ద్రాక్ష... గుండెకు రక్ష!
గుడ్ ఫుడ్
పండ్లలో మామిడిని ‘రారాజు’గా చెబుతారు. ‘ద్రాక్ష పండు’ను రాణిగా అభివర్ణిస్తారు. ద్రాక్ష రుచిలోనే కాదు... ఆరోగ్యాన్నివ్వడంలో తనకు తానే సాటి. గుండె జబ్బులను అరికట్టడంలో మేటి. 100 గ్రాముల ద్రాక్షపండ్లలో 69 క్యాలరీల శక్తి ఉంటుంది. 191 మైక్రోగ్రాముల పొటాషియమ్ దొరుకుతుంది. సూక్ష్మపోషకాలైన కాపర్, ఐరన్, మ్యాంగనీస్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. ద్రాక్షలోని ‘రెస్వెరట్రాల్’ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్. రక్తనాళాల్లో పూడికను నివారించి గుండెజబ్బులను అరికట్టగలదు. అలై్జమర్స్ డిసీజ్, డయాబెటిస్, క్యాన్సర్‌లనూ నివారిస్తుంది.
రక్తనాళాలను సన్నబర్చే యాంజియోటెన్సిన్ అనే హార్మన్ ఉత్పత్తిని తగ్గించి... గుండెజబ్బులను నివారిస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్‌ను వెలువరచి రక్తనాళాలను విప్పార్చి ఉండేలా చేస్తుంది. రక్త ప్రవాహం సాఫీగా జరపడం ద్వారా గుండెజబ్బులను దరిచేరకుండా చూస్తుంది. అందుకే ద్రాక్ష అంటే గుండెకు మేలు చేసేదన్న విషయం గుర్తుంచుకోవాలి.