ఆ సమయంలో ఇవి చేయకూడదా? | Health Trips By Dr Venati Shobha | Sakshi
Sakshi News home page

ఆ సమయంలో ఇవి చేయకూడదా?

Published Sun, Sep 15 2019 2:51 AM | Last Updated on Sun, Sep 15 2019 4:35 AM

Health Trips By Dr Venati Shobha - Sakshi

నెలసరి సమయంలో స్నానం చేయకూడదని, వ్యాయమాలు చేయకూడదంటారు. ఇది ఎంత వరకు నిజం? నెలసరి సమయానికి సంబంధించి ‘పీహెచ్‌ బ్యాలెన్స్‌’ అంటే ఏమిటి? – పి.నిహారిక, రాజమండ్రి

నెలసరి సమయంలో అయ్యే బ్లీడింగ్‌ను సరిగా శుభ్రపరచుకోకుండా వదిలేస్తే, జననేంద్రియాల దగ్గర అంటుకునే రక్తంలో రకరకాల బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే చెడు వాసనలు రావడం, ఇన్ఫెక్షన్స్, దురద వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో తప్పనిసరిగా స్నానం చెయ్యాలి. వీలైతే రోజుకు రెండుసార్లు చేసినా మంచిదే. న్యాప్‌కిన్స్‌ కూడా పూర్తిగా తడిసినా, తడవకపోయినా ఆరు గంటలకు ఒకసారి మార్చుకోవడం మంచిది. న్యాప్‌కిన్స్‌లోని కాటన్‌ రక్తాన్ని పీల్చుకుని ఎక్కువసేపు అలాగే ఉంటే బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో అసౌకర్యం ఏమీ లేకపోతే వ్యాయామాలు రోజూలాగే చేసుకోవచ్చు. ఇంకా ఈ సమయంలో వ్యాయామాలు చేయడం వల్ల విడుదలయ్యే హార్మోన్ల వల్ల పీరియడ్స్‌ సమయంలో వచ్చే కడుపునొప్పి, నడుంనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా యోనిభాగంలో వజైనల్‌ పీహెచ్‌ ఆమ్లగుణం కలిగి ఉంటుంది. అంటే ఎసిడిక్‌ పీహెచ్‌ 3.5–4.5 వరకు ఉంటుంది. ఆమ్లగుణం కలిగి ఉన్న యోనిస్రావాలలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆమ్లగుణం చెడు బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది. పీరియడ్స్‌ సమయంలో రక్తంలో పీహెచ్‌ 7.4 ఉంటుంది. దీనివల్ల ఈ సమయంలో యోనిలో పీహెచ్‌ పెరుగుతుంది. దీనివల్ల ఈ సమయంలో కొందరిలో యోనిలో చెడు బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. న్యాప్‌కిన్స్‌ తడిసిపోయినా ఎక్కువసేపు మార్చకుండా ఉన్నప్పుడు ఈ బేసిక్‌ పీహెచ్‌ (క్షారగుణం) వల్ల చెడు బ్యాక్టీరియా పెరిగి యోని ఇన్ఫెక్షన్లు వచ్చి, చెడు వాసన, దురద ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో జననేంద్రియాలను మామూలు నీటితో శుభ్రపరచుకోవాలి. ఎక్కువగా సోపులు, యాంటీ సెప్టిక్‌ లోషన్లు వాడకూడదు. ల్యాక్టిక్‌యాసిడ్‌ బేసిలస్‌ కలిగిన ఇంటిమేట్‌ వాష్‌లను వాడుకోవచ్చు.

నా ఫ్రెండ్‌ ఒకరికి ఎండోమెట్రియోసి ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీని గురించి వినడం ఇదే మొదటిసారి. ‘ఎండోమెట్రియోసి’ వల్ల రకరకాల క్యాన్సర్‌లు రావచ్చు అనే మాట కూడా విన్నాను. ఇది ఎంత వరకు నిజం? ‘ఎండోమెట్రియోసి’ అంటే ఏమిటి?  – ఎస్‌.వి, ఖమ్మం
ప్రతి నెలా పీరియడ్స్‌ సమయంలో గర్భాశయంలోని ఎండోమెట్రియమ్‌ పొర బ్లీడింగ్‌ రూపంలో చిన్న చిన్న ముక్కలుగా బయటకు వచ్చేస్తుంది. కొందరిలో ఈ పొర గర్భాశయం నుంచి ఫెలోపియన్‌ ట్యూబ్‌ల ద్వారా పొత్తికడుపులోకి చేరుతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కొందరిలో కరిగిపోతుంది. కొందరిలో ఈ పొర చిన్న చిన్న ముక్కలుగా గర్భాశయం పైన, వెనుక భాగంపైన, అండాశ యాల పైన, పేగుల పైన, మూత్రాశయం పైన... ఇలా అనేక ప్రదేశాలలో అతుక్కుని, ప్రతి నెలా పీరియడ్స్‌ సమయంలో ఇక్కడ కూడా బ్లీడింగ్‌ అవుతుంది. దీనినే ఎండోమెట్రియోసిస్‌ అంటారు. ఇలా ప్రతి నెలా అయిన బ్లీడింగ్, గడ్డకట్టి పైన చెప్పిన ప్రదేశాలలో పేరుకుంటూ ఉంటుంది. దీని వల్ల గర్భాశయం, అండాశయాలు, పేగులు మెల్లమెల్లగా దగ్గరికి వచ్చి అంటుకుపోతాయి. ఎండోమెట్రియోసిస్‌ వల్ల పీరియడ్‌ సమయంలో పొత్తికడుపులో నొప్పి, నడుంనొప్పి, కలయికలో నొప్పి, గర్భం దాల్చడానికి ఇబ్బంది వంటి అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ఎండోమెట్రియోసిస్‌ అండాశయాలలో ఏర్పడి, రక్తం గడ్డకట్టడం వల్ల తయారయ్యే గడ్డలను చాక్లెట్‌ సిస్ట్‌ అంటారు. ఎండోమెట్రియోసిస్‌ వల్ల క్యాన్సర్‌ రావడం చాలా అరుదు.

నేను కొంత కాలంగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. బుగ్గలు, నుదరుపై మచ్చలు వస్తున్నాయి. ఇలా రావడం సహజమేనా? లేక సైడ్‌ ఎఫెక్ట్‌ వల్ల ఇలా వస్తాయా? మచ్చలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గర్భనిరోధక మాత్రలు ఎక్కువ కాలం తీసుకోవడం ప్రమాదమా?  – కౌసల్య, నిడదవోలు

కొంతమందిలో హార్మోన్లలో సమస్యల వల్ల, ఎండకు ఎక్కువగా తిరగడం వల్ల, నుదురుపైన, బుగ్గల పైన మచ్చలు ఏర్పడుతుంటాయి. దీనినే మెలాస్మా అంటారు. కొంతమందిలో గర్భంతో ఉన్నప్పుడు వస్తాయి. కొంతమందిలో గర్భ నిరోధక మాత్రలు దీర్ఘకాలం వాడటం వల్ల కూడా మచ్చలు రావచ్చు. అందరికీ వీటివల్ల మచ్చలు రావాలని ఏమీలేదు. మచ్చలు ఏర్పడేటప్పుడు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ క్రీములు వాడుకోవాలి. ఒకసారి చర్మవ్యాధుల డాక్టర్‌ను సంప్రదించి దానికి తగ్గ చికిత్స తీసుకోవాలి. గర్భ నిరోధక మాత్రలలో, తక్కువ హార్మోన్‌ మోతాదు ఉన్న వాటిని వాడి చూడవచ్చు. వాటితో కూడా మచ్చలు ఎక్కువ అవుతుంటే, మాత్రలు వాడటం మానేసి, వేరే కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించవచ్చు. గర్భ నిరోధక మాత్రలు ఒక్కొక్క శరీరతత్వాన్ని బట్టి, బరువుని బట్టి, వారి మెడికల్, ఫ్యామిలీ హిస్టరీని బట్టి, కొంతమందికి బాగానే సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా పనిచేస్తాయి. కొంతమందిలో మటుకే ఇబ్బందులు ఏర్పడవచ్చు. సమస్యలు లేనప్పుడు దీర్ఘకాలం కాకుండా, 2–3 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా వాడవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement