మా అబ్బాయి వయసు ఆరేళ్లు. గత ఏడాదిగా అతడి ప్రవర్తన కాస్త వేరుగా అనిపిస్తోంది.
హోమియో కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు ఆరేళ్లు. గత ఏడాదిగా అతడి ప్రవర్తన కాస్త వేరుగా అనిపిస్తోంది. గంటలకొద్దీ స్తబ్దుగా ఉంటున్నాడు. అకారణంగా ఏడుస్తున్నాడు. ఇతరులతో కలవడం లేదు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటున్నాడు చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి, ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో దీనికి తగిన చికిత్స ఉందని చెబుతున్నారు. మాకు తగిన పరిష్కారం సూచించండి.
- ప్రియ, నకిరేకల్
ఆటిజమ్ చిన్నపిల్లల్లో కనిపించే సమస్య. దీనినే ‘పర్వేసివ్ డెవలప్‌మెంట్ డిజార్డర్’ అంటారు. దీని వల్ల పిల్లల ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ఈ సమస్య వచ్చిన పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే ముందే వాటిని గమనిస్తే ఈ సమస్యను అధిగమించడం చాలా సులభం.
కారణాలు: ప్రత్యేకంగా కారణమంటూ ఏదీ లేదు. కానీ కొన్నిసార్లు మెదడు పెరుగుదలలో లేదా పనితీరులో కనిపించే అసాధారణ లోపాల వల్ల ఆటిజమ్ రావచ్చు. కొందరిలో తల్లి గర్భంతో ఉన్న సమయంలో ఆమెకు ఏవైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు లేదా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా ఇది రావచ్చు.
లక్షణాలు: ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించవచ్చు ఇతరులతో కలవలేకపోవడం తోటిపిల్లలతో ఆడుకోడానికి అంతగా ఇష్టపడకపోవడం చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తుండటం భావ వ్యక్తీకరణలో లోపం వంటివి.
నిర్ధారణ: మరీ చిన్న పిల్లల్లో... తల్లి దగ్గరకు తీసుకున్నా ఏమీ స్పందించకపోవడం, తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచినప్పుడు ఉత్సాహంగా ముందుకు రాకపోవడం గంటల తరబడి స్తబ్దుగా ఉండిపోవడం పరిచితులను చూడగానే పలకరింపుగా నవ్వకపోవడం నిరంతరం అకారణంగా ఏడవడం కాస్త పెద్ద వయసు పిల్లల్లో... కళ్లలో కళ్లు పెట్టి చూడకపోవడం ముఖంలో భావోద్వేగాలు చూపించకపోవడం నొప్పికీ, బాధకూ స్పందిచకపోవడం కాళ్లు, చేతులు అసహజంగా కదిలిస్తూ ఉండటం అసందర్భంగా ఏవేవో మాటలు మాట్లాడుతుండటం మానసిక ఎదుగుదల లోపించడం.
నివారణ : పిల్లలకు పోషకాలతో కూడిన సమతులాహారం ఇవ్వడం ఒంటరిగా వదిలిపెట్టకుండా ఎక్కువ సమయం వాళ్లతో గడపడం.
చికిత్స: హోమియో విధానంలో వాళ్ల లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు కాన్‌స్టిట్యూషన్ విధానంలో తగిన మందులు ఇవ్వడం ద్వారా ఆటిజమ్ సమస్యను పరిష్కరించవచ్చు.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
హార్ట్ కౌన్సెలింగ్
మా అన్నయ్యకు 45 ఏళ్లు. అతడి గుండె రక్తం సరిగా పంప్ చేయలేని పరిస్థితికి వచ్చేసిందని డాక్టర్లు అంటున్నారు. దీనివల్ల ఏ సమయంలోనైనా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మా అన్నయ్యకు గుండె మార్పిడి చేయిద్దామని, చాలా కాలం క్రితమే అవయవ దానం చేసే ‘జీవన్‌దాన్’లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. కానీ మా అన్నయ్యది రేర్ బ్లడ్ గ్రూప్ కావడంతో సరిపోయే గుండె ఎంతకూ లభించడం లేదు. ఆయన గుండె మరింత బలహీనమైపోయి, హార్ట్ ఫెయిల్యూర్ అయితే మూడు నెలల్లోగా మాత్రమే గుండెను అమర్చుకునే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి. దయచేసి తగిన పరిష్కారం చెప్పగలరు.
- వరుణ్, తిరుపతి
గుండె పూర్తిగా విఫలమై రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం 20 నుంచి 10 శాతం వరకు పడిపోయే పరిస్థితిని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి పరిస్థితి వస్తే గుండె మార్పిడి ఒక్కటే మార్గం. అయితే గుండె మార్పిడికి దాత అవసరమవుతారు. సకాలంలో దాత లభించకపోయినా, బ్లడ్‌గ్రూప్ మ్యాచ్ కాకపోయినా గుండె మార్పిడి కోసం వేచి చూసేవారు ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వైద్యశాస్త్రంలో అధునాతన మార్పుల వల్ల ప్రస్తుతం సహజమైన గుండెకు ప్రత్యామ్నాయంగా పనిచేసే కృత్రిమ గుండె అందుబాటులోకి వచ్చింది. సకాలంలో సహజమైన గుండె లభించని రోగులకు కృత్రిమ గుండె ఒక వరంలాంటిదని చెప్పవచ్చు. గుండె పూర్తిగా చెడిపోయినప్పుడు లేదా పనిచేయని స్థితికి చేరినప్పుడు ఈ కృత్రిమ గుండెను కొన్ని ఉపకరణాల సహాయంతో అమర్చుకొని సాధారణ జీవితం గడిపేయవచ్చు. దీనినే వైద్య పరిభాషలో హార్ట్‌వేర్ వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైజ్ (హెచ్‌విఏడీ) అంటారు. గోల్ఫ్ బంతి సైజ్‌లో ఉండే ఈ పరికరాన్ని ఛాతీ లోపల గుండెకు కిందిభాగంలో అమర్చుతారు. రోగికి లెఫ్ట్ వెంట్రికల్ ఫెయిల్యూర్ అయితే గుండె ఎడమ భాగానికి సపోర్టుగా లేదా రైట్ వెంట్రికల్ ఫెయిల్యూర్ అయితే గుండె ఎడమభాగానికి సపోర్టుగా దీన్ని అమర్చుతారు. గుండె కింది భాగంలో అమర్చిన ఈ పరికరాన్ని ఛాతీ బయట ఉన్న బ్యాటరీ కంట్రోలర్‌కు అనుసంధానిస్తారు. ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి ఈ బ్యాటరీలను చార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి అధునాతనమైన వైద్య సదుపాయాన్ని అందిపుచ్చుకుంటే మీ అన్నయ్య కొన్నేళ్ల పాటు సాధారణ జీవితాన్ని చాలా ఆనందంగా జీవించగలరు. కాబట్టి ఆందోళన చెందకండి. వీలైనంత త్వరగా దగ్గర్లోని వైద్యులను సంప్రదించండి.
డాక్టర్ పి.వి. నరేశ్ కుమార్
సీనియర్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ కార్డియో థొరాసిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్
డెర్మటాలజీ కౌన్సెలింగ్
నేను నీళ్లు తాగుతున్నప్పుడు చేతిలోంచి వాటర్‌బాటిల్ జారి, కాలి బొటన వేలిపై పడింది. అప్పుడు ఏమీ అనిపించలేదు గానీ రెండు రోజుల తర్వాత వేలంతా ఎర్రగా నీలంగా వాచి బల్బులాగా మారింది. నా గోరు చెడిపోయినట్లుగా అనిపిస్తోంది. ఇక ఈ గోరు నార్మల్‌గా మారడం జరగదా? తగిన సలహా ఇవ్వండి.
- సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్
మీరు ఊహిస్తున్నట్లే మీ గోరు కణజాలానికి నష్టం చేకూరింది. ఒంటిలో గోరు ఆనుకుని ఉండే ‘నెయిల్ బెడ్’కు గాయమైనట్లు మీరు రాసిన విషయాలను బట్టి తెలుస్తోంది. గోటికి అయిన గాయం తగ్గడం కోసం మీరు ఈ కింద పేర్కొన్నవిధంగా మందులు తీసుకోవాలి.
మీరు అజిథ్రోమైసిన్-500 ఎంజీ మాత్రలు పొద్దున ఒకటీ, రాత్రి ఒకటీ చొప్పున మూడు రోజుల పాటు తీసుకోవాలి. వాపుతో పాటు నొప్పి ఉంటే ఐబుప్రొఫెన్, పారాసిటమాల్ కాంబినేషన్‌లో ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒకటి చొప్పున రెండు రోజులు వాడాలి. వేలి దగ్గర నొప్పిగా ఉంటే గాయానికి నేరుగా ఐస్ అద్దకుండా, ఏదైనా గుడ్డలో చుట్టి ఐస్ కాపడం పెట్టండి. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు ఐస్ కాపడం పెట్టాలి. గాయం తగ్గిన తర్వాత గోరు నార్మల్‌గా అనిపించకపోతే... ఒకసారి మీకు దగ్గర్లోని డెర్మటాలజిస్ట్‌ను కలవండి. వారు ఆ వేలిని పరీక్షించి అక్కడి ‘నెయిల్ మాట్రిక్స్’ అంతా బాగుందా లేదా అని చూసి, దాన్ని బట్టి ఆ తర్వాత చేయాల్సినదేమిటో నిర్ణయిస్తారు.
నా వయసు 49. నా తొడలపై ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. చెమట పట్టినప్పుడు చాలా దురదగా ఉంటోంది. పైగా మచ్చల సైజు క్రమంగా పెరుగుతున్నట్లనిపిస్తోంది. నేనెన్నో క్రీములు రాశాను. కానీ మేలు జరగలేదు. తగిన సలహా ఇవ్వండి.
- ఆనంద్‌రావు, నెల్లూరు
మీరు చెబుతున్న అంశాలను బట్టి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మాటిమాటికీ తిరగబెడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోల్, టర్బినఫిన్ ఉన్న క్రీమును 2-3 వారాల పాటు రాయాలి. దీంతోపాటు ప్రతిరోజూ మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డెర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి
హైదరాబాద్