సర్వం శక్తిమయం జగత్
సందర్భంనేడు విజయదశమి
ఏ రాక్షసుణ్ణి ఎలా వధించాలో అలా ఆలోచన చేయగలిగిన తల్లి ఆమె. ఒక్క బొట్టు రక్తం తన నుండి నేల పడినా తనలాంటి లక్షణాలున్న దుర్మార్గులు వేల సంఖ్యలో పుట్టాలనే వరాన్ని పొందిన రక్తబీజుణ్ణి వధించడానికి తన నాలుకని పృథివితో సమానంగా పెంచి దాని మీద వాణ్ని వధించింది.
అఖిలానికి ‘అయ్య’ అయిన శంకరుని గురించి అలవోకగా శ్లోకాన్ని చెప్పబోతూ ఆది శంకరులవారు అలా గలగలా నవ్వేశారు. దానిక్కారణం ఎక్కడెక్కడ అయ్య గురించి అలోచించినా అక్కడక్కడ అమ్మ మాత్రమే కనిపించడం! అందుకే ఆయన అమ్మ గురించి చెప్పదలచిన సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో ‘శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చే దేవం దేవో న ఖలుః కుశలః స్పందితు మపి అనేశాడు. (అమ్మతో కూడి ఉంటేనే అయ్య దేన్నైనా చేయ సమర్థుడౌతాడు. ఆమె లేకుంటే అసలాయన దేన్నీ చేయలేడు అని అర్థం).
పోనీ ఆది శంకరులవారు అలా రాసారు అనుకున్నా, ‘నేను నేనే’ అని అయ్య ఏమైనా అన్నాడేమోనని వెతికి వెతికి చూస్తే ఆయనంతట ఆయన అననే అనేశాడు. అంతా నిన్ను పెళ్లాడాకే సుమా! లేకపోతే నా మహిమేముంది? (భవాని! త్వత్పాణి గ్రహణ పరిపాటీ ఫలమిదమ్) అని. సరే బ్రహ్మగారేమైనా తన భార్య లేకుండా శక్తిమంతుడా అని అలోచిస్తే, ఆయన తన నాలుగు ముఖాల నుండీ నిరంతరం వేద గానాన్ని చేస్తూండడాన్ని బట్టి ఆయనంటూ ఒకరున్నారని లోకానికి తెలుస్తోంది కానీ, అసలు బ్రహ్మ ఉనికికి కూడా కారణం ఆయనకున్న శక్తి (భార్య అయిన సరస్వతి) అనే అర్థమౌతోంది. ఇక శ్రీహరి మాట చెప్పేదేముంది? విష్ణుశక్తి మొత్తం లక్ష్మిదే కదా! ఆ శక్తి లేని పక్షంలో విష్ణుదర్శనానికి ఎవరొస్తారు? నిత్య కల్యాణమెక్కడ? పచ్చతోరణమెక్కడ?
కాబట్టి ఏ బ్రహ్మకి శక్తి సరస్వతి ఔతోందో, ఏ విష్ణువుకి శక్తి లక్ష్మిగా కనిపిస్తోందో, ఏ శంకరునికి శక్తి పార్వతి మాత్రమే అని రుజువయిందో ఆ కారణంగా ‘శక్తి’ అంటే పురుషునికి సహకరించే భార్య అనీ, శక్తిపూజ (అమ్మవారి పూజ) చేయడం అంటే దంపతుల అన్యోన్యత కోసం చేయబడే పూజ అనీ, ఈ త్రిశక్తుల పూజ ఆశ్వయుజ మాసంలో నెలరోజుల పొడుగునా జరుగుతోందనీ గ్రహించాలి. అయితే ఈ త్రిశక్తుల్లో కూడా ఎవరు అత్యంత ముఖ్యం? అని ఆలోచించారు రుషులు. నెల మొదట్లో పది రోజులు పార్వతీదేవికి ఉత్సవాలు జరుగుతాయి. మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజ జరుగుతుంది. తర్వాత దీపావళి అమావాస్యనాడు లక్ష్మీపూజ.
పౌరుషంలో శక్తి
శక్తి అంటే అమ్మవారే అనుకున్నాం కదా. అమ్మ భండుడనే రాక్షసుణ్ణి వధించడానికి గజసైన్యం, అశ్వసైన్యం, రథబలం, పదాతి బలంతో బయల్దేరడమే కాకుండా తనకు సహాయకునిగా వచ్చిన వినాయకునితోపాటు, విఘ్నయంత్రాన్ని కూడా తీసుకెళ్లింది. ఇతర దేవతాయుధాలన్నింటినీ తనే ఒక్కొక్క చేతిలోనూ (మొత్తం ఇరవై చేతులు) ఉంచుకుని యుద్ధానికి తలపడింది. ఆమె రాక, ఆమె యుద్ధ ప్రణాళిక చూసి అందరూ కూడా దుర్గ (ఆమెను సమీపించలేం సుమా! గంతుం దుర్గమా) అన్నారు. గమనించవలసిన విషయం ఏమిటంటే అమ్మ తానింత పౌరుషంతో (పురుష లక్షణంతో) ఉన్నా కూడా తన భర్తని తక్కువ చేయకుండా భర్త అయిన కామేశ్వరుని పేరిట ఉన్న అస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని రాజధానిని నాశనం చేసింది. తన విజయంలో ఆయన్ని కూడా భాగస్వామిగా ప్రకటించి లోకంలో స్త్రీలందరికీ మార్గదర్శకురాలయింది.
ఆలోచనలో శక్తి
ఏ రాక్షసుణ్ణి ఎలా వధించాలో అలా ఆలోచన చేయగలిగిన తల్లి ఆమె. ఒక్క బొట్టు రక్తం తన నుండి నేల పడినా తనలాంటి లక్షణాలున్న దుర్మార్గులు వేల సంఖ్యలో పుట్టాలనే వరాన్ని పొందిన రక్తబీజుణ్ణి వధించడానికి తన నాలుకని పృథివితో సమానంగా పెంచి దాని మీద వాణ్ని వధించింది.
అలాగే సుందోపసుందుల్ని వధించేందుకు- మీలో ఎవరు బలిష్టులు? అని ప్రశ్నించి పరస్పరం చంపుకునేలా పథకం రచించింది. అలాగే హయగ్రీవుడనే రాక్షసుడు కోరిన వరానికి అనుగుణంగా శ్రీహరికి హయముఖం వచ్చేందుకై శ్రీహరి శిరస్సును ఖండింపజేసింది పరమ సాహసంతో. ఇలా సాహసోపేత విధానంతో రాక్షసవధని చేపట్టి మళ్లీ ఆ రాక్షస జాతితోనే శక్తి పూజలు చేయించుకున్న నేర్పరి అమ్మ.
చక్రాల్లో శక్తి
ప్రతి వ్యక్తికీ ఉండే సప్త చక్రాల్లోనూ, సప్త రూపాల్లోనే అమ్మ ఉంటుంది. లోకమంతా ఆమెని నాలుగు చేతులున్న రూపంతో ఊహిస్తుంది కానీ, ఆమె ప్రతి వ్యక్తి శరీరంలోని భాగంలోనూ ఉంటుంది. విశుద్ధి చక్రంలో ఎర్రని రంగులో, డాకినీ నామంతో; అనాహత చక్రంలో శ్యామవర్ణంతో, రాకినీ నామధేయంతో; మణిపూరక చక్రంలో రక్తం రంగులో, లాకినీ అనే పేరుతో; స్వాధిష్ఠాన చక్రంలో పచ్చని రంగులో కాకినీ దేవి పేరుతో; మూలాధార చక్రంలో రెండు రంగుల జమిలి వర్ణంతో, సాకినీ నామంతో; ఆజ్ఞా చక్రంలో తెల్లని వర్ణంతో, హాకినీ రూపంతో ఉంటూ సహస్రారంలో అన్ని రంగుల కలయికతో యాకినీ నామంతో శక్తిగా ఆమె విరాజిల్లుతోంది.
విశుద్ధి చక్రంలో చర్మంలో, అనాహతంలో రక్తంలో, మణిపూరంలో మాంసంలో, స్వాధిష్ఠానంలో మేధస్సులో, మూలాధారంలో ఎముకల్లో, ఆజ్ఞాచక్రంలో మజ్జలో, సహస్రారంలో శుక్లంలో... ఇలా శరీరంలోని సప్తధాతువుల్లోనూ ఉండి మనని నడిపిస్తోంది అమ్మ.
లోకంలో ప్రజలకు 1000 విధాల కష్టాలుంటాయని గ్రహించి, ఏ కష్టానికి ఏ నామం పఠిస్తే కష్ట నివారకమో చెప్తూ, అలాంటి వెయ్యి కష్టాలకీ వెయ్యి నామాలని కూర్పించి, ఆ నామాలకి శక్తి పెరిగేందుకై వాటన్నిటినీ ఒకేచోట ‘లలితా సహస్ర నామాలు’ అంటూ చేర్చి మననం చేసుకుంటూ ఉండవలసిందని చెప్తోంది అమ్మ.
- డా ॥మైలవరపు శ్రీనివాసరావు