మేను హాయిలే ఇలా...
నల్లబడడం, మంటగా అనిపించడం, నిస్తేజంగా మారడం, మచ్చలు, మొటిమలు, పిగ్మేంటేషన్.. వంటివి వేసవిలో చర్మం ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. మీరు వీటి నుంచి దూరంగా ఉండాలంటే దాడి చేసే వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలి. అమితమైన వేడికి తోడు అధికమైన గాలి కూడా ఈ కాలంలో చర్మాన్ని నిర్జీవం చేస్తుంది. ఫలితంగా సున్నితమైన చర్మం దెబ్బతిని, పై పొరలో మృతకణాలు ఏర్పడతాయి. స్వేదరంధ్రాలకు మృతకణాలు అడ్డుతగలడంతో అవి తగినంత సహజ నూనెలను విడుదల చేయలేవు. దీంతో చర్మం మరింత పొడిబారి త్వరగా ముడతలు పడుతుంది. ఇలాంటప్పుడే చర్మానికి సంరక్షణ అవసరం.
మీది సాధారణ చర్మతత్త్వమా?
మృతకణాలు టీ స్పూన్ ఓట్స్, టీ స్పూన్ బేకింగ్ సోడా, తగినంత నీళ్ళు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమంతో 2-3 నిమిషాలు ముఖాన్ని, మెడను, చేతులను మృదువుగా రుద్దాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలంలో చర్మంపై పొలుసులుగా చేరిన మృతకణాలు సులువుగా వదులుతాయి. ఈ మిశ్రమం అన్ని రకాల చర్మతత్త్వాలకు ఉపయోగపడుతుంది
నిన్నమొన్నటి వరకు చలికి చర్మం పొడిబారకుండా చూసుకున్నాం.
హమ్మయ్య! అనుకున్నామో లేదో... ఎండలు మొదలైపోయాయి...
సూర్యుడు చండప్రచండంగా తన ప్రతాపం చూపించేస్తున్నాడు...
ఆ వేడిని తట్టుకోలేక శరీరం త్వరగా అలసిపోతే...
చర్మం జీవం కోల్పోతుంది... సాధారణంగా ఈ కాలం వేధించే సమస్యలు చర్మం దరిచేరకుండా చూసుకోవాలని...
కాలాన్ని అను‘కూల్’గా
మార్చుకోవాలనేవారి కోసమే ఈ సూచనలు
మృదుత్వం
టీ స్పూన్ శనగపిండి, టీ స్పూన్ నిమ్మరసం, 2-3 పుదీనా ఆకులు, పెరుగు, క్యారట్ తురుము కలిపి పేస్ట్ చేసిన మిశ్రమాన్ని చర్మానికి రాసి, వలయాకారంగా రుద్దుతూ మసాజ్ చేయాలి. ఇది చర్మంపై మలినాలను, పై మృతకణాలను తొలగిస్తుంది. ఫలితంగా చర్మం మృదువుగా అవుతుంది.
తాజాదనం
బొప్పాయిగుజ్జు, పైనాపిల్ గుజ్జు, ద్రాక్ష నూనె, పసుపు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మం తాజాగా కనిపిస్తుంది.
మొటిమలు
రెండు టేబుల్ స్పూన్ల దోసరసం, టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, గంధంపొడి, పుదీనా, తులసి ఆకులు కలిపి ముద్ద చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలలో పొడిబారిన సీబమ్ తొలగిపోతుంది. స్వేదరంధ్రాలు శుభ్రపడటం వల్ల ఇన్ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియా నశించి, మొటిమల సమస్య తగ్గుతుంది.
సహజమే మేలు
వేసవిలో చర్మానికి బ్లీచింగ్, క్లెన్సింగ్, స్క్రబ్బింగ్ తప్పక అవసరం అవుతాయి. అయితే ఇందుకు రసాయన ఉత్పత్తులకు బదులు సహజసిద్ధమైన ఉత్పాదనల్ని ఎంచుకోవాలి.
నోట్: అలోవెరా ఆకును తుంచి, దాన్నుంచి వచ్చిన రసానికి రోజ్‌వాటర్ కలిపి చర్మంపై మృదువుగా మసాజ్ చేస్తూ ఉంటే ఎండ కారణంగా నల్లబడిన చర్మానికి సహజకాంతి వస్తుంది. దురద, దద్దుర్లు వంటి సమస్యలు తగ్గుతాయి.
మీది జిడ్డుచర్మమా?
జిడ్డుచర్మం గలవారికి వేసవి మరింత పరీక్ష పెడుతుంది. చమట అధికమై బయటి దుమ్ము, ధూళి చేరి చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. నివారణకు...
ఫేసియల్ బ్లీచ్: 4 టేబుల్‌స్పూన్ల పాలు, టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్‌స్పూన్ల నిమ్మరసం కలిపి చర్మం కమిలి నల్లబడిన చోట రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.
పెరుగుతో క్లెన్సర్: 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల తేనె, 3 టేబుల్ సూన్ల నిమ్మరసం వేసి చిక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 2-3 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.
వేపతో నివారణ: వేప ఆకుల ముద్ద, నారింజ తొనల ముద్ద సమానపాళ్లలో తీసుకోవాలి. దీంట్లో చందనం, ముల్తానీమిట్టి, తేనె, నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి.
నారింజ రసం: టీ స్పూన్ నారింజ రసం, 3 టీ స్పూన్ల ఓట్స్, టీ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన లేదా పెరుగు ఓ టీ స్పూన్ కలిపి ముఖానికి పట్టించి, వలయాకారంగా 5 నిమిషాల సేపు స్క్రబ్ చేయాలి. తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి.
బియ్యప్పిండి: మూడు టీ స్పూన్ల బియ్యప్పిండి, చిటికెడు పసుపు, టీ స్పూన్ తేనె, దోస రసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. మేనికి కూడా ఇది మేలైన ప్యాక్.
మీది పొడిచర్మమా?
చలికాలంలో చర్మం పొరలలో ఏర్పడిన ఇతర సమస్యలు వేసవిలో బయటపడుతుంటాయి. అయితే జిడ్డు చర్మం కన్నా పొడిచర్మాన్ని వేసవిలో సులువుగా సంరక్షించుకోవచ్చు.
ఎండ నుంచి రక్షణగా...
పొడిచర్మం కాబట్టి ఎస్.పి.ఎఫ్ 30 గల మాయిశ్చరైజర్‌ను, సన్‌స్క్రీన్ లోషన్ ను ఉపయోగించడం మేలు. పెదవులపై చర్మం పొడిబారడం, పగుళ్ల సమస్యలకు నివారణగా ఎస్.పి.ఎఫ్ 30 ఉన్న లిప్‌బామ్‌ను ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత విటమిన్ ‘ఇ’ ఉన్న మాయిశ్చరైజర్‌ను వాడాలి.
జీవకాంతికి
ఎండాకాలంలో చర్మం పైపూతలకు కాకుండా లోపలి పొరలు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తపడాలి. పగటి పూట నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం సహజమైన నూనెలను విడుదల చేస్తుంది. శరీరబరువును బట్టి నీటిని సేవించాలి. ఉదా: మీ శరీర బరువు 50 కేజీలు అయితే, 5 లీటర్ల నీరు తాగాలి.
మద్యం ఉత్పాదనలు వద్దు
ఆల్కహాల్‌ని సౌందర్య ఉత్పాదనలలో సువాసనల కోసం ఉపయోగిస్తారు. పొడి చర్మం గలవారు ఆల్కహాల్ ఉత్పాదనలు వాడితే చర్మం మరింత పొడిబారుతుంది. ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు లేబుల్‌పై ఇచ్చిన జాబితాలో ‘ఆల్కహాల్’ లేనిది చూసి మాత్రమే కొనుగోలు చేయాలి. ఈత కొలనులలో కలిపే క్లోరిన్ వల్ల చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. ఈత పూర్తయిన తర్వాత మరొకసారి మంచినీటితో స్నానం చేసి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ఏసీ చల్లదనమా?!
వేసవిలో చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్‌ల వాడకం ఎక్కువ. అయితే ఇవి ఉత్పత్తి చేసే చల్లని గాలులు చర్మంపై సహజసిద్ధమైన తేమను లాగేసి, పొడిబారుస్తాయి. మీ చర్మం సురక్షితంగా ఉండాలంటే గాలిలో తేమ తగ్గకుండా వారానికి ఒకసారి ఇంటిలో నీటిని స్ప్రే చేయాలి.