కునుకు మీరితే కులాసాకు చేటు
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదని మనసుకవి సెలవిచ్చాడు గానీ, కునుకు మీరితే కులాసాకు చేటని అంతర్జాతీయ వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం వేళ తీసే కునుకు 40 నిమిషాలకు మించకుండా చూసుకోవాలని, లేకుంటే అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు తదితర రుగ్మతలన్నీ దాడిచేయడం ఖాయమని చెబుతున్నారు. అంతేకాదు, మధ్యాహ్నం వేళ ఏకధాటిగా 90 నిమిషాలు మొద్దునిద్ర పోయే అలవాటు ఉంటే, శరీరంలోని జీవక్రియల్లో తేడాలొచ్చి మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీసే ముప్పు దాదాపు 50 శాతం మేరకు పెరుగుతుందని కూడా అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.