ఓ నాన్న కథ | Happy Father's Day tomorrow | Sakshi
Sakshi News home page

ఓ నాన్న కథ

Published Fri, Jun 17 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

ఓ నాన్న కథ

ఓ నాన్న కథ

రేపు ఫాదర్స్  డే


నాన్న గొప్ప చెట్టు. చాలా చాలా చాలా చాలా పెద్ద చెట్టు. కానీ... చాలా చాలా చాలా చాలా చిన్నగా ఉంటాడు. తన నీడ పడితే బిడ్డ పెరగడేమోనని భయం కాబోలు... తను ఒదిగి ఉండి, మనల్ని ఎదగనిస్తాడు.చిన్న చెట్లకు పెద్ద పండ్లంటే ఇదేనేమో. మన జీవితం పండించడానికి తను పడ్డ కాయకష్టం ఇది.  పిల్లలు చెప్పిన తండ్రుల కథలివి.

 

 

నా తల నిమరలేదు...  నా భుజం తట్టలేదు....
‘నాన్నకు బాలేదురా’ - అమ్మ ఫోన్! అంబులెన్స్ సైరన్... ఫోన్‌లోంచి మొత్తుకుంటోంది. హైదరాబాద్‌లో సైరన్‌లు నాకు మూమూలే. అమ్మ గొంతే.. ఎప్పుడూ ఉన్నంత ధైర్యంగా లేదు. ‘ఏమైందమ్మా?’ అన్నాను. చెప్పింది. నాన్నకు హార్ట్ ఎటాక్! గుంటూరు తీసుకెళుతున్నారు.

   

‘‘పెద్దోడొచ్చాడు’’... నాన్నకు చెబుతోంది అమ్మ. నాన్న ఐసీయులో ఉన్నారు. పూర్తిగా పడుకున్నట్లు కాకుండా, పూర్తిగా కూర్చున్నట్లు కాకుండా బెడ్ మీద ఉంచారు ఆయన్ని. అమ్మ మాటకు నెమ్మదిగా కళ్లుతెరిచి చూశారు. నాన్న కాళ్లకు ఎదురుగా నిలబడ్డాను. ‘ఏమిటి గెడ్డం?’ అన్నట్లు నవ్వుతూ చూశారు. ‘ఏం లేదు’ అని తల ఊపాను. నేను ఆయన్నే చూస్తున్నాను. నాన్న కళ్లు కదలించారు. ఏదో చెప్పబోయారో, ఏదో అడగబోయారో!   రాత్రి రెండయింది. ‘ఆయన్ని విశ్రాంతిగా పడుకోనివ్వండి’ అంటున్నారు డాక్టర్. అటెండెంట్స్ వరండాలో ఉండాలి. అమ్మకు చెప్పి బయటికి వచ్చేస్తున్నాను. ‘‘ఆగరా’’ అంది అమ్మ. నాన్న వైపు చూశాను. దగ్గరకి రమ్మన్నారు. వెళ్లాను. ఇంకా దగ్గరికి రమ్మనట్లుగా సైగ చేశారు. వెళ్లాను. ఆయన చేతులకు అందేంత దగ్గరగా. తల నిమురుతారేమో అనుకున్నాను. ఊరికే అలా అనుకున్నాను. ఏ వయసులోనూ ఆయన నా తల నిమిరిన జ్ఞాపకం నాకు లేదు. గంభీరమైన ఆయన కంఠం ఒక్కటే నా జీవితకాలంలో నన్ను తాకింది. నన్ను దిద్దింది.

 
మరింత దగ్గరికి వెళ్లాను.. దాదాపుగా ఆయన మీదకు ఒరిగాను. ఆయన నా తల నిమరలేదు. నా చుబుకాన్ని తాకలేదు. నా భుజాన్ని తట్టలేదు. నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోలేదు. నా కళ్లలోకి చూడలేదు. నా చొక్కా జేబుకు తన వేళ్లను తాకించారు. కొద్దిగా తల పైకి లేపి నా జేబులోకి చూశారు. తర్వాత తలను వెనక్కి అన్చుకున్నారు.

 
అమ్మ.. నాన్ననే చూస్తోంది. ‘‘హైద్రాబాద్‌లో వాడు ఎట్లా ఉన్నాడో... డబ్బుకి ఇబ్బంది పడుతున్నాడో ఏమో’’ అంటుండే వారట నాన్న. చనిపోయే ముందు ఆయనకు ఆ మాట అనే శక్తి లేకపోయింది. నా జేబును తాకి చూశారు.  -  నాన్న లేని ఒక నాన్న

 

నాడి అమ్మయితే... నరం నాన్న!
అదొక రాతికట్టడపు బావి. అంచు నుంచీ అడుగు వరకూ రాతి మెట్లు.  మామూలుగా అయితే ఈత నేర్పే ఆ సమయంలో నాన్న నాతోనూ, నాలా ఈదులాడే ఇంకొంత మంది పిల్లలతోనూ బావిలో ఉండేవారు. నేను ఈదడం మొదలు పెట్టాక ఆయన బావిలోకి దిగడం క్రమంగా తగ్గించారు. ఆ నీళ్లలో మేం తుళ్లుతూ ఉండటం... అలా అలవోకగా కాళ్లూ చేతులు కదిలిస్తూ ఈదడం చూసి నాన్నకు ఆనందించేవారు. ఈతలో మేం ఆనందించే సేమ్ టు సేమ్ అనుభూతినే నాన్న మమ్మల్ని చూస్తూ ఆస్వాదించేవారు. అలా గంటా గంటన్నర సేపూ మమ్మల్ని చూస్తూ ఒపిగ్గా ఉండిపోయేవారాయన. కానీ ఏదో ఒక సమయంలో ఇంటికి తీసుకెళ్లాలి కదా. అందుకోసం మమ్మల్ని నీళ్లలోంచి బయటకు తీసుకురావాలి కదా. అందుకే ఆ చర్య తనకు  వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి అలా చేశారని పెద్దయ్యాక గానీ తెలియలేదు. ఇలా మమ్మల్ని ఈతకు వదిలి... ఆయన గట్టు మీద నుంచి చూస్తూ ఉండటం  నాన్నకు నిత్యకృత్యం. టైమ్‌కు అతీతమైన ఒక పారవశ్య దృశ్యం. కొన్నాళ్ల తర్వాత మమ్మల్ని ఈదులాడించడానికి వచ్చినా ఆయన తన ఫుల్‌షర్ట్, ప్యాంట్‌తో  ఉండేవారు.


ఇలాంటి టైమ్‌లోనే ఈత నేర్చుకునేందుకు సిద్ధపడ్డ మరో చిన్నపిల్లాడు బావిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో నన్ను పట్టుకున్నాడు. అంతే... ఆ మరుక్షణం నేనూ, అతడూ ఇద్దరమూ మునక. బావి నీళ్లు గొంతుల్లోకి గుటక. అయితే అది క్షణకాలం పాటే... అక్కడ జరిగిందేమిటన్నది కొద్దిసేపటి తర్వాత గానీ నాకు తెలియరాలేదు.

 
అనంతానంత దిగంతాల ఆవల నుంచి కాంతి ప్రయాణానికి వత్సరాలు కావాలేమో. కానీ అదే దూరాన్ని నాన్న క్షణాల్లో అధిగమించగలరని తేలిపోయింది! అదే డ్రస్‌తో ఆమాంతం బావిలోకి దూకి కడుపున పుట్టిన తన పిల్లాడినీ, కడుపున పుట్టని ఇంకో పిల్లాడినీ రక్షించారు నాన్న.

 
తొలిసారి జీవితాన్ని ప్రసాదించడం నాన్నలకు మామూలే. కానీ ఎన్నోసార్లు తాను ఆవిర్భవింజేసిన జీవితాన్ని కాపాడారాయన. వాటిల్లో ఒకటి ఇది. ఇదే సంఘటన చెప్పి... నాకు అయిన చిన్నగాయం చూసి అమ్మ కంగారపడిందేమో... కానీ నాన్న గర్వపడ్డారు. గాయాల్ని చూసి గర్వపడటం నాన్నలకు మామూలే. అమ్మ పాదాల దగ్గర స్వర్గం ఉంటుందన్న మాట నిజమే. కానీ దాంతో పాటు సమస్త భువనాలు నాన్న పాదాల దగ్గర దాస్యం చేస్తుంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే సంస్పందిచే నాడి (రక్తనాళం) అమ్మయితే నరం నాన్న.  - ఒక కొడుకు

 

కొడుకు గొప్ప... నాన్న గొప్ప...
నాకు డ్రాయింగ్ అంటే పిచ్చి. మా నాన్నకు మాత్రం పిచ్చికోపం.  బొమ్మలు తప్ప సైకిల్ షాపులోనైనా,  మోటర్ మెకానిక్ షాపులోనైనా ఏదో ఒకటి చదువుతోపాటు నేర్చుకుంటే బతుకు బస్టాండ్ కాదని అనే వాడు. నేను దొంగతనంగా డ్రాయింగ్ వేస్తుంటే బస్టాండ్ ముందు ఆంజనేయస్వామి, ఏసు ప్రభువు బొమ్మలు వేస్తూ అడుక్కునే వాళ్లను చూపించి అలా కావద్దని అనేవాడు.  లైన్‌మెన్ ఆయన. పైగా మా నాన్న కింద పని  చేసినోళ్లు మంచి వర్కర్స్‌గా తయారయ్యారు. నాకు మాత్రం డ్రాయింగ్ పిచ్చి వదల్లేదు. దాని నుంచి తప్పించాలని నన్ను చివరికి మా నాన్న ఓ రేడియో షాపులో పెట్టాడు. మధ్యమధ్యలో వచ్చి సూపర్‌వైజింగ్ చేసేవాడు. నేను డ్రాయింగ్ వేస్తూ నాన్న వచ్చే టయానికి రేడియోతో ఫోజు పెట్టేవాడిని. నాన్న దిల్ ఖుష్! మేరే దిల్ పసంద్!

 
నేను ఓవారం రోజులు కూర్చుని లక్ష్మీదేవి బొమ్మలు గీసిన. ఆభరణాలు, పోలికలు వగైరా వగైరా అన్నీ వచ్చినయ్ ఒక ఫేస్ తక్క. కళు,్ల ముక్కు వేయడం.. చెరపటం ఓ ఇరవైసార్లు! నేను గీసిన డ్రాయింగ్ షీట్ ఫేస్ భాగం వరకూ ఉల్లిపొర కాగితం అయ్యింది. ఇంకొకసారి గీయడమే చెడిపే ఛాన్స్ లేదు. చినిగే ఛాన్స్ మిగిలింది. క్లాసుకు తీసుకుపోయిన. మా డ్రాయింగ్ సార్ శ్రీరాములు నా బొమ్మ చూసి ఇంత అద్భుతంగా ఉంది, ఫేస్ వేయరాకపోవడానికి

 
ఏముందిరా శంకర్ అని పెన్సిల్‌తో నా కళ్ల ముందే లక్ష్మీదేవి కళ్లు, ముక్కు గీసేసరికి నాకు ఆర్టిస్ట్ కావాలనే కోరిక ఇంకా గట్టిగా ఫిక్సయిపోయింది. ఆ ఒక్క ఫేసుతో బొమ్మ వెలిగిపోయింది.  సీన్ కట్‌చేస్తే ... అలా డ్రాయింగ్ వేస్తూ చిన్నగా కార్టూన్ల వైపు మళ్లింది మనసు. కార్టూన్లు గీస్తూ వారపత్రికలకు పంపేవాడిని. కొన్ని పత్రికలు పారితోషికం కూడా పంపేవి. ఒకసారి నా కార్టూన్లు అచ్చయిన ఓ వారపత్రిక  కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి నాన్నకు చూపించలేక అమ్మకు చూపించిన. నాన్నకు కూడా చూపించురా సంతోషపడ్తడు అంది. నేను ఆ ధైర్యం చేయలేకపోయిన. అమ్మ చూపిస్తే ఒకింత ఆశ్చర్యపోతూ మనోడి కార్టూన్లు ఇందులో పడ్డాయా అని ఖుషీ అయిండని చెపితే నేను మస్తు ఖుషి. ఓ పత్రిక నుంచి ఓరోజు మా నాన్న ఇంట్లో ఉండగానే మనియార్డర్ వచ్చింది. సంతకం చేసి తీసుకున్నా. అలా ఆయన ముందు ఓ నాలుగుసార్లు మనియార్డర్లు వచ్చాయి.

 
కార్టూన్స్‌కు పైసలు కూడా ఇస్తారా అని ఆయన మా అమ్మను అడిగితే అవునని చెప్పేసరికి నా మీద ఓ చిన్న పాజిటివ్ దృక్పధం ఏర్పడింది. అలా నా ముందు నాన్న ఉన్నా కార్టూన్లు గీసే స్థాయికి చేరాను.  ఓ రోజు నేను ఇంట్లోకి అడుగుపెడుతూంటే పత్రికల్లో అచ్చయిన కార్టూన్లు మా నాన్న తన దోస్తులందరినీ పిలిచి చూపిస్తూ... మావోడు మామూలోడు కాదు వాడు గీసిన బొమ్మలను పత్రికలోళ్లు వేసుకుంటారు మళ్లీ వాటికి పైసలు కూడా ఇస్తారు తెల్సా... చాలా ఫేమస్.. అని కార్టూన్ కింద నా సంతకం చూపిస్తే వాళ్లకు నా గురించి గొప్పగా చెపుతూ తను ఇంకా గొప్పగా ఫీలవుతుంటే ఇంట్లోకి రాకుండా గోడ పక్కనే నిలబడిపోయా... కళ్లలోకి వచ్చిన నీళ్లతో!  - శంకర్, కార్టూనిస్ట్

 

ఆ కళ్లు!
ఒకసారి నేను తెల్లకాగితం మీద ఇలా రాసుకున్నాను... ‘తెల్లగోడ మీద  బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మా అబ్బ నా చిన్నప్పుడు... యవ్వనమప్పుడు...ఇప్పుడు...  అచ్చు అలాగే ఉన్నాడు. అమ్మ మాత్రం...మారిపోయింది’ అని. క్రాఫ్ చెరగని, తల వెంట్రుకలు నెరవని, యవ్వనం చెదరని అబ్బ ఎంత అదృష్టవంతుడు. చాలామంది ‘మా నాయిన ఇట్లా’ ‘మా నాయిన అట్ల’ అని చెబుతుంటారు. మా అబ్బ ‘ఇట్లా’ ‘అట్లా’ అని చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు.  ‘శ్రీరామకృష్ణ శిశుమందీర్’లో రెండో క్లాసో, మూడో క్లాసో చదువుతున్నప్పుడు  ఒక మధ్యాహ్నం మా సజ్జు మామ కావచ్చు... స్కూల్‌కు వచ్చి ‘చిట్టిబాబును ఇంటికి తీసుకపోవాలె’ అని హెడ్‌మాస్టర్‌తో చిన్నగా ఏదో మాట్లాడి తీసుకెళ్లాడు. చిట్టి గంట మోగకుండానే ఇంటికి వెళ్లడం అంత సంతోషం ఏముంటుంది? ఆ సంతోషపు నావలో  ఆడుతు పాడుతూ వస్తుండగానే...మా ఇంటి ముందు నుంచి  దుఃఖపు సముద్రం ఎదురొచ్చింది. బీమారితో వారం రోజులు అమృల్లా హస్పటల్లో ఉలుకూపలుకు లేకుండా బెడ్ మీద ఉన్న  అబ్బ చనిపోయాడట. మా అమ్మ, అన్న, తమ్ముడు...అక్కలు...అందరూ ఏడుస్తున్నారు. ఆ దుఃఖపు నది ఇప్పటికీ ఎండిపోలేదు. ఏ కాలనికి ఎండిపోదు!

 
నేను ఊళ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా అబ్బ ఫోటో చూస్తాను. ఆయన పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది. తిడుతున్నట్లు అనిపిస్తుంది. జాగ్రత్తలు చెబుతున్నట్లు అనిపిస్తుంది.  అబ్బ లేకపోవచ్చు అమ్మ రెండు కళ్లు ఉన్నాయి. ఆ కళ్లలో అబ్బ ఉన్నాడు. ఆ కళ్లు నాతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాయి! - పాషా

 

మా చిన్నాయన....
నాయన అన్నా, అమ్మ అన్నా నాకు మా చిన్నాయన మహబూబ్ బాషే. నేను పుట్టగానే ఏం పనిబడిందో ఏమో నాతో చెప్పా చేయకుండా మా అమ్మ దేవుని ఊరికి వెళ్ళిపోయింది. మా తండ్రి మిలట్రి మనిషి. పరాయి రాష్ట్రాల్లో కాపురం. చుట్టపు చూపుగా వచ్చేవాడు,  అట్లాంటి దిక్కులేనితనంలో మా చిన్నాయన, జేజీ, మేనత్త  నన్ను సాకినారు. అందరిలోకీ మా మాబ్బాష చిన్నాయన అన్నీ తనై నన్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రాణంపోయేంత జబ్బు చేసిన పసిగుడ్డుని నానా తంటాలు పడి కాపాడుకున్నాడట!  ఎంత అన్న కొడుకైనా, రక్తపాశం వున్నా ఎంతోటి కరుణ, ఎంత దయ లేకపోతే ఆయన ఆ వయసులో నాకు నాయనగా మారిపోతాడు?  వయసుకు మించి గంభీరం ఆయనది. పేద పెద్ద కుటుంబం ఆయనకి పెద్దరికం తొడిగింది. దాన్నే ఆలంబనగా చేసుకుని తన పెద్దకుటుంబానికి పెద్ద దికైై్క  నిలబడినాడు, యవ్వనమంతా నొవామాదిరి కుటుంబాన్ని నావలో కూచోబెట్టి లాగినాడు, తను నీళ్ళల్లొనే  వుండి. 

 
స్ఫురద్రూపం అనే కఠినమైన మాటకు అర్థం నాకు తెలియదు కానీ అటువంటిది ఏదైనా వుంది అంటే మా మాబ్బాష నాయన మొహమే నా కళ్ళ ముందుకు వస్తుంది. చక్కని రూపం, ఇక ముక్కు సంగతి చెప్పనక్కరలేదు. నూనెపల్లె గ్రామంలో మా సూటి ముక్కుల తీరు మరెక్కడా ఇంకెక్కడా కానరాదు, అటువంటి ముక్కుకింద కోర తిరిగిన మీసాలతో కనపడే చక్కని రూపం ఆయనది. ఏనాడూ ఆయన నన్ను ప్రేమారాగాలతో సాకలేదు. భయభక్తులతో పెంచాడన్నదే నిజం. ఆ భయభక్తుల్లోంచే  మేం నేర్చుకోవాల్సిందేమైనా వుంటే అది నేర్చుకున్నాం. ఆ మాదిరి భయభక్తుల వల్లే పుట్టి భూమ్మీద పడి నలభై యేళ్ళయినా ఈ రోజుకు మా చిన్నాయన ముందు కూచుని ఎరుగం, పట్టుమని అయిదు నిముషాలు ఆయనతో మాటకలిపే ధైర్యం చేయం, అదే బావుంటుంది కూడా నాకు. జన్మకు నాయన ఒకరే వుంటారు, చిన్నాయన  రెండ్లు, మూడ్లు, నాలుగయిదులు. అంటే ఎక్కువ ప్రేమలు అని దేవుడు నాకు మాత్రమే తెలిపిన వరం.

 - అన్వర్, ఆర్టిస్ట్

 

పోర్చుగీస్ నాన్న - ది బెస్ట్
ప్రపంచంలో అత్యుత్తమ తండ్రులు ఏ దేశం వాళ్ళు?  చిన్నపిల్లల సంరక్షణ, బాధ్యతల విషయంలో ఏ దేశం వాళ్ళు ఎలా ఉంటారన్న దానిపై ప్రధానమైన 15 దేశాల్లో ‘ఫాదర్‌హుడ్ ఇన్‌స్టిట్యూట్’ అధ్యయనం జరిపింది. బ్రిటన్‌కు చెందిన తండ్రులు ప్రపంచంలోకెల్లా ‘వరస్ట్’ అని ఇందులో తేలింది. బ్రిటన్‌లో తల్లులు తమ పిల్లల్ని చూసుకోవడానికి గంట గడిపితే, అక్కడి తండ్రులు మాత్రం పిల్లల సంరక్షణకు కేవలం 24 నిమిషాల సమయమే వెచ్చిస్తున్నారట! దాంతో, అధ్యయనం చేపట్టిన 15 దేశాల్లో అన్నిటి కన్నా అట్టడుగున బ్రిటన్ నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాలన్నిటిలోకీ చిట్టచివరి ర్యాంకు తెచ్చుకుంది.  విశేషం ఏమిటంటే, ఈ దేశాల్లోకెల్లా మొట్టమొదటి ర్యాంకు పోర్చుగల్‌కు దక్కింది. ఆ దేశంలో తల్లులు ఒక గంట పాటు పిల్లల సంరక్షణలో గడిపితే, తండ్రులు 39 నిమిషాల సమయం పిల్లల బాధ్యతలు చూస్తున్నారు. ఈ అధ్యయనంతో సంబంధం లేదు కానీ, ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం ఇండియాలో కూడా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో మన దగ్గర తండ్రులు తమ పిల్లలతో రోజుకు 8 నిమిషాలే మాట్లాడుతున్నారట! ఇక, ఉద్యోగినులైన తల్లులు 11 నిమిషాలు, గృహిణులైన అమ్మలైతే రోజుకు 30 నిమిషాల పైగా పిల్లలతో సంభాషిస్తున్నారట! అంకెల మాట ఎలా ఉన్నా, పిల్లల సమగ్ర వికాసం కోసం వాళ్ళతో రోజూ వీలైనంత ఎక్కువ టైమ్ గడపడమే మంచిదని విశ్లేషకుల మాట! కేవలం పిల్లల స్కూలు విషయాలు, హోమ్ వర్క్ విషయాలే కాకుండా, వాళ్ళ ఆలోచనలు, అనుమానాలు కూడా పంచుకోవడం మంచిదని చెబుతున్నారు. అప్పుడే తల్లితండ్రులతో పిల్లలకు బంధం బలపడుతుంది. ఉత్తమ తండ్రులుగా, తల్లులుగా తలెత్తుకు నిలబడడానికి వీలవుతుంది.

 

నాన్నతో గడిపితే తెలివితేటలు...
పిల్లలు తమ తండ్రులతో కాలక్షేపం చేస్తుంటే ఏ తల్లి ఆనందానికైనా అవధులు ఉండవు. ఎందుకంటే, దాని వల్ల ఒకపక్క తనకు కాస్తంత విశ్రాంతి చిక్కడమే కాకుండా, మానసికంగా కూడా ఆనందంగా ఉంటుంది. అయితే, తల్లుల ఆనందం కోసమే కాదు, పిల్లల తెలివితేటలు పెరగడానికి కూడా తండ్రులతో హాయిగా కాలక్షేపం చేయడం అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. తండ్రులతో ఎక్కువసేపు గడపడం వల్ల పిల్లల ఐ.క్యు పెరుగుతుందనీ, చిన్నతనంలో పిల్లలపై పడే తండ్రి ప్రభావం వల్ల పిల్లల భవిష్యత్ కెరీర్ బాగుంటుందనీ తేలింది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూక్యాజిల్‌కు చెందిన పరిశోధకులు 1958లో పుట్టిన కొన్ని వేల మంది బ్రిటీషు స్త్రీ పురుషుల్ని సర్వే చేసి, ఈ సంగతి తేల్చారు. పిల్లల కోసం పుస్తకాలు చదివి వినిపించడం, వాళ్ళతో ఆటలు ఆడడం, కలసి బయటకు విహారానికి వెళ్ళడం లాంటివాటికి తండ్రులు ఎంత టైమ్ వెచ్చిస్తున్నారన్న దాన్ని బట్టి, పిల్లల ఐ.క్యు ఉందట! ‘ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ బిహేవియర్’ అనే పత్రికలో ఈ సర్వే ఫలితాలను ప్రచురించారు. గమ్మత్తేమిటంటే, ఈ పిల్లలు పెద్దవాళ్ళయి, ముప్ఫై ఏళ్ళు వచ్చిన తరువాత కూడా చిన్నప్పుడు తండ్రితో గడిపిన క్షణాలు ప్రభావం చూపుతాయి. దీన్నిబట్టి, పిల్లలకూ, తల్లితండ్రులకూ మధ్య ఉండాల్సిన బంధం విషయంలో మన భారతీయ విలువలు ఎంత గొప్పవన్నది తెలుస్తోంది. పాశ్చాత్య దేశాల్లో లాగా మన దేశంలో పిల్లలు పెద్దవగానే, వాళ్ళతో తల్లితండ్రుల బంధం తెగిపోదు. తల్లితండ్రులతో కలిసే ఉండడం, ఒక వేళ విడిగా ఉన్నప్పటికీ తరచూ వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం లాంటివన్నీ ఉపయోగమని తాజాగా సైన్స్ కూడా నిరూపించినట్లయింది.

 

ఆ తెగలో... మగ అమ్మలు
ప్రపంచంలోని అత్యుత్తమ తండ్రుల గురించి చెప్పమంటే, ఆంథ్రొపాలజిస్ట్‌లు ఆఫ్రికన్ గిరిజన్ తెగ ‘అకా’లోని మగవాళ్ళ ముచ్చటే ఎత్తుతున్నారు. ఆఫ్రికాలోని ఈ సంచార గిరిజన తెగలోని మగవారు పిల్లల పెంపకంలో అమ్మను తలపిస్తుంటారు. అమ్మ దగ్గర లేక పసిబిడ్డ గుక్కపెడుతుంటే, తండ్రులే తల్లులై తమ చనుమొనల్ని పిల్లల నోట పెడతారు. అలా అప్రయత్నంగా అమ్మలు అవుతారు. పసిబిడ్డలు వాటిని చప్పరిస్తూ, నాన్నలోనే అమ్మను చూసుకుంటారు.

 
ఇలా పిల్లలకు మగవాళ్ళు చనుబాలు ఇవ్వడమనే విచిత్రమైన అలవాటు గురించి అమెరికన్ ఆంథ్రొపాలజిస్ట్ ఒకరు తొలిసారిగా ప్రపంచానికి చాటిచెప్పారు. ఆఫ్రికా మధ్య ప్రాంతంలో నివసించే ఈ ‘అకా పిగ్మీ’ గిరిజన తెగ మొత్తం జనాభా దాదాపు 20 వేల దాకా ఉంటుందని అంచనా. విశేషం ఏమిటంటే, ఈ గిరిజన తెగలోని తండ్రులు రోజు మొత్తంలో దాదాపు 47 శాతం సమయం తమ పిల్లలకు అందుబాటులో ఉంటారు. ఈ భూమండలం మీద ఏ ఇతర సాంస్కృతిక బృందంలోనూ తండ్రులు ఇంతగా అందుబాటులో ఉండరంటే అతిశయోక్తి కాదని నిపుణుల మాట. అందుకే, ‘అకా’ తెగ పురుషుల్ని ‘‘ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ తండ్రులు’’గా అభివర్ణిస్తుంటారు.

 

అవును... నేను ఆయన కూతుర్నే....
‘నన్నెందుకు వదిలేసారు వాళ్ళు?’ మూడోసారి అడిగానా ప్రశ్న. నాకు పెరుగన్నం తినిపించిన చేతి మునివేళ్ళను వసారాలో కడుక్కుంటూ ‘అప్పుడు నువ్వు ముప్ఫయ్ రోజుల పసిగుడ్డువి’ అన్నాడాయన. ‘అమ్మ జైల్లోనూ, నాన్న అడవిలోనూ ఉన్నారు మరి నిన్నెవరు చూస్తారు? అందుకే నీకు జోలపాడమని నా దగ్గరుంచారు’ నులక మంచంమీద పక్క సర్దుతూ అన్నాడు. అడవిలోనూ, జైల్లోనూ ఎందుకున్నారు? నా ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే నన్ను జోకొడుతూ రోజూ పాడే పాట ‘జో అచ్చుతానంద...జోజోముకుందా...’ పాటెప్పుడాగిపోయిందో తెలియదు. తెల్లవారి కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటిముందు రాకాసి బొగ్గు దుమ్ము రేపుకుంటూ రయ్యిన వచ్చి ఆగింది పోలీసు జీపు. ‘దిగు శేషయ్యా...’ కరుకుగా వచ్చింది మాట. ఆయన దిగాడు. రాత్రి పెరుగన్నం ముద్దలు తినిపించిన తమలపాకుల్లాంటి మునివేళ్ళకొసలు రక్తమోడుతున్నాయి. అడుగుతీసి అడుగువేయలేకపోతున్నాడు. తూలిపడబోతూ ఇంటిబయటి గుంజను పట్టుకుని నిలదొక్కుకున్నాడు. తెల్లటి లాల్చీ, పంచెపై అక్కడక్కడా నెత్తుటి మరకలు. బిక్కచచ్చిపోయి భయం భయంగా చూస్తున్న నన్ను రమ్మన్నట్టు సైగచేసాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళకు చుట్టుకుపోయి బోరుమన్నాను. నాకేదో అర్థం అయ్యి కాదు. పోలీసుల ఇనుపబూట్లు చిగురుటాకులాంటి వేళ్లను ఎలా చిదిమేస్తాయో ఆయన చెప్పిన కథ గుర్తుకొచ్చి. రాత్రి పోలీసులొచ్చి ఆయనను పట్టుకెళ్ళి ఒక నక్సలైటు కూతురిని పెంచడానికి నీకెంత ధైర్యం అంటూ రోకలి బండ కాళ్ళసందుల్లో దూర్చి, ఎలా చిత్రహింసలు పెట్టారో చెపుతుంటే విని వెక్కి వెక్కి ఏడ్చాను.

 
ఆ రాత్రే నా కథని పూర్తి చేసాడాయన. నన్ను కన్న తల్లిదండ్రులు నక్సలైట్లని, నాన్న పైలా వాసుదేవరావు ఎవరికీ కనిపించడని, అమ్మ చంద్రమ్మని జీవితాంతం జైల్లోనే ఉంచారని, వాళ్ళంతా తినటానికి తిండికూడాలేని పేదజనం కోసం తుపాకులు పట్టుకొని పోరాడుతున్నారని, నన్నీ ఇంటికి చేర్చిన ఆయన పెద్దన్నయ్య అత్తలూరి మల్లికార్జునరావు చిలకలూరి పేట పోలీస్ స్టేషన్‌పై దాడి లో  చనిపోయాడని, ఆయన గుర్తుగా నిన్ను గుండెల్లో పెట్టుకుని దాచుకుంటున్నామని చెప్పాడు. గుంటూరు జిల్లా చింతలపూడిలో పోలీసుల దాడులనుంచి కాపాడుకునేందుకు ఓ గొడ్ల చావిట్లో తలదాచుకుంది ఈ కుటుంబం. 11 మంది సంతానంలో కటిక దారిద్య్రం మధ్య అనుకోని విధంగా ఆ యింట్లో చేరాను నేను. నన్ను బతికించుకోవడమే వారికోసవాల్‌గా మారింది. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న నాకు పక్కింటోళ్ళిచ్చిన మజ్జిగన్నంతోనే కడుపినింపాడు. ఓ అర్థరాత్రి చుట్టుపక్కలెవ్వరికీ తెలియకుండా కుట్టుమిషన్‌ని పట్టుకుని ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపురంకి వలసవెళ్ళింది మా కుటుంబం. నన్ను మొదటి సారిగా, చివరిసారిగా అడిగింది ఒక్కటే తన ఇంటిపేరుని నా పేరుచివరనుంచి తొలగించొద్దని. అందుకే నా ఇంటిపేరు పైల అయినా నా పేరు చివర అత్తలూరి అనే పెట్టుకుంటాను. అవును... నేను అత్తలూరి శేషయ్య కూతుర్ని. కనక పోయినా నన్ను పెంచిన... నేను నాన్న అని పిలిచిన ఆయనే మా నాన్న.

 - అత్తలూరి అరుణ

 

నాన్న కళ్లలో నీళ్లు!
మా ఇంట్లో అది తొలి పెళ్లి. నా పెళ్లి. నన్ను పట్టుచీర, పూలజడతో అలంకరించారు. నాకెంతో ఉత్సాహంగా ఉంది. నేను పుట్టిపెరిగిన అమ్మమ్మ ఇల్లే నా అత్తవారిల్లు కావడాన ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఉరకలు వేస్తోంది మనసు. ‘ఇంక బయలుదేరాలి. రాహుకాలం వచ్చేలోపు చేరాలి కదా’ అని ఎవరో అన్నారు. నేను మా వారితోపాటు ఇంట్లో నుంచి బయటకొచ్చాను. వరండాలోకి రాగానే పందిట్లోనే ఉన్న నాన్న కుర్చీలో నుంచి లేచి నిలుచున్నాడు. ఎప్పుడూ తెల్ల బట్టలతో మెరిసిపోయే నాన్న ఆ రోజు కూడా తెల్లబట్టలే వేసుకున్నారు. కానీ ఆయన ముఖమే వివర్ణమై, చిన్నదిగా మారిపోయింది. ఆయన చెప్పింది చేయడమే కానీ ఆయన ముఖంలోకి చూసి మాట్లాడాలన్నా నాకు భయమే. అలాంటిది ఎందుకలా ఉన్నాడో అని అడిగే ధైర్యం లేదు. నా పక్కనే ఉన్న మా అమ్మ, పెద్దమ్మ... ‘ఊరికెళ్లొస్తానని నాన్నతో చెప్పు’ అన్నారు. అలాగేనని తలూపి నాన్న ముఖంలోకి చూస్తూ ‘వెళ్లొస్తా’నన్నట్లు తలూపాను. ఆయనా అలాగేనన్నట్లు తలూపారు. వెంటనే టవల్ అంచుతో కన్నీటిని అద్దుకున్నారు. ‘నాన్న కూడా ఏడుస్తాడా’ ఆశ్చర్యం వేసింది. మా నాన్న కళ్లలో కన్నీటిని చూడడం అదే మొదటిసారి. ఆయన జీవితంలో పంటలు వరదలో కొట్టుకుపోవడం, వ్యాపారంలో రావాల్సిన డబ్బు చేజారిపోవడం, బంధువులు దూరం కావడం, స్నేహితులు అనుకున్న వాళ్లు ముఖం చాటేయడం వంటివెన్నో జరిగాయి. కానీ అప్పుడెప్పుడూ ఆయన కళ్లు చెమర్చలేదు. అలాంటిది కూతురికి పెళ్లి చేసినప్పుడు ఒకవైపు పొంగిపోతూనే మరోవైపు కూతుర్ని ఇంటి నుంచి పంపించడానికి  నలిగిపోవడం ఆయన వల్ల కాలేకపోయింది. ఒక్కసారికే అలా తల్లిడిల్లిపోయిన ఆయన గుండె మా చెల్లికి పెళ్లి చేసినప్పుడు మరోసారి అంతే ఆటుపోట్లకు లోనయింది. ఆ గుండె అనేక గాయాల్ని తట్టుకోగలిగింది. కానీ అనుబంధాల కోతకు మాత్రం తల్లడిల్లి పోయింది. ఇది జరిగి పాతికేళ్లయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మా నాన్న మా అమ్మతో ‘మా ఇంటి ఆడపడుచులు అత్తగారిళ్లలో కీలకమవుతారు అని నా ముగ్గురు అక్కలు నిరూపించారు. నా కూతుళ్లూ అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు’ అని చెప్పుకుని మురిసిపోతుంటారు.  - మను

 

అది నాన్న మనసు
పెళ్లయ్యాక తొలిసారి అమ్మా వాళ్లింటికి వెళ్లాను. మా బాంబే ట్రిప్ గురించి అడిగారు అమ్మానాన్న. ముభావంగానే చెప్పాను.  నా ముభావాన్ని అమ్మ గమనించలేదు కాని నాన్న కనిపెట్టారు. మా ఇంట్లో తూగుటుయ్యాల ఉండేది. రాత్రి భోజనలయ్యాక  దాని మీద కాసేపు సేదతీరడం నాన్నకు ఆలవాటు. ఎప్పటిలాగే ఆ రోజూ రాత్రి భోజనలయ్యాక ఉయ్యాల మీద కూర్చుని  ‘ఏమైంది బెటా... మీ ఆయన ఏమన్నా  అన్నాడా?’  అని అడిగారు.  ఏం లేదు అని చెప్పానే కానీ దుఃఖమాగక ఏడ్చేశాను. ‘మీరంతా మంచివాడు, మర్యాదస్తుడు అంటేనే కదా అతన్ని చేసుకున్నాను’ అన్నాను.  ఆప్యాయంగా నా వెన్ను నిమురుతూ ‘విషయం ఏంటి బేటా...?’ అని అడిగేసరికి మా బాంబే ట్రిప్‌లో జరిగింది చెప్పేశాను.  ‘అక్కడ నేను ఎత్తుమడమల చెప్పుల జత ఒకటి చూశాను. మొదటిసారి నోరు తెరిచి కొనివ్వమని అడిగాను. నువ్వేమన్నా సినిమా యాక్టర్‌వా అలాంటి చెప్పులు వేసుకోవడానికి? అంటూ వెటకారమాడాడు. ఆ చెప్పుల  రూపం నా మనసులో నాటుకుపోయింది. అవి ఎంత బాగున్నాయో’ అంటూ ఆత్రంతో  ఓ కాగితం తీసుకొని వాటి బొమ్మ కూడా వేశాను. రంగునూ వర్ణించాను. అంతా విని నాన్న నవ్వారు. ‘ఇక్కడ నువ్వు కూతురువి. ఇది నీ రాజ్యం. అక్కడ భార్యవు. అది ఆయన రాజ్యం. సర్దుకుపోవాలి’ అంటూ  నచ్చజెప్పారు. కాని ఆ రాత్రి ఆయన నిద్రపోలేదు. తెల్లవారి పదింటికి నేను గీసిచ్చిన చెప్పుల బొమ్మ కాగితం పట్టుకొని  ఇంటి నుంచి బయటపడ్డారు.


ఊర్లోని ప్రతి చెప్పుల షాపూ తిరిగారు. ఎక్కడా నేను కోరుకున్న చెప్పులు దొరకలేదు. ఆ సాయంత్రమే బాంబే రైలు ఎక్కి మూడో రోజు తెల్లవారు జామున ఆరున్నరకు వచ్చారు. నేనింకా నిద్రలేవనే లేదు.  నా మంచం దగ్గరకు వచ్చి  ‘బేటా..’ అంటూ ఆత్మీయంగా పిలిచాడు.  దిగ్గున లేచి కూర్చున్నాను. కళ్లు తెరిచి చూద్దును కదా.. నేను మనసు పడ్డ ఎత్తమడమల చెప్పులు! పట్టలేని సంతోషం. అది నా కళ్లల్లో చూసుకొని తృప్తిగా అక్కడి నుంచి వెళ్లాడు. చెప్పులు అరుగుతాయి.. కాని తండ్రి ప్రేమ అరిగేది కరిగేది కాదు కదా... ఆ ప్రేమకు రూపమైన ఆ ఎత్తుమడమలను అరగనీయకుండా దాచుకున్నాను! - లక్ష్మీశాస్త్రి

 

 అలా వెళ్లిన నాన్న మళ్లీ రాలేదు...
మా నాన్న జగమెరిగిన మాస్టారు. కుంచనపల్లి, నంబూరు, వేజండ్ల, వడ్డేశ్వరం, కొలనుకొండ గ్రామాలలో ట్యుటోరియల్ సెంటర్లు నిర్వహించారు. ఎంతోమందికి చదువు చెప్పారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థుల చేత ప్రైవేట్ క్యాండిడేట్లుగా పరీక్షలు రాయించేవారు. అందుకోసం పరీక్షాకేంద్రానికి దగ్గరలో ఒక ఇల్లు తీసుకుని, దాదాపు నెలరోజుల పాటు అక్కడే ఉండి, వాళ్లకు పాఠాలు చెప్పి శ్రద్ధగా పరీక్షలు రాయించేవారు. మేము పరీక్షలు రాసేటప్పుడు కూడా నాన్న మమ్మల్ని దగ్గరుండి పరీక్ష హాలుకి తీసుకెళ్లేవారు. తిరిగి మేము పరీక్ష రాసి హాలు బయటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చేవారు. చిన్నప్పుడు నాన్నను చూస్తే చచ్చేంత భయం. అల్లరి చేసేటప్పుడు గట్టిగా ఒక్క కేక వేశారంటే చాలు. చెడ్డీ తడిసిపోయేది. అలాగని కోపిష్టి ఏమీ కాదు. ఆయన్ని చూస్తే మాకు భయంతో కూడిన భక్తి అంతే! మేమంటే ఆయనకు చాలా ప్రేమ. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మాకోసం పండ్లు, స్వీట్లు, ఇంకా ఏవైనా చిరుతిళ్లు తెచ్చేవారు. అప్పటికి మేము నిద్రపోతుంటే లేపి, నోట్లో పెట్టేవారు. మేము నిద్రలోనే నాన్న తినిపించిన వాటిని తినేవాళ్లం. మర్నాడు మళ్లీ మాకోసం ఏమి తెచ్చావు నాన్నా అని అడిగితే, పండ్ల తొక్కలు చూపించేవారు నవ్వుతూ. మిన్ను విరిగి మీద పడుతోందన్నా చలించేవాడు కాదు నాన్న. నిబ్బరంగా ఉండేవారు. మా అక్క పెళ్లి కొద్దిరోజుల్లోకి వచ్చింది. చేతిలో పైసా లేదు. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఊళ్లో ఆయన అంటే అభిమానమున్న వాళ్లు కొందరు ‘పంతులుగారూ, అమ్మాయిగారి పెళ్లంట కదా, ఇది ఉంచండి’ అంటూ తలా కాస్త చేబదులుగా ఇచ్చారు.

 
ఒకరి కింద ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేకనే, ట్యుటోరియల్సు, కాన్వెంటూ పెట్టుకుని సంసారాన్ని ఎలాగో నెట్టుకొచ్చాడు. చివరి రోజుల్లో అందరూ చెబుతుండడంతో అయిష్టంగానే  విజయవాడలోని ఒక ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం చేశాడు. మా ఊరినుంచి రోజూ ఓ సెకండ్ హ్యాండ్ టీవీఎస్ ఫిఫ్టీ మీద స్కూలుకు వెళ్లి వచ్చేవారు. ఓ రోజు పొద్దున్నే అలా స్కూలుకని ఇంటినుంచి బయలుదేరి వెళ్లిన మా నాన్న మళ్లీ రాలేదు.  లారీ ఢీకొట్టడంతో ఆయన శరీరం మాత్రమే ఇంటికి వచ్చింది. దాంతో ఇప్పటికీ నాకు ద్విచక్రవాహనమంటే  అలర్జీ.  ఎన్ని ఇబ్బందులున్నా సరే, బస్సు తప్ప, బండి ఎక్కను. ఒకవేళ ఎక్కాలన్నా, నాన్న పోయిన రోజున మా అమ్మ ఏడుపులే గుర్తొస్తాయి.     - బాచి

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement