గ్రేట్ రైటర్
ఇటలీ నుంచి అమెరికాకు వలస వెళ్లింది మారియో పూజో(1920–1999) కుటుంబం. పేదవాళ్లు. పూజో ఏనాటికైనా రైల్‌రోడ్ క్లర్క్ అయితే చాలనుకుంది వాళ్లమ్మ. కానీ ఇతడు గ్రంథాలయంలో గడపడం మొదలుపెట్టాడు. ఉపాధి కోసం చిన్నాచితకా పనులు చేస్తూనే రాయడం ప్రారంభించాడు. తొలి రచనలు విమర్శకుల ప్రశంసలు పొందినా ఆర్థికంగా కలిసిరాలేదు. కానీ 1969లో వచ్చిన ‘ద గాడ్‌ఫాదర్’ ప్రభంజనం సృష్టించింది. పూజోను అమాంతం ప్రపంచశ్రేణి రచయితగా నిలబెట్టింది. ఇటాలియన్ మాఫియా కథలను చాలా కొత్తగా, తీవ్రంగా ప్రపంచానికి పరిచయం చేశాడు పూజో.
జీవితంలో ఏనాడూ ఏ ఒక్క గ్యాంగ్‌స్టర్‌నూ ఆయన ప్రత్యక్షంగా కలుసుకోలేదంటారు. అయినా వాళ్లు అలాగే ప్రవర్తిస్తారన్నంత వాస్తవికంగా చిత్రించాడు. ఈ నవల విజయం తర్వాత కొనసాగింపుగా గాడ్‌ఫాదర్ 2, 3 రాశాడు. వీటిని అంతే శక్తిమంతంగా గాడ్‌ఫాదర్ ట్రయాలజీగా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా తెరకెక్కించడం అదో చరిత్ర! పాత్రికేయుడిగానూ, స్క్రీన్‌రైటర్‌గానూ పనిచేసిన పూజో ఇతర నవలలు: ఫూల్స్ డై, ద సిసీలియన్, ద ఫోర్త్ కె., ద లాస్ట్ డాన్.
Comments
Please login to add a commentAdd a comment