వెంట్రుకలు కథ చెప్తాయి...
కొలంబియా దేశానికి బానిసలుగా వెళ్లిన ఆఫ్రికన్లు నాలుగు వందల ఏళ్లుగా తమ తలకట్టు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు.
‘ఆశల ఆల్లిక’ పేరుతో ప్రతి సంవత్సరం జూలై నెలలో అక్కడ జడల పోటీ నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటిచెబుతున్నారు.
జుట్టుదేముంది అనుకోవద్దు. దాని వెనుక మానవజాతికి ఉన్నంత చరిత్ర ఉంది. నల్ల జుట్టు, తెల్ల జుట్టు, రాగి రంగు జుట్టు... జుట్టు స్వభావం ఒక జాతిని నిర్దేశిస్తుంది. విభజిస్తుంది. ఒక జాతి మీద మరొక జాతిని ఆధిపత్యం చెలాయించమని కోరుతుంది. ఒక్కో దేశంలో ఒక్కో సమూహం ఈ వివక్షను ఎదుర్కొందిగానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఎదుర్కొన్నది ఆఫ్రికన్లే. అందుకే వారు ‘మా జట్టు మా సొంతం’ అంటున్నారు.
కొలంబియాలో కష్టాలు: ఉత్తర, లాటిన్ అమెరికాల్లోని రాగి, బంగారు గనులు, వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయడానికి ఆఫ్రికా దేశాల నుంచి నల్లవాళ్లను పట్టుకొచ్చేవారు. వీళ్లను ఇక్కడ బానిసలుగా చేసుకునేవారు. వీళ్లకు గొడ్డు చాకిరీ ఉండేది. స్త్రీలు అతి కష్టమ్మీద దొరికే తీరికలో తన పిల్లలకు జుట్టు దువ్వుకునేవారు. ఆఫ్రికన్లది రింగుల రింగుల జుట్టు. వారు జడలు కట్టిన రీతిలో జుట్టును అలంకరించుకోవడం పరిపాటి. అయితే ఇందుకు ఏమాత్రం సమయం దొరికేది కాదు. అమెరికన్ యజమానులు అందుకు అవకాశం ఇచ్చేవారు కాదు. పైగా జుట్టును జడలుగా వేసుకోవడానికి అంగీకరించేవారు కాదు.
దీనికి కారణం ఏమిటంటే... బానిసలు ఈ జడలను సంకేతాలుగా ఉపయోగించుకునేవారు. ‘ఫలానా విధమైన’ జడను వేసుకుంటే ఈ రాత్రికి ఊరి నుంచి పారిపోబోతున్నట్టు అర్థం అనే సిగ్నల్ ఇచ్చే వీలుండేది. అంతే కాక చిక్కటి జడలలో తాము పని చేసే గనుల నుంచి బంగారం దాచుకునేవారు. గనుల నుంచి పారిపోతే ఆ బంగారం ఉపయోగపడుతుందని వారి ఆలోచన. అందువల్ల కూడా యజమానులు వారిని జడలు వేసుకోవడానికి వారించేవారు.
ఆశల అల్లిక: 1850లలోనే కొలంబియా దేశంలో బానిసత్వం రద్దయ్యింది. అయినప్పటికీ అక్కడ ఉన్న నల్లవాళ్ల కట్టు, బొట్టు, సంస్కృతుల మీద దాడి కొనసాగింది. చూసి చూసి ఆఫ్రికన్లు తిరగబడ్డారు. సాంస్కృతిక స్వాతంత్య్రం కావాలని, ‘మా జుట్టు మా స్వేచ్ఛ’ అని చాటి చెప్పడానికి గత పదేళ్లుగా ఆ దేశంలోని నైరుతి ప్రాంత నగరమైన ‘కాలి’లో ‘ఆశల అల్లిక’ పేరుతో శిరోజాలు అల్లే పోటీని ప్రతి ఏటా జూలైలో నిర్వహిస్తున్నారు. కొలంబియాలో ఉన్న ఆఫ్రికన్ యువతులు, ఆడపిల్లలు అక్కడికి వచ్చి పోటీలో ఉత్సాహంగా పాల్గొంటారు. గంటల తరబడి తమ కేశాలను జడలు అల్లి ఆశ్చర్యకరమైన తలకట్టును ప్రదర్శిస్తారు. బహుమతులకంటే... ఈ విషయం దేశ విదేశాలలో ప్రచారమై ‘మన తల కట్టును మనం గౌరవించుకోవాలి’ అనే భావన పెరుగుతోంది. భారతదేశంలో జడ ఒక అందమైన తలకట్టు. దాని చిన్న చూపు చూసేవారు ఇలాంటి కథనాలు చూసి ఏమంటారో!