
నేడే హెల్త్ ఫెస్టివల్ ప్రారంభం!
పండగలు అందరూ చేసుకుంటారు. వేడుకలు అందరూ నిర్వహించుకుంటారు. సాధారణంగా పండగ రోజున ఎవరి ఇంట్లో వారికే పండగ. కానీ ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించే ఈపండగ ఇతరులకు కోసం. అందరి ఆరోగ్యం కోసం. ఆ ఆరోగ్యంపై అవగాహన కోసం. వ్యాధిబాధితులూ, రోగవేదనలూ ఎంత బాధాకరమో తెలుసు కాబట్టి; వాటి వల్ల పడే ఆర్థిక, పనినష్టభారాలు విదితం కాబట్టి అందరికీ ఆరోగ్యం పంచడానికి నడుం బిగించింది సాక్షి. అందరికీ ఆరోగ్య అంశాలపై అవగాహన కలిగించేందుకు ‘సాక్షి లివ్ వెల్ ఎక్స్‌పో’ పేరిట రెండు రోజుల వేడుకల్లో భాగంగా అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం నేడు (శనివారం) ప్రారంభం కానుంది.
ప్రపంచాన్ని ఇప్పుడు జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు శాసిస్తున్నాయి. వాటి నివారణ కూడా జీవనశైలిని మార్పుచేసుకోవడం అనే ప్రక్రియ ద్వారా మన చేతుల్లోనే ఉంది. శని, ఆదివారాల్లో జరిగే ‘సాక్షి లివ్ వెల్ ఎక్స్‌పో’ లో మంచి ఆరోగ్యకరమైన జీవనం కోసం అవలంబించాల్సిన విధానాలు, పోషకాలతో కూడిన ఆహారాలు, వాటివల్ల ఒనగూడే ప్రయోజనాలు, ఒత్తిడిని తొలగించుకునే మార్గాలు, సరదగా శ్రమ తెలియకుండా తేలికగా చేయగల వ్యాయామాలు, యోగభోగాలను సాధించేందుకు దారులు, మనల్ని మనం ఉత్తేజితం చేసుకుంటూ స్వయం ప్రేరణ పొందేందుకు ఉన్న మార్గాల వంటి అనేక అంశాలపై ఆయా రంగాలకు చెందిన అత్యున్నత స్థాయి నిపుణులు మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభిస్తారు.
ఆదివారం నాడు ఉచిత బస్సు సేవలు...
ఎక్స్‌పో ప్రాంగణానికి ఉచిత బస్సు సర్వీసులు: లివ్ వెల్ ఎక్స్‌పో కార్యక్రమం శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నప్పటికీ ఆదివారం రోజున సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న నిర్వాహకులు ఆ రోజున మాత్రం ప్రజలను లివ్ వెల్ ఎక్స్‌పో నిర్వహిస్తున్న హైటెక్స్ ప్రాంగణానికి తరలించేందుకు ఉచిత బస్ సేవలను అందించే ఏర్పాటు చేశారు. ఇందులో నాగోల్ నుంచి బయల్దేరే బస్సులు ఉదయం 7 గంటలు, 11 గంటలు, మధ్యానం 3 గంటలకు బయల్దేరుతాయి. ఆయా వేళల్లో నాగోలు నుంచి బయల్దేరే ఈ బస్సులు నాగోల్‌లోని బిగ్ బజార్, ఎల్‌బీ నగర్‌లో ఆంజనేయస్వామి గుడి, కొత్తపేటలోని చెన్నై షాపింగ్ మాల్ ఎదుట, దిల్‌సుఖ్‌నగర్‌లో చందనా బ్రదర్స్, కోటీలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఆబిడ్స్‌లోని జీపీఓ, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్, లక్డీకాపూల్ దగ్గరున్న బస్ స్టాప్‌ల వద్దనుంచి, మాసాబ్‌ట్యాంక్‌లో పాలిటెక్నిక్ దగ్గర, బంజారాహిల్స్‌లోని రోడ్ నెం. 12 దగ్గరున్న పెన్షన్ ఆఫీసు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గరున్న పెట్రోల్ బంక్ దగ్గర, మాధాపూర్‌లోని రత్నదీప్ దగ్గర ఆగుతూ ఎక్స్‌పో సందర్శకులను ఎక్కించుకుంటూ హైటెక్స్ ప్రాంగణానికి చేరుతాయి. ఇవే మూడు బస్సులు మళ్లీ హైటెక్స్ నుంచి ఉదయం 9 గంటలు, మధ్యానం ఒంటిగంట, సాయంత్రం 6 గంటలకు తిరిగి హైటెక్స్‌నుంచి అదే రూట్లలో తిరుగుప్రయాణం సాగిస్తూ సందర్శకులను ఆయా ప్రాంతాలకు చేరవేస్తాయి.
కూకట్‌పల్లి నుంచి హైటెక్స్‌కు మరో ఐదు బస్సులు
ఇక కూకట్‌పల్లి ప్రాంతం నుంచి హైటెక్స్ ప్రాంగణానికి వచ్చేందుకు తయారైన సందర్శకుల కోసం మరో ఐదు బస్సులు అందుబాటులో ఉంటాయి. అవి... ఉదయం 8 గంటలు, 10గంటలు, మధ్యానం 12 గంటలు, 2 గంటలు, సాయంత్రం, 4 గంటలకు కూకట్‌పల్లి నుంచి బయల్దేరతాయి. కూకట్‌పల్లిలో చైతన్య కాలేజీ వద్ద నుంచి బయల్దేరే బస్సులు కేపీహెచ్‌బీలో ఆర్.ఎస్. బ్రదర్స్ షాపింగ్ మాల్ వద్ద, హైదర్‌నగర్‌లో భ్రమరాంబ థియేటర్ ఎదురుగా, మియాపూర్‌లో సితారా రెస్టారెంట్ దగ్గర, హఫీజ్‌పేటలో ఆల్విన్ క్రాస్‌రోడ్స్ వద్ద, కొండాపూర్‌లో కమాన్ వద్ద, కొత్తగూడ క్రాస్‌రోడ్స్‌లో జయభేరీ టవర్స్ వద్ద ఆగి సందర్శకులకు ఎక్కించుకుంటాయి. అలాగే హైటెక్స్ నుంచి మళ్లీ కూకట్‌పల్లికి అదే దారిలో ఉదయం 9గంటలు, 11 గంటలు, మధ్యానం ఒంటిగంట, 3 గంటలు, సాయంత్రం 6 గంటలకు తిరిగివస్తాయి.
మంచి ఆహారంతోనే మంచి ఆరోగ్యం...
అన్ని పోషకాలు ఉన్న సమతుల ఆహారంతో మంచి ఆరోగ్యం సమకూరుతుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి పేర్కొన్నారు. సాక్షి లివ్ వెల్ ఎక్స్‌పోలో ఆరోగ్యకరమైన ఆహారం, పొట్టుతో కూడిన ఆహారంతో సమకూరే ఆరోగ్యం వంటి అనేక అంశాల గురించి ఆమె సందర్శకులకు అవగాహన కల్పించనున్నారు. ‘‘మొదట అందరికీ మంచి ఆహారంతో ఆరోగ్యాన్ని సమకూర్చడం అనే ఆలోచన నేను విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చింది. తొలుత అది మా కుటుంబానికే పరిమితమైంది. కానీ ఆ ఆలోచన ఫలాలను నా మాతృదేశానికి అందించగలిగితే, అందునా అవసరమైన ఎంతో మంది రోగులకు దాని ద్వారా సాంత్వన చేకూర్చగలిగితే, ఎన్నో జీవితాలను పూర్తిగా మార్చగలిగితే! అన్న మరో యోచనతో నేను మంచి ఆహారాన్ని అవసరమున్నవారికి పరిచయం చేయడం అన్నది ఒక ఉద్యమంగా మారింది. అలా అది వంటగది నుంచి సమాజానికి చేరింది. రుచితో పాటు పోషకాలు ఉన్న ఆహారం అనేక మందికి అందేలా చేసిందా ఆలోచన’’ అంటారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి. పోషకాహారంపై అనేక అంశాలను ఆమె ఈ ఎక్స్‌పోలో వివరించనున్నారు.
గమనిక
ఈ ఉచిత బస్సులలో సైతం మొదట వచ్చిన వారిని మొదట బస్సులోకి అనుమతించడం అనే ప్రాతిపదికపైనే సందర్శకులను అనుమతిస్తారు .3 బస్సు సేవలు ఆదివారం రోజు మాత్రమే.
శ్రీదేవి జాస్తి