క్యాల్షియమ్‌ టాబ్లెట్లు తీసుకుంటున్నా ఆస్టియోపోరోసిస్‌ వస్తుందా?  | health counciling | Sakshi
Sakshi News home page

క్యాల్షియమ్‌ టాబ్లెట్లు తీసుకుంటున్నా ఆస్టియోపోరోసిస్‌ వస్తుందా? 

Published Wed, Apr 4 2018 12:42 AM | Last Updated on Wed, Apr 4 2018 12:42 AM

health counciling - Sakshi

ఆర్థోపెడిక్‌ కౌన్సెలింగ్‌
నా వయసు 53 ఏళ్లు. ఏడేళ్ల కిందట రుతుక్రమం ఆగిపోయింది. రుతుక్రమం తగ్గిన వాళ్లంతా జీవితాంతం క్యాల్షియమ్‌ ఎక్కువగా తీసుకోవాలని ఎక్కడో చదివాను. అప్పట్నుంచి క్రమం తప్పకుండా క్యాల్షియమ్‌ మాత్రలు వాడుతున్నాను. వారం రోజుల కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన కొన్ని పరీక్షలు చేయించి ఆస్టిపోరోసిస్‌ అన్నారు. నేను క్యాల్షియమ్‌ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది?  – ఒక సోదరి, విజయవాడ 
క్యాల్షియమ్‌ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్‌ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్‌ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్‌ కనిపించడం చాలా సాధారణంగా జరిగేదే. దీనికి కేవలం క్యాల్షియమ్‌ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్‌ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్‌ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్‌ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు వంటివి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే  మీరు క్యాల్షియమ్‌ టాబ్లెట్స్‌ వాడాల్సిన పని కూడా ఉండదు. 

ఇంకా నొప్పి తగ్గడం లేదెందుకు?
నా వయసు 27 ఏళ్లు. ఈమధ్యే నేను బైక్‌పైనుంచి కింద పడ్డాను. మోకాలు కొద్దిగా వాచింది. దానిపై ఏమాత్రం భారం వేయలేకపోతున్నాను. డాక్టర్‌గారికి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్‌ ఏమీ లేదని చెప్పారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.  – ప్రమోద్‌కుమార్, ఖమ్మం 
మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్‌ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి.  దీనికోసం ఎమ్మారై స్కాన్‌ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్‌ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో అది భవిష్యత్తులో మరింత సమస్య కావచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను సంప్రదించండి. 

ల్యూబ్రికెంట్‌  ఇంజెక్షన్‌తో  ప్రయోజనం  ఉంటుందా? 
నా వయసు 56 ఏళ్లు. నాకు గత కొంతకాలంగా రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తూ అది క్రమంగా పెరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆర్థరైటిస్‌ అన్నారు.  మోకాళ్లలోకి కందెనలాగా (ల్యూబ్రికెంట్‌ పనిచేసే) అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. వాటితో ప్రయోజనం ఉంటుందా? సలహా ఇవ్వండి. 
– సీతారామమోహన్‌రావు, విశాఖపట్నం
 
మీరు చెప్పిన కందెనలా పనిచేసే ల్యూబ్రెకెంట్స్‌ చాలాకాలంగా అందుబాటులో ఉన్నావే. కాబట్టి అవి మరీ ఆధునికమైనవేమీ కాదు. దాదాపుగా గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాడుతున్నవే. అయితే అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్‌ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి లక్షణాల తీవ్రతను కొంతవరకు మాత్రమే తగ్గిస్తాయి. అంతేతప్ప వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. ఇక మోడరేట్‌ ఆర్థరైటిస్‌ వారికే తప్ప సివియర్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్‌ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్‌ దెబ్బతిని ఉంటుంది  కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. అందువల్ల ఆ ఇంజెక్షన్లతో అద్భుతాలు జరుగుతాయని ఆశించకండి. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను కలిసి, తగిన వైద్యసహాయం పొందండి. 

నా వయసు 57 ఏళ్లు. నేను నాలుగేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను కలిస్తే... నాకు ఆస్టియో ఆర్థరైటిస్‌ అని చెప్పి, క్యాల్షియమ్‌ ప్రిస్క్రయిబ్‌ చేశారు. చాలాకాలంగా వాడుతున్నా నొప్పి తగ్గడం లేదు. దీర్ఘకాలికంగా క్యాల్షియమ్‌ వాడుతుంటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని నేను ఈ మధ్యనే చదివాను. అప్పట్నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు సలహా ఇవ్వగలరు.     – ఆర్‌. మంజరి, సూళ్లూరుపేట 
ఆస్టియో ఆర్థరైటిస్‌లో మొదట ఎముకల చివరల (అంటే కీళ్ల ఉపరితలంలో) ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్‌) క్రమంగా అరిగిపోతుంది. కార్టిలేజ్‌లో క్యాల్షియమ్‌ ఉండదు. బహుశా మీ డాక్టర్‌ క్యాల్షియమ్‌ ఇచ్చింది మీ ఆస్టియో ఆర్థరైటిస్‌కు అయి ఉండదు. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం మందులతో పాటు ఆయన క్యాల్షియమ్‌ను కూడా సూచించి ఉంటారు. ఆర్థరైటిస్‌కు కేవలం క్యాల్షియమ్‌తో గుణం కనిపించదు. మీ మోకాలి నొప్పి తగ్గదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ‘ఆస్టియో ఆర్థరైటిస్‌’కు కాకుండా... ‘ఆస్టియో పోరోసిస్‌’ కండిషన్‌లో మీ ఎముకలు బలహీనం అయిపోకుండా చూడటానికి క్యాల్షియమ్‌ను డాక్టర్లు ప్రిస్క్రయిబ్‌ చేస్తారు. మీరు మరోసారి మీ డాక్టర్‌ గారిని సంప్రదించండి. 

గాయం తగ్గింది... కానీ ఇప్పటికీ నొప్పి
ఎనిమిది నెలల కిందట నా కాలు స్లిప్‌ అయ్యి, నా చీలమండ బెణికింది (ట్విస్ట్‌ అయ్యింది). అప్పట్లో ప్లాస్టర్‌ కూడా వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి వస్తూనే ఉంది. అప్పడప్పుడూ అక్కడ వాపు కూడా వస్తోంది. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. 
– సుధారాణి, మాచర్ల 

మీ కాలు బెణికినప్పుడు మీ చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్‌ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్‌ కాస్ట్‌ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.  
డాక్టర్‌ కె. సుధీర్‌రెడ్డి, 
ఆర్థోపెడిక్‌ సర్జన్, 
ల్యాండ్‌మార్క్‌ హాస్పిటల్స్,
కేపీహెచ్‌బీ, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement