనివ్వడం లేదు. భర్తను తలచుకుంటూ కూతుర్ని హత్తుకుని ఉంది. ఫ్లాయిడ్‌ తన కూతురు ఎదుగుతున్న ఏళ్లను చూడలేడు. ఫ్లాయిడ్‌ తన కూతురు గ్రాడ్యుయేట్‌ అవడాన్ని చూడలేడు. ఫ్లాయిడ్‌ తన కూతుర్ని పెళ్లి కూతురుగా చెయ్యి పట్టి నడిపించలేడు. గియానాకు అన్నీ ఉన్నాయి. తండ్రి మాత్రం లేడిప్పుడు. భుజాలపై ఎక్కించుకుని తిప్పిన తండ్రి. కారు స్టీరింగ్‌ ముందు కూర్చోబెట్టుకుని మురిసిపోయిన తండ్రి.
‘‘పోలీసులకూ భార్యాబిడ్డలు ఉంటారు. డ్యూటీ నుంచి ఇంటికి రాకపోతే ఎదురుచూస్తుంటారు. ఫ్లాయిడ్‌ కోసం మేం ఎదురుచూస్తుంటామని వాళ్లెందుకు అనుకోలేకపోయారు’’ అని రోక్సీ అడుగుతున్నారు. ‘‘ఫ్లాయిడ్‌ మంచి మనిషి. అందుకు సాక్ష్యంగా గియానా పసి ముఖాన్ని మాత్రమే నేను చూపించగలను’’ అని అన్నారు.. తండ్రి అమాయకత్వానికి ప్రతిరూపంలా ఉన్న కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ.

ఫ్లాయిడ్‌ గొంతుపై  డెరెక్‌ షువాన్‌

ఫ్లాయిడ్‌ బాహుబలిలా ఉంటాడు. ‘జెంటిల్‌ జెయింట్‌’ అనేవారు హ్యూస్టన్‌లో అతడిని. బతుకు తెరువు కోసం ఒక రెస్టారెంట్‌లో కొన్నాళ్లు సెక్యూరిటీగా పని చేశాడు. ‘ఇలాంటి ఒక మనిషి మన వెనుక ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు’ అనే పేరొచ్చింది ఫ్లాయిడ్‌కి. ఇంకా చిన్న చిన్న పనులేవో చేసేవాడు. పార్ట్‌ టైమ్‌గా ఫుట్‌బాల్‌ కోచింగ్, అప్పుడప్పుడు ట్రక్‌ డ్రైవింగ్‌. వచ్చే డబ్బులన్నీ తన కూతురివే! డబ్బులో ఓ ఇరవై డాలర్ల నకిలీ నోటు అతడి అరెస్టుకు, అతడి మరణానికి దారి తీసిందంటే అది పోలీసుల కట్టుకథలానే అనిపిస్తుంది. వెనుక ఇంకేదో ఉంది.  విచారణ జరుగుతోంది. తన గురించి చెప్పుకోని ఈ హీరో గురించి చెప్పడానికి అమెరికా అంతటా ఎంతమంది అయినవాళ్లు లేరు?

నాకీ భర్త వద్దు

కెల్లీ మే.. డెరెక్‌ షువాన్‌ భార్య
జార్జి ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసు అధికారి డెరెక్‌ షువాన్‌ భార్య కెల్లీ మే విడాకులకు పిటిషన్‌ పెట్టుకున్నారు. తన పేరు పక్క నుంచి భర్త పేరును తొలగించమని కూడా అందులో విజ్ఞప్తి చేశారు. డెరెక్‌కి, కెల్లీకి పదేళ్ల క్రితం పెళ్లయింది. ఒక వ్యక్తిని తన భర్త చంపడాన్ని నేటికీ ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు. విడాకుల అనంతరం చట్టపరంగా భర్త నుంచి సంక్రమించే ఆస్తులు, భరణాలను కూడా ఆమె వద్దనుకున్నారు. కైలీ మాజీ అందాలరాణి. ‘మిసెస్‌ మిన్సెసోటా అమెరికా’ టైటిల్‌ విజేత. బాల్యంలోనే లావోస్‌ నుంచి కుటుంబంతో పాటు యు.ఎస్‌. వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement