
గొప్ప ఆస్ట్రేలియా కథకుడిగా హెన్రీ లాసన్ (1867–1922) పేరు చెబుతారు. హెన్రీ తల్లిదండ్రులు ఐరోపా నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లినవారు. ఆయన తండ్రి నీల్స్ లార్సన్. గనుల్లో పనిచేసేవాడు. ‘ఆంగ్లీకరణ’ వల్ల పీటర్ లాసన్ అయ్యాడు. తల్లి లూయిజా లాసన్ స్త్రీవాద రచయిత్రి. చిన్నతనంలో చెవికి ఇన్‌ఫెక్షన్ సోకిన హెన్రీ పద్నాలుగేళ్ల వయసొచ్చేసరికి వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయాడు. దీంతో తరగతి గది పాఠాల్ని అర్థం చేసుకోవడం కష్టమైంది. ఇలాంటి సమయంలో సాహిత్యమే పాఠాలు నేర్పింది. తల్లి ప్రభావం కూడా సహజంగానే పడింది. చిన్న, తీక్షణమైన వాక్యాలు హెన్రీ శైలి. నగరంలో తన జీవితాన్ని అధికంగా గడిపినా పల్లీయులతో ఎక్కువ అనుభవాలున్నాయి.
స్ట్రేలియా గ్రామీణ జీవితం ఆయన రచనల్లో గొప్పగా వ్యక్తమైంది. మూలవాసిత్వపు ముడిభాషనూ, సొగసునూ రచనల్లోకి తెచ్చే ‘బుష్ పొయెట్’లలో ఒకడిగానూ పేరొందాడు. కథల కన్నా స్కెచ్‌లు మరింత ఉత్తమ కథారూపాలని అభిప్రాయపడేవాడు. ఎన్నో కథా, కవితా సంకలనాలు వెలువరించాడు. తండ్రి తరచూ ఇంటికి దూరంగా ఉండటం వల్ల తల్లి తమను పెంచడానికి పడిన కష్టం ప్రతిఫలించే ‘ద డ్రోవర్స్ వైఫ్’ ఒకవైపూ, తల్లి వల్ల తండ్రి ఎలా క్షోభ పడ్డాడో వ్యక్తమయ్యే ‘ఎ చైల్డ్ ఇన్ ద డార్క్, అండ్ ఎ ఫారిన్ ఫాదర్’ మరోవైపూ కూడా లాసన్ రాయగలిగాడు. చిత్రంగా, తన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లు కూడా లాసన్ శాంతి సౌఖ్యాలను హరించాయి. అదే అశాంతిలోనే ఆయన మరణించాడు.