దక్షిణ కొరియాలోని సేంద్రియ రైతు క్షేత్రాన్ని పరిశీలిస్తున్న ‘హన్సలిమ్’ సహకార సంస్థ సభ్యులు
పంటలు పండించే భూమి నిర్జీవమైపోతోంది. ఎడారిగా మారిపోతోంది. భూతాపం పెరిగిపోవటం, కరువు కాటకాలు వెంటాడటం వల్లనే ఈ దుస్థితి. రసాయనిక వ్యవసాయ పద్ధతి కూడా ఓ ముఖ్య కారణమే. అయితే, సేంద్రియ వ్యవసాయంతో మనం ఆరోగ్యంగా బతుకుతూ వ్యవసాయ భూమిని కూడా పది కాలాలపాటు బతికించుకోవచ్చు అని రుజువు చేస్తున్నది ‘హన్సలిమ్’. దక్షిణ కొరియాకు చెందిన సహకార వ్యవసాయోత్పత్తుల విక్రయ సంస్థ ఇది. రైతులకు సేంద్రియ వ్యవసాయం నేర్పించడం, భూతాపాన్ని తగ్గించాలంటే సేంద్రియ ఉత్పత్తులనే కొనమని వినియోగదారులకు నచ్చజెప్పడం ‘హన్సలిమ్’ సాధించిన విజయం. సేంద్రియ ఆహారోత్పత్తుల అమ్మకం ధరలో 73% సొమ్మును రైతులకు చెల్లించడం మరో విశేషం. ఈ నెల 17న ‘అంతర్జాతీయ ఎడారీకరణ, కరువు నివారణ దినోత్సవం’ సందర్భంగా ‘హన్సలిమ్’ విజయగాథ..
పారిశ్రామిక/రసాయనిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల పొలాలు క్రమంగా జీవాన్ని కోల్పోతున్నాయి. వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ఇప్పటికే 200 కోట్ల హెక్టార్లకు పైగా పంట భూమి సాగు యోగ్యం కాకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే ఎడారిగా మారిపోయింది. ఈ ధోరణి కొనసాగితే వచ్చే పదేళ్లలో మనుషులకు ఆహారం పండించడానికి అదనంగా 30 కోట్ల హెక్టార్ల పంట భూమి అవసరం అవుతుందని అంచనా. అందువల్ల, పంట భూములను రసాయనాలతో నాశనం చేయకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పునరుజ్జీవింపజేసుకుంటూ తక్కువ వనరులతోనే అమృతాహారాన్ని పండించుకోవచ్చని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇందుకు ప్రబల ఉదాహరణ.. దక్షిణ కొరియాలోని ‘హన్సలిమ్’ సహకార సేంద్రియోత్పత్తుల విక్రయ సంస్థ.
రైతులు, వినియోగదారుల మధ్య అవినాభావ సంబంధం మనుషులు ప్రకృతితో సహజీవనం చేయాలి. భూములను, ప్రకృతిలో జీవరాశులన్నిటినీ పరిరక్షించుకుంటూ మనుషులంతా బాధ్యతాయుతంగా జీవించాలి అన్నదే హన్సలిమ్ ధ్యేయం. హన్సలిమ్ మాటకు అర్థం కూడా ఇదే. 1986లో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హన్సలిమ్ ఓ చిన్న ఆర్గానిక్ స్టోర్ మాత్రమే. రెండేళ్ల తర్వాత సేంద్రియ రైతులు, సేంద్రియ ఆహారాన్ని ఇష్టపడే వినియోగదారులతో కూడి సహకార సంస్థగా రూపాంతరం చెందింది. రైతులకు కచ్చితమైన గిట్టుబాటు ధర కల్పించటంలో వినియోగదారులు భరోసా ఇవ్వటం, వినియోగదారులకు అవసరమైన రసాయనిక అవశేషాల్లేని ఆహారం అందించడానికి రైతులు పూచీపడటం.. ఇలా పరస్పరం అవినాభావ సంబంధం కలిగి ఉండటమే ఈ సహకార ఉద్యమంలో ప్రత్యేకత.హన్సలిమ్‌లో ప్రస్తుతం 2 వేల మంది రైతులతోపాటు 5 లక్షల వినియోగదారులు సభ్యులుగా ఉన్నారు. పరస్పర ప్రయోజనాల కోసం సేంద్రియ రైతులు, వినియోగదారులను ఒక తాటిపైకి తేవడంలో హన్సలిమ్ విజయం సాధించింది.
అమ్మకం ధరలో రైతులకు 73%
సాగు పద్ధతి ఏదైనా నికరంగా రైతుకు దక్కే ఆదాయం ఎంత అన్నదే ముఖ్య విషయం. దళారుల వల్ల రైతులకు చాలా తక్కువగానే, చాలా సందర్భాల్లో మార్కెట్ ధరలో 25% మాత్రమే రైతుకు చేరుతున్నట్లు ఒక అంచనా. అయితే, హన్సలిమ్ సంస్థ ఉత్పత్తులు అమ్మగా వచ్చిన సొమ్ములో అత్యధికంగా 73% రైతుకు చెల్లిస్తూ ఆదాయ భద్రత కల్పించడం గొప్ప సంగతి. మిగతా 27% మొత్తాన్ని ప్రాసెసింగ్, నిర్వహణకు ఖర్చు చేస్తోంది. రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి, సొంతంగానే ప్రాసెస్ చేసి, నేరుగా వినియోగదారులకు హన్సలిమ్ విక్రయిస్తోంది.
పంట దిగుబడుల లభ్యతను బట్టి మార్కెట్ ధరల్లో చోటు చేసుకునే హెచ్చుతగ్గులు వ్యవసాయాన్ని అస్థిర పరచుతున్నాయి. సేంద్రియ వ్యవసాయాన్ని రైతులు సుస్థిరంగా కొనసాగించాలంటే ఆదాయం విషయంలో రైతులకు భద్రత ఉండాలి అన్నది హన్సలిమ్ సిద్ధాంతం. పంటల వారీగా రైతులకు చెల్లించే ధర, వినియోగదారులకు విక్రయించే ధరలను ఏడాదికోసారి ముందుగానే సర్వసభ్య సమావేశం నిర్ణయిస్తుంది. ఒకవేళ ఏ కారణం వల్లనైనా పంట దిగుబడి 50% కన్నా తగ్గిపోతే రైతును ఆదుకోవడానికి కూడా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం మరో విశేషం.
వినియోగదారుల పర్యవేక్షణ
సేంద్రియ రైతులకు సర్టిఫికేషన్ తీసుకోవటం లేదు. సొంత సర్టిఫికేషన్‌పైనే ఆధారపడుతోంది హన్సలిమ్. రైతులకు హన్సలిమ్ నియమించిన నిపుణులు సేంద్రియ వ్యవసాయంలో, ప్రమాణాలు పాటించడంలో శిక్షణ ఇస్తారు. సభ్యులైన వినియోగదారులు బృందాలుగా ఏర్పడి రైతుల క్షేత్రాలకు వెళ్లి పంటల నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తారు. స్థానిక వంగడాలను, స్థానిక జంతు జాతులను పరిరక్షించుకోవడంపైనా దృష్టి పెట్టారు. దేశీయంగా స్థానికంగా పండించే పంటలనే తినాలి, విదేశాల నుంచి దిగుమతయ్యే జన్యుమార్పిడి ఆహారానికి దూరం ఉండాలి అనే స్పృహను వినియోగదారుల్లో, ముఖ్యంగా పిల్లల్లో, పెంపొందించడానికి ప్రచార కారక్రమాలు చేపడుతున్నారు.భూసారం/పర్యావరణ పరిరక్షణలోనే తమ ఆరోగ్యం కూడా దాగి ఉందన్న వాస్తవాన్ని రైతులు, వినియోగదారులు గుర్తెరిగి కలిసి పనిచేసేలా ‘హన్సలిన్’ కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తన 126 స్టోర్ల ద్వారా, ఆన్‌లైన్ విక్రయాల ద్వారా, ఏటా 13 కోట్ల డాలర్ల అమ్మకాలు జరిపే స్థాయికి హన్సలిమ్ సహకార సంస్థ ఎదగటం విశేషం. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేయడంతోనే చాలదు, మార్కెటింగ్ విషయంలో నిర్మాణాత్మక కృషి అవసరం అని ‘హన్సలిమ్’ విజయం మనకు తెలియజెప్తోంది. ∙
ఇప్పుడు మంచి ధర వస్తోంది
పంటను గతంలో బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేవాడిని. ఒకసారి ఉన్న ధర మరోసారి ఉండేది కాదు. కానీ, హన్సలిమ్ సహకార సంఘంలో సభ్యుడిగా చేరిన తర్వాత వరి ధాన్యం, క్యాబేజి, ఉల్లి, బఠాణీలను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నాను. ఇప్పుడు మంచి ధర వస్తోంది.– కిమ్ యూంగ్ గు,హన్సలిమ్ సేంద్రియ రైతుల సహకారసంఘం సభ్యుడు, దక్షిణ కొరియా
Comments
Please login to add a commentAdd a comment