Common cold
-
Covid-19: ‘చిన్నారుల్లో జలుబు’లా మారిపోతుంది
వాషింగ్టన్: రాబోయే రోజుల్లో కోవిడ్–19 చిన్న పిల్లల్లో వచ్చే సాధారణ జలుబులా మారిపోతుందని అమెరికా, నార్వే తాజాగా నిర్వహించిన ఒక సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సినేషన్ తీసుకోని చిన్నారులపైనే ఈ వైరస్ ప్రభావం ఉంటుందని ఆ సర్వే తెలిపింది. ఇప్పటివరకు కోవిడ్–19 పిల్లలకు స్వల్పంగా సోకినప్పటికీ అంతగా ప్రభావం లేదని పేర్కొన్న సర్వే, మిగిలిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ వైరస్ ముప్పు పెద్దలకి తప్పిపోతుందని అంచనా వేసింది. ‘రాబోయే కాలంలో పెద్దలందరికీ వైరస్ సోకడం లేదంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాంటీబాడీలు వస్తాయి. దీంతో ఈ వైరస్ తీవ్రత బాగా తగ్గిపోతుంది. వ్యాక్సిన్ తీసుకోని చిన్నపిల్లలకి సాధారణంగా వచ్చే ఓ చిన్నపాటి జలుబులా మారిపోతుంది’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఒట్టర్ బోర్నస్టడ్ చెప్పారు. ఈ అధ్యయనం వివరాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. ఒక్కసారి గత చరిత్ర చూస్తే ఎన్నో మహమ్మారులు తొలుత ఉగ్రరూపం దాల్చి ఆ తర్వాత పిల్లలకి వచ్చే సాధారణ వ్యాధుల్లా మారిపోయినవి ఉన్నాయని ఆయన చెప్పారు. ‘1889–1890లో పెచ్చరిల్లిన రష్యన్ ఫ్లూ 10 లక్షల మందిని పొట్టన పెట్టుకుందని, ఇప్పుడా వైరస్ 7–12 నెలల పిల్లలకి వచ్చే సాధారణ జలుబులా మారింది. ఏదైనా మహమ్మారి చివరి దశకి వచ్చేటప్పటికి దాని తీవ్రత తగ్గిపోతుందని కోవిడ్–19 కూడా అలాగే మారుతుంది’ అని ప్రొఫెసర్ బోర్నస్టడ్ వివరించారు. కరోనా వైరస్ సోకిన వారిలో కంటే, వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే అధికంగా యాంటీ బాడీలు వచ్చినట్టుగా తమ పరిశోధనల్లో వెల్లడైనట్టుగా ఆయన తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన చెప్పారు. అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో కరోనా వైరస్ ఉధృతిని పరిశీలిస్తూ రియలిస్టిక్ ఏజ్ స్ట్రక్చర్డ్ (ఆర్ఏఎస్) మ్యాథమెటికల్ మోడ్‌లో రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత ఎలా ఉంటుందో అధ్యయనం చేసినట్టుగా బోర్నస్టడ్ వివరించారు. -
ఇంటిప్స్
తీపిని ఇష్టపడని పిల్లలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొంతమంది పిల్లలకు చక్కెరతో చేసిన స్వీట్ తింటే వెంటనే జలుబు, దగ్గు సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు తేనె వాడడం మంచిది. చక్కెర చక్కటి ప్రత్యామ్నాయం తేనె. ఇది సహజమైనది కాబట్టి ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లూ ఉండవు. త్వరగా శక్తినిస్తుంది కూడ. తేనె కొద్ది నెలలకు చిక్కబడుతుంది. అప్పుడు సీసాను పది నిమిషాల సేపు ఎండలో ఉంచితే తిరిగి పలచబడుతుంది. చిక్కబడకపోయినా సరే కనీసం ఏడాదిలో ఒకసారి అయినా అరగంట సేపు ఎండలో ఉంచాలి. బాటిల్ అడుగున ఉండిపోయిన తేనెను బయటకు తీయాలన్నా కూడా ఇదే పద్ధతి. తేనెను ఎప్పుడు కూడా మంట మీద వేడి చేయకూడదు. -
అలర్జీ పూర్తిగా తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా?- సత్యనారాయణ, ఆదిలాబాద్ అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. వాటికి వాడే కొన్ని మందులివి... యాంట్ టార్ట్ : జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆర్స్ ఆల్బ్ : దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ. హెపార్‌సల్ఫ్ : చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది. సోరియమ్ : ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది. నేట్రమ్ సల్ఫ్ : నేలమాళిగలు, సెలార్స్లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు. ఫాస్ : మెత్తటి స్వభావం. ఎవరు ఏ సాయం అడిగినా చేస్తారు. భయంగా ఉంటారు. క్షయ వ్యాధి ఉన్నా ఈ మందు వాడవచ్చు. రోడో : వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది. కాలీ ఎస్ : ఆయాసం ఎక్కువగా ఉంటుంది. మెర్క్‌సాల్ : వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది. పైన పేర్కొన్న మందుల్ని రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు... పరిష్కారం చెప్పండి! గ్యాస్ట్రో కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు కొన్నాళ్ల నుంచి కడుపు మధ్యభాగం నుంచి పైభాగం వరకు అంటు గుండెలో మంటగా ఉంటోంది. కడుపులో ఉబ్బరంగానూ, గ్యాస్ నిండినట్లుగానూ, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్నాను. ఇంటి దగ్గర ఒక జనరల్ ఫిజీషియన్‌ను కలిసి మందులు వాడాను. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. అప్పుడప్పుడు వాంతులు కూడా అయ్యాయి. మళ్లీ డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు నిర్వహించి, గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మందులు వాడుతున్నాను. కిడ్నీలో రాళ్ల గురించి విన్నాను. కానీ ఈ గాల్‌బ్లాడర్ రాళ్లేంటి? అవి ప్రమాదకరమా? మందులు వాడితే సరిపోతుందా? శాశ్వత పరిష్కారం కోసం నేను ఎవరిని సంప్రదించిలో దయచేసి సలహా ఇవ్వండి. - చంద్రశేఖర్, విజయవాడ గాల్‌బ్లాడర్ అంటే పిత్తాశయం అని అర్థం. ఇది మన కాలేయం (లివర్)తో పాటుగా ఉండే ముఖ్యమైన అవయవం. మనం తినే ఆహారం ద్వారా లివర్ ఉత్పత్తి చేసే పైత్యరసాన్ని స్టోర్ చేస్తూ చిన్న పేగుకు సరఫరా చేస్తుంది. ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే వాటిని చిన్న చిన్న పరిమాణంలో ఉండేలా విడదీస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా మన ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వును గాల్‌బ్లాడర్ తనలో స్టోర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు అవి అలాగే పేరుకుపోయి రాళ్లలో ఏర్పడి పిత్తాశయం నిర్వహించే విధులకు ఆటంకంగా మారవచ్చు. మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్‌తో పాటు మనలోని జీన్స్, ఊబకాయం, మనం వాడే పెయిన్‌కిల్లర్స్ లేదా మహిళలు పెగ్నెన్సీ రాకుండా వాడే పిల్స్ వల్ల కూడా ఈ సమస్యకు కొన్ని ప్రధాన కారణాలు. డయాబెటిస్, ఊబకాయం, జీర్ణ సమస్యతో బాధపడేవాళ్లు ఎక్కువగా ఈ గాల్‌బ్లాడర్ స్టోన్స్ సమస్యకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కిడ్నీలో మాదిరిగా ఇవి రాళ్లు కావు. మన ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన చిన్న చిన్న ఘనపదార్థాలు ఒక ఉండలాగా ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి మన పిత్తవాహికకు అడ్డు తగిలి నొప్పిని కలిగిస్తాయి. ఆ నొప్పి కలిగే వరకూ అవి మన శరీరంలో ఏర్పడిన విషయం కూడా మనకు తెలియదు. ఇక మీ విషయానికి వస్తే... ఇవి మందులతో తగ్గవు. తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అశ్రద్ధ చేస్తే గాల్‌బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం, కామెర్లు (జాండిస్) రావడం, పాంక్రియాస్ వాపునకు గురికావడం లేదా కడుపులో తీవ్రమైన నొప్పి రావచ్చు. కాబట్టి పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడ్డాయో తెలుసుకొని అందుకు తగ్గ చికిత్స చేస్తే మీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ యు.దత్తారామ్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
బ్యూటిప్స్
నీళ్లు తాగితేనే నిగారింపు... వర్షాకాలంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. రకరకాల చర్మసమస్యలు వస్తుంటాయి. ఉదరకోశ సమస్యలు, టైఫాయిడ్ వంటి రోగాలు, జలుబు, దగ్గు, ఆస్తమా వంటివి చర్మంపై ప్రభావం చూపుతాయి. మొటిమలు పెరుగుతాయి. ఈ కాలం ఆరోగ్యాన్నీ, తద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కష్టమే అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ పరిస్థితిని అదుపులో ఉంచవచ్చు. పొడి చర్మం వర్షాకాలంలో చల్లదనానికి పదే పదే మూత్రవిసర్జన సమస్యలుంటాయని చాలామంది నీళ్లను తాగడం తగ్గించేస్తారు.. కానీ, రోజులో కనీసం 10-12 గ్లాసుల నీళ్లు తాగితేనే శరీరంలో చేరిన విషపదార్థాలు విడుదలైపోతాయి, చర్మం నిగారిస్తుంది. ఆల్కహాల్ బేస్డ్ లోషన్లు, టోనర్స్ వాడకం తగ్గించడం మేలు. ఆల్కహాల్ వల్ల ఆ లోషన్లు సువాసనగా ఉంటాయి. కానీ, చర్మాన్ని త్వరగా పొడిబారేలా చేస్తాయి. జిడ్డు చర్మం: జిడ్డు పోవడానికి రోజుకు 3-4 సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే కాళ్లు, చేతులు కూడా! ముృతకణాలను తొలగించడానికి నేచురల్ ఫేసియల్ స్ట్క్రబ్స్ను వాడచ్చు. శనగపిండి, పాలు, తేనె వంటివి స్నానం చేయడానికి ఉపయోగించడం వల్ల చర్మం మెరుపు పెరుగుతుంది. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి పదే పదే సబ్బుల వాడకం కన్నా చల్లని నీళ్లకు బదులు గోరువెచ్చని నీళ్లను ఉపయోగిచడం వల్ల చర్మం నునుపు తగ్గదు. -
మేకకి జలుబు చేస్తుందా?!
జంతు ప్రపంచం * మేకపిల్లలకి గారమెక్కువ. తల్లి కాసేపు కనిపించకపోయినా కంగారు పడిపోతుంటాయి! * మేకలు పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి. పుట్టినప్పట్నుంచీ తమ కూతను వాటికి అలవాటు చేస్తాయి. ఎక్కడ ఉన్నా తల్లి కూతపెట్టగానే పిల్లలు వచ్చేస్తాయి. * మేక పిల్లల్ని కిడ్స్ అంటారు. * వీటికి ఐక్యత చాలా ఎక్కువ. చుట్టూ ఉండే వాటితో స్నేహంగా మెలగుతాయి. దేనికి కష్టం వచ్చినా అన్నీ చుట్టూ చేరతాయి! * చెట్లెక్కి దూకడమంటే సరదా. * వీటికి కింది వరుసలో కొన్ని పళ్లు, దంతాలు మాత్రమే ఉంటాయి. కాకపోతే దవడలు చాలా బలంగా ఉండటం వల్ల ఆహారం నమలడంలో ఇబ్బంది ఉండదు! * కొన్ని రకాల మేకలు అసలు నిద్రే పోవని పరిశోధనల్లో తేలింది! * మనుషుల్లాగే మేకలకు కూడా జలుబు చేస్తుంది. * మేకలు తమ శరీర బరువు కంటే ముప్ఫై శాతం ఎక్కువ బరువును మోసేంత బలంగా ఉంటాయి! * వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. ముఖ్యం గా ఆహారం విషయంలో. ఏదైనా కొత్త పదార్థం కనిపిస్తే నోటిలో పెట్టుకుని చప్పరిస్తాయి. తినొచ్చు అని నిర్ణయించుకున్న తర్వాతే ఆరగిస్తాయి! * మేకల్లో కొన్ని జాతుల వాటికి అకస్మాత్తుగా నాడీవ్యవస్థ దెబ్బ తింటుంది. కండరాలు, నరాలు పని చేయడం మానేస్తాయి. దాంతో ఇవి సొమ్మసిల్లి పడిపోతాయి. మళ్లీ మామూలవుతాయి.