వాస్తవానికీ కల్పనకూ మధ్యన అంతరాన్ని చెరిపేసిన రచయితగా ఫిలిప్ రాత్‌కు పేరు. బలమైన ఆత్మకథాత్మక పాత్రలు ఆయన రచనల్లో కనబడతాయి. రాజకీయాలపై వ్యంగ్యం, సామాజిక వ్యాఖ్యానం, లైంగికతపై ముసుగులేని ఆలోచనలు చేస్తాడు. జీవితం తాలూకు సిగ్గులేని కల్మషాన్ని వ్యక్తపరుస్తాడు. నాథన్ జుకెర్‌మాన్ పాత్రే మళ్లీ మళ్లీ అతడి రచనల్లో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ‘నా జీవితపు అసలైన డ్రామా నుంచి ఒక నకిలీ ఆత్మకథని, బూటకపు చరిత్రని, అర్ధ కల్పిత అస్తిత్వాన్ని పుట్టించటమే నా జీవితం’ అంటాడు.
ఒక నవలను శ్రద్ధగా చదవాలంటే అది పాఠకుడినుంచి కొన్ని గుణాలు డిమాండ్ చేస్తుందనీ, అవి ఉన్నవాళ్లు చాలా తక్కువమంది అనీ, అందుకే భవిష్యత్తులో చదవడం అనేది కొద్దిమందికే పరిమితం కాబోయే కార్యక్రమమనీ నిరాశ పడతాడు. ‘గుడ్‌బై, కొలంబస్’, ‘ఎమెరికన్ పాస్టరల్’, ‘ద హ్యూమన్ స్టెయిన్’, ‘పోర్ట్‌నోయ్స్ కంప్లెయింట్’, ‘మేరీడ్ ఎ కమ్యూనిస్ట్’, ‘ఎవ్‌రీమేన్’, ‘వెన్ షి వజ్ గుడ్’, ‘ద ఘోస్ట్ రైటర్’ ఆయన ప్రసిద్ధ నవలల్లో కొన్ని. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు రాత్. అమెరికాలో ఒక యూదుడిగా తన అనుభవాల్ని రాసినప్పటికీ తనను తాను యూదుడు అనుకోవడానికి ఇష్టపడలేదు. అమెరికా పౌరుడిగానే భావించాడు. 1933లో జన్మించిన ఫిలిప్ రాత్ తన ఎనభై అయిదో ఏట గత నెల మే 22న కన్నుముశాడు.
Comments
Please login to add a commentAdd a comment