మంచి పుస్తకమే మీకొక మంచి స్నేహితుడు!
రామాయణ భారత భాగవతాదులు అధ్యయనం చేయడం మీ జీవితంలో ప్రధానమైన అంశంగా స్వీకరించండి. అది మీకు శీలవైభవాన్ని ఇస్తుంది. ఊన్చుకోవడానికి అవకాశమౌతుంది. ఇతిహాసాలు, పురాణాలు పనికిమాలినవి కావు. అందుకే స్వామి వివేకానంద .. ‘‘ఇతిహాసాలు, పురాణాలు ప్రస్తుత కాలానికి సరిపడవని మీకనిపిస్తే, ప్రస్తుత సమాజం లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలేదనిపిస్తే... నిర్దాక్షిణ్యంగా వాటిని బయటికి విసిరిపారేయండి.
మీ ఇంట్లో మీ విలువైన పుస్తకాలమధ్య వాటిని ఉంచుకోకండి. భారతీయ వేదాంతసమాజ దార్శనిక గ్రంథాలైన రామాయణ, భారత భాగవతాదులు కాలపరీక్షకు తట్టుకుని నిలబడతాయని నేను మీకు హామీ ఇస్తున్నాను.’’ అంటారు. మీకు ఏ కాలంలో ఎదురయ్యే పరీక్షకైనా అవి మీకు పరిష్కారాలు చూపిస్తాయి. పక్షపాతంతో ఏ పుస్తకాన్నీ చదవకండి. ఒక్కొక్కప్పుడు ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడు కావచ్చు. మంచి పుస్తకాలను చదవడం మంచి స్నేహితుల సాంగత్యంతో సమానమైన ఫలితాన్ని స్తుంది.. రామాయణం కూడా అటువంటి ఒక మంచి పుస్తకం.
నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న అడుగుతాడు. 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన మనుష్యుడు ఈ కాలంలో ఎక్కడున్నాడు? అని. భగవంతుని గురించి అడగలేదు. అటువంటి మనుష్యులెవరైనా ఉంటే చెప్పమన్నాడు. ‘‘ఉన్నాడు. రాముడని ఈ కాలమునందే పరిపాలన చేస్తున్నాడు.’’ అంటూ సంక్షేప రామయణాన్ని నారద మహర్షి వివరించాడు. ఆ గుణాలను వివరిస్తూ ’కోపాన్ని అదుపులో ఉంచుకున్నవాడు’ అంటాడు. ’కోపాన్ని పూర్తిగా విడిచి పెట్టినవాడు’ అని చెప్పడు. అదుపులో ఉంచుకుంటాడన్న మాటకు అర్థం ఏమిటంటే- కోపమే లేకపోతే వ్యవస్థను చక్కబెట్టడం కుదరదు. రేపు మీరు ఒక పెద్ద అధికారి అవుతారు. మీరు కోపమే చెందలేదనుకోండి. దారితప్పిందని మీరు భావించిన వ్యవస్థను చక్కబెట్టడం సాధ్యం కాదు. దాన్ని చక్కదిద్దడానికి ఒక్కోసారి కోపాన్ని నటించాలి. దాన్ని ఒక ఉపకరణంగా, సాధనంగా వాడుకోవాలి.
అలాకాకుండా అనవసర సందర్భాల్లో కోపం వినాశన హేతువు. అసలు కోపం ఎవడి మీద ప్రభావం చూపుతుందంటే..అవతలివాడు దానికి ప్రభావితుడవుతాడో లేదో తెలియదుకానీ, కోపం ప్రదర్శించినవాడిమీద మాత్రం తప్పక ప్రభావం చూపిస్తుంది. అందుకే కోపమంత శత్రువు లోకంలో మరొకటిలేదు. లోపలినుంచి పైకి ఉబికి వస్తున్న కోపాన్ని ఓర్పు అన్న పరికరంతో తీసేయడం అలవాటున్నవాడు పాము కుబుసాన్ని విడిచినట్లు తన పరిశీలనాత్మకమైన ప్రవర్తనచే విడిచిపెట్టినవాడవుతాడు. జీవితంలో ధర్మాత్ముడు. వాడు వృద్ధిలోకి వస్తాడు. అసలు ప్రధానంగా కావలసింది-తన కోపాన్ని తాను పరిశీలించు కోగలగడం.
ఇది చేతకాకపోతే దాన్నుంచే ఎన్నో అవగుణాలు పుడతాయి. కోపమొక్కటే స్వభావంగా మారిపోతే-ఒక నెగడు (నిప్పు) దగ్గరకెళ్ళి కర్రపెట్టి పొడిస్తే అందులోంచి నిప్పురవ్వలు రేగినట్లు -అందులోంచి వచ్చే మొట్టమొదటి అవగుణం అసూయ. గుణవంతు లయిన వ్యక్తులలో లేని అవగుణాలను ఆరోపించి మాట్లాడడం అలవాటవుతుంది. అవతలివాడిని పాడుచేయడానికి, పగతో కూడుకున్న దుర్మార్గపు ఆలోచనలు చేసి అమలచేసే విధానం మనసులో ప్రచోదనం అవుతుంది. తన స్థాయినిమించి వదరి మాట్లాడడం వంటి ఎన్నో అవగుణాలు మూటగట్టుకోవడానికి కారణమవుతుంది.
అందుకే దాన్ని పరిశీలనం చేసుకోవడానికి పెద్దలు కొన్ని మార్గాలు చెబుతారు. కోర్కె తల్లి అయితే-దానిలోంచి ఉద్రేకపూరిత భావన ఒకటి పుడుతుంది. దానికి రెండు తలలు ఉంటాయి. ఒకటి శోకం. రెండవది అదుపు తప్పిన స్థితి. అదే కోపం. అందుకే మనసు వెంటనే -నాకోరిక తీరడానికి కారణమెవరు ? అని వెతుక్కుంటుంది. దేన్నో ఒకదాన్ని పట్టుకోవాలిగా. పట్టుకున్న దానిమీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. శోకాన్ని, కోపాన్ని రెండు ముఖాలుగా పెట్టుకుని ప్రవర్తిస్తుంటుంది. దీనికి శాస్త్రం చెప్పిన పరిష్కారం ఏమిటంటే...
కోపానికి ఆజ్యం..అవతలివారి అవగుణాలు వెతుక్కుంటూ పోవడమే కదా! అలా వెతికే ముందు ‘‘నేను ఎన్నో తప్పులు చేసాను, కాబట్టి ఇతరుల మీద కోప్పడడానికి నాకేం అధికారం ఉంది ? అసలు నేను ఏ తప్పూ చేయనివాడనా?’’ అన్న ప్రశ్న వేసుకోవాలని శాస్త్రం చెప్పింది. రెండవది-అవతలివాడు కోపాన్ని పొందాడంటే.. ఏ పరిస్థితుల్లో పొందాడో! ఒక్కొక్కసారి కోపం రావడానికి ఏదో పరిస్థితి కారణమవుతుంది. అది మాటామాటా పెరిగి పోయి ఎంతదూరమైనా వెడుతుంది. ’’నాకటువంటి పరిస్థితి కలుగదు. నాకా అవకాశం రాలేదు. హే జగదంబా! ఏ కారణములు నాకేర్పడలేదో, నాకు కోపం రావడానికి ఏకారణాలు కారణం కాలేవో అటువంటి పరిస్థితులే అందరికీ కలిగేటట్లుగా అనుగ్రహించు’’. అదే నిజమైన ప్రార్థన.
అలా ప్రార్థన చేసేవాడు ఉత్తమ సాధకుడు. ఇది సాధించాలంటే ఉండాల్సింది. ఓర్పు... అదే క్షమ. క్షమా యశః - అంటారు. సమస్తమైన కీర్తికీ అదే కారణం. ఎంత ఓర్పండీ మహానుభావుడికి! అంటారు. ఎంత ఓర్పండీ భూదేవికి! ఎంత ఓర్పండీ నా తల్లి సీతమ్మకి! ఈ ఓర్పు ఉన్న వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంది. అందుకే మీ క్రమశిక్షణాయుత జీవితానికి ఈ గుణములు ఎంతో అవసరం. మీరు ఇంకా మీ నిజ జీవితంలోకి ప్రవేశించలేదు. ప్రవేశించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వ్యక్తిత్వ వికాస అభ్యాసం కూడా అందులో భాగమే.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు