భగవంతునికి భక్తులు చేసే సేవలు | God devotees Services | Sakshi
Sakshi News home page

భగవంతునికి భక్తులు చేసే సేవలు

Published Thu, Apr 9 2015 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

భగవంతునికి  భక్తులు చేసే సేవలు

భగవంతునికి భక్తులు చేసే సేవలు

షోడశోపచారాలు
 
ఆవాహనం: మనం పూజించే దేవుణ్ణి మన గృహంలోని పటం లేదా విగ్రహం లోనికి రావలసిందిగా ఆహ్వానించడమే ఆవాహనం. ఈ సేవ చేసేటప్పుడు ఎడమచేతిని మన హృదయం మీద ఉంచుకుని, కుడిచేతిని భగవంతుని పాదాల మీద ఉంచి, రెండు అక్షతలు వేయాలి.
 ఆసనం: విగ్రహంలోనికి లేదా పటంలోనికి భగవంతుడు వచ్చిన తర్వాత చేయవలసిన సేవ ఆసనం అందించడం. మనం పూజించే ఆ దైవాన్ని పేరు పెట్టి స్తుతిస్తూ, ‘నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి’ అని పూవులు, అక్షతలు ఆయన ముందు ఉంచాలి.
 అర్ఘ్యం, పాద్యం, ఆచమనం: ఈ మూడు సేవలూ ఇంచుమించు ఒకేవిధంగా ఉంటాయి. దైవానికి కాళ్లు కడుగుతున్నట్లుగా భావిస్తూ, పంచపాత్రలోని నీటిని తీసుకుని, ‘పాద్యం సమర్పయామి’ అంటూ ఆ విగ్రహం లేదా పటం ముందు ఉంచిన ఒక చిన్న గిన్నె (దీనిని అర్ఘ్యపాత్ర అంటారు)లో  ఉద్ధరిణెడు వేయాలి. ఆ తర్వాత చేతులు కడుగుతున్నట్లుగా భావిస్తూ ‘అర్ఘ్యం సమర్పయామి’ అని, రెండు ఉద్ధరిణల నీటిని  విగ్రహానికి చూపిస్తూ, ఆ పాత్రలో వేయాలి. తర్వాత మంచినీరందించినట్లుగా మూడు ఉద్ధరిణల నీటిని తీసుకుని, అర్ఘ్యపాత్రలో వేయాలి.

 పంచామృతస్నానం: భగవంతునికి స్నానం చేయిస్తున్న భావనతో, ‘పంచామృతస్నానం సమర్పయామి’ అంటూ ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెరలతో అభిషేకం చేయాలి. అనంతరం ‘శుద్ధోదక స్నానం సమర్పయామి’ అంటూ పవిత్రోదకంతో అభిషేకం చేయాలి.

వస్త్రం: స్నానం చేసిన అతిథికి వస్త్రం ఇవ్వాలి కదా! రెండు గుండ్రటి ఒత్తులు తీసుకుని, పసుపు, కుంకుమ అద్ది, ‘వస్త్రయుగ్మం సమర్పయామి’ అంటూ విగ్రహం లేదా పటం మీద ఉంచాలి. విగ్రహం పెద్దదైతే గనుక ఆ విగ్రహానికి పంచనుకట్టబెట్టి, కండువాను మెడలో వేయాలి.

ఉపవీతం: భగవంతునికి (స్త్రీ దేవత అయినా సరే) పత్తితో చేసిన మూడు వత్తులకు పసుపు, కుంకుమలతో అలంకరించి యజ్ఞోపవీతంలా అలంకరించాలి. పరిమాణాన్ని బట్టి సిసలైన యజ్ఞోపవీతాన్ని కూడా అలంకరింపవచ్చు.

ధూపం, దీపం: రెండు లేదా మూడు అగరువత్తులను వెలిగించి, స్వామివారు లేదా అమ్మవారికి చూపించి, ధూపం సమర్పయామి’ అంటూ స్టాండులో ఉంచాలి. ఆ తర్వాత ‘దీపం దర్శయామి’ అంటూ రెండు లేదా మూడు వత్తులను వెలిగించి, చేతితోనే చూపించాలి.
 గంధ, పుష్ప, అక్షతలు: ‘గంధం సమర్పయామి’ అంటూ మంచి గంధాన్ని లేదా శ్రీ చందనాన్ని పుష్పంతో తీసుకుని, విగ్రహం మీద చిలకరించాలి. అనంతరం ‘పుష్పాన్ సమర్పయామి’, అంటూ సువాసన గల పూవులను అలంకరించాలి. ఆ తర్వాత దైవానికి సంబంధించిన శత లేదా సహస్ర నామాలనో అష్టోత్తరాన్నో చదువుతూ అక్షతలతో లేదా పూలతో పూజించాలి.

నైవేద్యం: బెల్లం ముక్క మొదలుకొని, అరటిపండు, కొబ్బరికాయ, రసం గల పండ్లు, ఎండుపండ్లు, ప్రత్యేక పూజలలో అయితే నవకాయ పిండివంటలను నివేదించాలి. ఆ సమయంలో గాయత్రీ మంత్రాన్ని చదువుతూ, ‘నైవేద్యం సమర్పయామి’ అంటూ ఆ పదార్థాల మీద లేదా పండ్ల మీద నీటిని చల్లి, భగవంతునికి చూపుతూ, దైవానికి స్వయంగా మనమే తినిపిస్తున్నంత భక్తిశ్రద్ధలతో సమర్పించాలి.
 తాంబూలం: నైవేద్యానంతరం దక్షిణతో కూడిన తాంబూలాన్ని ‘తాంబూలాన్ సమర్పయామి’ అంటూ సమర్పించాలి.

నీరాజనం: తాంబూలానంతరం హారతి పళ్లెంలో కర్పూరాన్ని వెలిగించి, ‘ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి’ అంటూ ముందుగా ముఖానికి, ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు హారతి ఇవ్వాలి. ‘నీరాజనానంతరం శుద్ధోదకం సమర్పయామి’ అంటూ పుష్పంతో రెండు చుక్కల నీటిని చిలకరించి, హారతిని భక్తితో కన్నులకు అద్దుకోవాలి.

క్షమాప్రార్థన:మనం చేసిన పూజ, చదివిన మంత్రం లేదా, క్రియలో లేదా భక్తిలో ఏదైనా లోపం ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ... ‘‘మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం... యత్పూజితం మయ్యా దేవ  పరిపూర్ణం తదస్తుతే అంటూ కొన్ని అక్షతలు తీసుకుని, ఉద్ధరిణ డు నీటిని విడవాలి.

 ఆత్మప్రదక్షిణ- సాష్టాంగ దండప్రణామాలు: ఆ తర్వాత మూడుమార్లు సవ్యదిశలో ప్రదక్షిణ చేసి, అవకాశాన్ని బట్టి, శరీరంలోని అన్ని భాగాలూ నేలకు తగిలేవిధంగా సాగిలబడి, నమస్కరించాలి. (స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయనక్కరలేదు)
 నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి అంటూ నృత్య, గీతాలతో కూడా భగవంతుని తృప్తిపరచాలి.

పూజలో రాజోపచారాలు, దైవోపచారాలు, భక్త్యోపచారాలు, శక్త్యోపచారాలు అని  ఉంటాయి. అంటే, భక్తులమైన మనం సర్వశక్తిమంతుడైన భగవంతునికి సేవకులమేనన్న భావనతో ఈ సేవలన్నీ చేయాలి.

ఉద్వాసన: పూజ ముగిసిన తర్వాత, ఉద్వాసన చెప్పడం కూడా ముఖ్యమైనదే. అంటే, దైవాన్ని మనం విగ్రహంలోనికి ఆహ్వానించాక తిరిగి, సగౌరవంగా సాగనంపడం కూడా అవసరమే కదా! అందుకే పూజ పూర్తయిన తర్వాత, ‘ఉద్వాసయామి’ అంటూ విగ్రహాన్ని వెనక్కు జరిపి,  ‘యథాస్థానం ప్రవేశయామి’ అంటూ యథాస్థానంలోకి తీసుకురావాలి.  

 పూజించే దైవాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి పై పూజావిధానంలో కొద్దిపాటి భేదాలున్నప్పటికీ, షోడశోపచారాలు చేయవలసిన తీరు ఇది.  
 - డి.వి.ఆర్.
 
 భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఎన్నో రకాల ఉపచారాలు చేస్తారు. వాటిలో పదహారు సేవలు అతి ముఖ్యమైనవి. వాటికే షోడశోపచారాలు అని పేరు. నిత్యపూజలో భాగంగా చేసే ఈ ఉపచారాలు ఏమిటో, ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటే వాటిని ఆచరించడం తేలిక.

ఇంటికి ఎవరైనా ముఖ్య అతిథి వస్తే సాదరంగా లోనికి ఆహ్వానిస్తాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిస్తాం. తాగడానికి మంచినీరందిస్తాం. ముఖం తుడుచుకోవడానికి కండువా ఇస్తాం. ఆసనంపై కూర్చోబెడతాం. సేదతీరిన తర్వాత స్నానానికి ఏర్పాట్లు చేస్తాం. వస్త్రాభరణాలతో గౌరవిస్తాం. రకరకాల పిండివంటలతో భోజనం పెడతాం. అనంతరం వక్కపలుకు లేదా తాంబూలం అందిస్తాం. పక్కవేసి, కాసేపు విశ్రమించిన తర్వాత కబుర్లు చెబుతాం. మనకేమైనా కోరికలు వుంటే విన్నవించుకుంటాం. ఆ తర్వాత చేతనైన కానుకలు ఇచ్చి ఘనంగా వీడ్కోలు చెబుతాం. భగవంతుడు కూడా మనకు అతిథి వంటివాడే. అందుకే అతిథినీ, దేవుడినీ ఒక గాటన కట్టేశారు మన పెద్దలు. అటువంటి ది మన ఇంటికి భగవంతుడే స్వయంగా విచ్చేస్తే మనం ఆయనకు ఏమేం ఉపచారాలు చేస్తామో లేదా ఏమేం ఉపచారాలు చేయాలో తెలియజెప్పేవే ఈ షోడశోపచారాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement