గూగుల్‌ను ఆకట్టుకొన్న యంగ్ టీమ్!
భారత్ నుంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వచ్చే యువత సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది... భవిష్యత్తులో వాళ్లంతా స్వదేశంలోనే సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం మొదలు పెడతారు... అని అంటాడు రాహుల్ జైన్. ‘అప్యూరిఫై’ అనే అప్లికేషన్ ద్వారా గూగుల్ ఐఎన్‌సీ నుంచి పెట్టుబడులను ఆకర్షించిన యువభారతీయ బృందంలో ఒకరు రాహుల్‌జైన్(27). జై శ్రీనివాసన్, మనీశ్‌లతో కలసి రాహుల్‌జైన్ అప్యూరిఫై అప్లికేషన్‌ను రూపొందించాడు. ఇప్పుడు ఈ బృందం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొంది.
యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో చదువు పూర్తి కాగానే రాహుల్ జైన్ జింగా అనే గేమింగ్ డెవలప్‌మెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించాడు. చదివిన చదువు, చేస్తున్న పని అతడిలోని సృజనాత్మకతను మేల్కొల్పాయి. ఉద్యోగాన్ని వదిలి సొంతంగా కొత్త అప్లికేషన్‌ను రూపొందించాలనే ఆలోచనను కలిగించాయి. ఇలాంటి మేధోమథనం నుంచే ‘అప్యూరిఫై’ అనే అప్లికేషన్ పుట్టింది. తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఆ అప్లికేషన్‌కు ప్రాణం పోసే పనిలో పడ్డాడు రాహుల్. ఇతడి అప్లికేషన్ గురించి సమాచారమందుకొన్న గూగుల్ పెట్టుబడి దారుగా రంగంలోకి దిగింది.
ఆ అప్లికేషన్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్న గూగుల్ దాన్ని టేకోవర్ కూడా చేసింది. గూగుల్ మానసపుత్రిక అయిన ఆండ్రాయిడ్ అపరేటింగ్ సిస్టమ్‌లో ఆ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచడానికి ఒకింత భారీ మెత్తాన్ని చెల్లించి జైన్‌తో ఒప్పందం చే సుకొంది. దీంతో ఈ యువకుడి దశ తిరిగింది. పేరు మార్మోగింది. తన అప్లికేషన్‌ను గూగుల్‌కు అమ్మడం ద్వారావచ్చిన డబ్బును మరిన్ని స్టార్టప్‌ల మీద పెట్టుబడిగా పెడుతున్నాడు రాహుల్ జైన్. వివిధ అవసరాల కోసం మనిషికి సదుపాయంగా ఉండే అప్లికేషన్‌ను అభివృద్ధి పరచడానికి సరికొత్త అప్లికేషన్‌ల రూపకల్పనకు పూనుకొన్నాడు. ప్రముఖ వ్యవస్థాపకుడిగా మారాడు.
‘భారత్‌లో వ్యాపారవేత్తల్లోఎక్కువమంది ఇన్నిరోజులూ సేవారంగానికి సంబంధించిన విభాగాలపైనే దృష్టిపెట్టారు. ఔట్‌సోర్సింగ్ రూపంలో కార్మికవృత్తికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయంలో మార్పు వస్తోంది. భారతీయులు తమ తెలివితేటలను విభిన్న రంగాల్లో వ్యాపారాభివృద్ధిని సాధించడానికి పెట్టుబడిగా పెడుతున్నారు...’ అనేది జైన్ విశ్లేషణ. ఈ విశ్లేషణ ఇతరుల విషయంలో ఏమో కానీ... జైన్ విషయంలో అయితే మాత్రం వంద శాతం నిజమనిపిస్తుంది.
జైన్ కంఫర్ట్‌జోన్ నుంచి బయటకు వచ్చి జై శ్రీనివాసన్, మనీశ్‌లను కలుపుకొని అప్లికేషన్ రూపకల్పన ఆలోచన చేశాడు. ఆ సాహసమే విజయానికి దారి చూపింది. అప్లికేషన్ ఐడియా గురించి చెప్పగా గూగుల్ వెంచర్స్ వాళ్లు 1.75 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టడానికి ముందుకొచ్చారు. అనంతరం మరో 4.5 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించి ఆ అప్లికేషన్‌ను పూర్తిగా కొనేశారు. దీంతో జైన్ బృందం దశ తిరిగింది.
రాజీ పడిపోయి ఉద్యోగాలు చేసుకొంటూ, కంఫర్ట్ జోన్‌లో ఉన్నామని ఆనందిస్తూనే, మరోవైపుగా ఆందోళన పడటం కంటే... ఆత్మవిశ్వాసం ఉంటే సాహసం చేయడమే మంచిదనేది జైన్ సిద్ధాంతం. తను ఇప్పుడు అనుసరించిన ఈ బాటనే రానున్న రోజుల్లో మరింతమంది భారతీయ యువతీ యువకులు అనురిస్తారని జైన్ భావిస్తున్నాడు. ఈ మాటల ద్వారా అనేక మందిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు.
రాహుల్‌జైన్ కాన్పూర్‌కు చెందిన యువకుడు. తండ్రి ప్రభుత్వ పనులను చేసిపెట్టే కాంట్రాక్టర్. ఉద్యోగాన్ని వదిలి ఈ విధంగా అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి మొదట ఇంట్లో మద్దతు లభించలేదని... అయినప్పటికీ తను రిస్క్ చేశానని జైన్ చెబుతాడు. మరి ఇప్పుడు ఆ రిస్క్‌కు తగినట్టుగా విజయాన్ని సాధించడం ఎంతో ఆనందాన్నిస్తుందని అంటాడు.