హోమియో కౌన్సెలింగ్
నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా?- సత్యనారాయణ, ఆదిలాబాద్
అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. వాటికి వాడే కొన్ని మందులివి...
యాంట్ టార్ట్ : జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆర్స్ ఆల్బ్ : దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ. హెపార్‌సల్ఫ్ : చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది. సోరియమ్ : ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది.
నేట్రమ్ సల్ఫ్ : నేలమాళిగలు, సెలార్స్‌లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు. ఫాస్ : మెత్తటి స్వభావం. ఎవరు ఏ సాయం అడిగినా చేస్తారు. భయంగా ఉంటారు. క్షయ వ్యాధి ఉన్నా ఈ మందు వాడవచ్చు. రోడో : వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది. కాలీ ఎస్ : ఆయాసం ఎక్కువగా ఉంటుంది. మెర్క్‌సాల్ : వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది. పైన పేర్కొన్న మందుల్ని రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి.
డాక్టర్ టి.కిరణ్ కుమార్
డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి
విజయవాడ, వైజాగ్
గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు... పరిష్కారం చెప్పండి!
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. నాకు కొన్నాళ్ల నుంచి కడుపు మధ్యభాగం నుంచి పైభాగం వరకు అంటు గుండెలో మంటగా ఉంటోంది. కడుపులో ఉబ్బరంగానూ, గ్యాస్ నిండినట్లుగానూ, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్నాను. ఇంటి దగ్గర ఒక జనరల్ ఫిజీషియన్‌ను కలిసి మందులు వాడాను. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. అప్పుడప్పుడు వాంతులు కూడా అయ్యాయి. మళ్లీ డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు నిర్వహించి, గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మందులు వాడుతున్నాను. కిడ్నీలో రాళ్ల గురించి విన్నాను. కానీ ఈ గాల్‌బ్లాడర్ రాళ్లేంటి? అవి ప్రమాదకరమా? మందులు వాడితే సరిపోతుందా? శాశ్వత పరిష్కారం కోసం నేను ఎవరిని సంప్రదించిలో దయచేసి సలహా ఇవ్వండి. - చంద్రశేఖర్, విజయవాడ
గాల్‌బ్లాడర్ అంటే పిత్తాశయం అని అర్థం. ఇది మన కాలేయం (లివర్)తో పాటుగా ఉండే ముఖ్యమైన అవయవం. మనం తినే ఆహారం ద్వారా లివర్ ఉత్పత్తి చేసే పైత్యరసాన్ని స్టోర్ చేస్తూ చిన్న పేగుకు సరఫరా చేస్తుంది. ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే వాటిని చిన్న చిన్న పరిమాణంలో ఉండేలా విడదీస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా మన ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వును గాల్‌బ్లాడర్ తనలో స్టోర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు అవి అలాగే పేరుకుపోయి రాళ్లలో ఏర్పడి పిత్తాశయం నిర్వహించే విధులకు ఆటంకంగా మారవచ్చు. మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్‌తో పాటు మనలోని జీన్స్, ఊబకాయం, మనం వాడే పెయిన్‌కిల్లర్స్ లేదా మహిళలు పెగ్నెన్సీ రాకుండా వాడే పిల్స్ వల్ల కూడా ఈ సమస్యకు కొన్ని ప్రధాన కారణాలు. డయాబెటిస్, ఊబకాయం, జీర్ణ సమస్యతో బాధపడేవాళ్లు ఎక్కువగా ఈ గాల్‌బ్లాడర్ స్టోన్స్ సమస్యకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కిడ్నీలో మాదిరిగా ఇవి రాళ్లు కావు. మన ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన చిన్న చిన్న ఘనపదార్థాలు ఒక ఉండలాగా ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి మన పిత్తవాహికకు అడ్డు తగిలి నొప్పిని కలిగిస్తాయి.
ఆ నొప్పి కలిగే వరకూ అవి మన శరీరంలో ఏర్పడిన విషయం కూడా మనకు తెలియదు. ఇక మీ విషయానికి వస్తే... ఇవి మందులతో తగ్గవు. తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అశ్రద్ధ చేస్తే గాల్‌బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం, కామెర్లు (జాండిస్) రావడం, పాంక్రియాస్ వాపునకు గురికావడం లేదా కడుపులో తీవ్రమైన నొప్పి రావచ్చు. కాబట్టి పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడ్డాయో తెలుసుకొని అందుకు తగ్గ చికిత్స చేస్తే మీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
డాక్టర్ యు.దత్తారామ్
సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్