ప్రపంచమంతటా ప్రథమ దేవుడు
సృష్టికి సంకేతం - గణపతి. అందుకే, ఆయనకు ప్రథమ పూజ చేస్తాం. సాక్షాత్తూ, ఈశ్వరుడు కూడా ఏ యుద్ధానికి వెళ్ళినా, ముందుగా గణపతి పూజ చేసి వెళ్ళేవాడని మన పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి దేవతలను ఒక్కటిగా పూజించే సంస్కృతి మన దేశానిది. అయితే, ప్రధానంగా ఏ దేవీదేవతలను ఆరాధిస్తున్నమన్న దాన్ని బట్టి ఆరు వైదికమతాలుగా పేర్కొన్నారు. ఈ షణ్మతాలలో గణపతిని ఆరాధించే వారు ‘గాణాపత్యులు’. గణపతి పేరు చెప్పగానే హిందువుల దేవుడనీ, మన దేశానికే పరిమితమనుకొంటే పొరపాటే. చైనా, జపాన్, శ్రీలంక, ఇండొనేసియా, థాయిలాండ్, కంబోడియా, ఇరాన్‌లలో గణపతి విగ్రహాలు, ఆరాధన కనిపిస్తాయి. జైనం, బౌద్ధాల్లోనూ వినాయకారాధన ఉంది.
జైనంలో.. బౌద్ధంలో.. విఘ్నాధిపతే!
మన విఘ్నాలకు అధిపతిగా కొలుచు కొనే గణపతికి సంపదలనిచ్చే కుబేరుడి గుణాలను కూడా జైన మతంలో ఆపాదించారు. ఏ కొత్త పని మొదలెట్టాలన్నా స్వామిని పూజించి, ఆ తరువాతే పని చేపట్టాలనే పద్ధతిని ఇవాళ్టికీ శ్వేతాంబర జైనులు పాటిస్తారు. బౌద్ధమతంలోనూ వినాయకుడున్నాడు. రాగతాళయు క్తంగా నృత్యం చేస్తున్న ‘నృత్త గణపతి’గా ఆయన బొమ్మలు కనిపిస్తాయి. అక్కడా విఘ్నాలను తొలగించే దేవుడిగానే ఆయనను కొలుస్తారు.
జపాన్‌లో ప్రేమికుల దైవం
గణపయ్యను జపాన్‌లో ‘కాంగిటెన్’ అంటారు. వారి దృష్టిలో అదృష్టప్రదాత. అక్కడి పెద్దవాళ్ళ దృష్టిలో ఆయన వ్యాపారంలో విజయమిచ్చే విఘ్నాధిపతైతే, ప్రేయసీప్రియులకు ‘ప్రణయదేవుడు’. ప్రేమ ఫలించడానికి వారు గణేశుణ్ణి పూజిస్తారు.
థాయిలాండ్‌లో... ఫైనార్ట్స్ చిహ్నంలో...
విద్య, వాణిజ్యం, కళలకు సంబంధించిన దేవుడు కాబట్టి, థాయి లాండ్‌లో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనార్ట్స్’ చిహ్నంలోనూ గణేశుడి బొమ్మ ఉంటుంది. వ్యాపారానికీ, దౌత్యానికీ గణేశుడే అధిపతి అని బ్యాంకాక్ ప్రజల విశ్వాసం. అక్కడ ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’లో ఆయన విగ్రహముం టుంది. ఇక ఇండొనేసియాలో గణపతిని జ్ఞానప్రదాతగా కొలుస్తారు.
ఇలా దేశదేశాల్లో గణపతి ఆరాధనున్నా, ప్రత్యేకించి భాద్రపద మాసంలో గణపతిని ప్రధానదైవంగా అర్చించే సంప్రదాయం మనది. ఇప్పటికీ ఏ దేవతా పూజ చేసినా మొదట గణపతి పూజ చేయకుండా చేయం కాబట్టి, మనందరం గాణాపత్యులమే. ఆయనే పరబ్రహ్మ స్వరూపమ్.
‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ
ధీ మహి, తన్నో దంతిః ప్రచోదయాత్’.
- రెంటాల జయదేవ