భుజియాతో బిలియన్లు... | Haldirams Snacks Special Story | Sakshi
Sakshi News home page

భుజియాతో బిలియన్లు...

Published Sat, Jul 27 2019 1:14 PM | Last Updated on Sat, Jul 27 2019 1:14 PM

Haldirams Snacks Special Story - Sakshi

గంగ భిశాణ్‌ ఉరఫ్‌ హల్దీరామ్‌... భుజియా నుంచి బిలియన్లకు చేరారు... ఒకటి రెండు కాదు మూడు బిలియన్లు... ప్రపంచ స్నాక్స్‌లో ద్వితీయస్థానానికి చేరారు.. ఎనిమిది దశాబ్దాలుగా తిండి ప్రియులకు రుచులు అందిస్తున్న గంగా భిశాణ్‌ స్థాపించిన హల్దీరామ్స్‌ విజయగాథ ఈ వారం మన ఫుడ్‌ ప్రింట్స్‌...

బికనీర్‌లో 1937లో అతి సామాన్యంగా ప్రారంభమైన స్నాక్స్‌ వ్యాపారం... ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ ఈ రోజు ప్రపంచంలోనే స్నాక్‌ ఫుడ్స్‌ వ్యాపారంలో రెండో స్థానానికి చేరుకుంది. బ్రేక్‌ ఫాస్ట్‌ ఉత్పత్తులైన కెలాగ్స్‌ కూడా హల్దీరామ్స్‌లో చేరింది. ఇప్పుడు వీరి టర్నోవర్‌ మూడు బిలియన్ల డాలర్లకు (కలకత్తా మినహా) చేరుకుంది. ఒక చిన్న భుజియా దుకాణంతో ప్రారంభమైన ఈ వ్యాపారం, కుటుంబ కలహాలను, అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ అత్యున్నతస్థాయికి చేరుకుంది.

విలవలతో...
హల్దీరామ్స్‌ పేరు భారతదేశ ఖ్యాతికి కలికితురాయిగా నిలిచింది. 1937లో బికనీర్‌లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ దుకాణం ఇప్పుడు ప్రపంచస్థాయికి ఎదిగింది. గంగా భిశాణ్‌ అగర్వాల్‌ని తల్లి ముద్దుగా హల్దీరామ్‌ అని పిల్చుకునేది. భిషాణ్‌ ఆంటీ ఒకరు వీరి ఇంట్లోనే తరచుగా బికనీరీ భుజియా తయారుచేస్తుండేది. అది చాలా రుచిగా ఉండటంతో, అగర్వాల్‌ తల్లి ఆవిడ దగ్గర నేర్చుకుంది. తల్లి దగ్గర అగర్వాల్‌ నేర్చుకున్నారు. బికనీర్‌లోని భుజియా బజార్‌లో ఉన్న తన బంధువుల దుకాణంలో చేరిన తరవాత, తన ఆంటీ ఉపయోగించిన విధానాన్ని అనుసరించారు అగర్వాల్‌. పవిత్ర కుమార్‌ రచించిన ‘భుజియా బ్యారన్స్‌’లో అగర్వాల్‌ కనిపెట్టిన కొత్తవిధానంలో భుజియా తయారుచేయడం గురించి ప్రస్తావించాడు. ఒకరకమైన పిండిని జతచేసి దానితో సన్నటిమెష్‌ మీద భుజియా తయారు చేసేవాడు. తన కొత్త ఉత్పత్తిని ఏ విధంగా మార్కెట్‌ చేసుకోవాలో అగర్వాల్‌కి బాగా తెలుసు. బికనీర్‌ని పరిపాలించిన మహారాజులలో దంగర్‌కి మంచి పేరు ఉంది. ఆయన పేరు మీదే ‘దంగర్‌ సేవ్‌’ అని పేరు పెట్టాడు. అంతే! ఆయన దశ మారిపోయింది. మార్కెట్‌లో మంచి పేరు సంపాదించేశాడు. వారానికి రెండు వందల కిలోలు అమ్మడం ప్రారంభించాడు. కిలో ధర 2 పైసల నుంచి 25 పైసలకి పెరిగింది’ అని పవిత్ర కుమార్‌ తన పుస్తకంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

ఇలా మొదలైంది...
అగర్వాల్‌ పొడవుగా, సన్నగా, ఆరోగ్యంగా ఉండటంతో, పిల్లలకు, మనవలకు కూడా అగర్వాల్‌ అంటే చాలా భయం వేసేదట. ఆయన చాలా తక్కువగా నవ్వుతారట. డెబ్బై సంవత్సరాలు నిండాక కూడా తన ఊరంతా సైకిల్‌ మీదే తిరిగేవారట. హల్దీరామ్‌ ఒకసారి కోల్‌కతాలో ఒక పెళ్లికి వెళ్లినప్పుడు, అక్కడ కూడా ఒక షాపు తెరవాలనే ఆలోచన కలిగిందట. బికనీర్‌లో కాకుండా బయట ప్రారంభించిన మొట్టమొదటి దుకాణం అదే. ఆయన తరవాతి తరం వారు వ్యాపారాన్ని పెద్దగా వృద్ధి చేయలేదు. మనమలు మనోహర్‌లాల్‌ శివకిషన్‌ ఈ వ్యాపారానికి వారసులుగా నిలిచి, నాగపూర్, ఢిల్లీలలో బ్రాంచీలు తెరిచారు. ఢిల్లీలోని చాందినీచౌక్‌లో షాపు తెరిచిన కొత్తల్లోనే అందరినీ ఆకట్టుకోవటంతో, ఢిల్లీ, నాగపూర్‌లలో ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించారు. ఆ తరవాత పెద్ద పెద్ద నగరాలలో, విదేశాలలో రెస్టారెంట్లు తెరిచారు. మొత్తం 20 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. గంగాభిశాణ్‌ వారసులు ట్రేడ్‌మార్కు గురించి వాదులాడుకున్నారు. ఇప్పటికీ ఆ కేసు సుప్రీంకోర్టులోనే ఉంది.

బికనీర్‌ నుంచి ఫ్రెంచ్‌ బేకరీ దాకా...
1937లో బికనీర్‌లో గంగా భిశాణ్‌ భుజియా షాప్‌ ప్రారంభించినప్పుడు, హల్దీరామ్‌ స్వయంగా వెజ్‌ షమీ కెబాబ్, సోయా షమీ కెబాబ్, దహీ కెబాబ్, హరాభరా కెబాబ్‌లను తయారు చేసేవారు. క్రమేపీ ఇక్కడ రసగుల్లా, సోమ్‌ పాపిడీ, పానీపురీ... వంటివి కూడా ప్రారంభించారు.

కెలాగ్స్‌ ఇందుకే ఇటు వచ్చింది...
ఎంత విదేశీ మార్కెట్లయినా దేశీ మార్కెట్లతో కలిస్తేనే స్థానికత ఉంటుందనే ఉద్దేశంతో, హల్దీరామ్స్‌లోకి వచ్చి చేరిపోయింది కెలాగ్స్‌. మెక్‌డెనాల్డ్స్‌ మొట్టమొదట 1996లో ఢిల్లీ బసంత్‌లోక్‌లో ప్రారంభమైనప్పుడే, ఇక్కడ బీఫ్, పోర్కుకి సంబంధించిన ఉత్పత్తులు తయారుచేయకూడదని ఒక సంప్రదాయ నిర్ణయం తీసుకున్నారు. అందుకే అవి విదేశీ కంపెనీలైనా భారతీయతను సంతరించుకున్నాయి. హల్దీరామ్‌ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేయడం కోసం, ఫ్రెంచ్‌ బేకరీ కేఫ్‌ బ్రియోక్‌ డోరేతో ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచంలో రెండవ అతి పెద్ద చైన్‌ బేకరీ ఇది. ఇక్కడ కూడా శాకాహారం మాత్రమే దొరుకుతుంది.











గంగ భిశాణ్‌ ఉరఫ్‌ హల్దీరామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement