మహిళల్లో గుండెజబ్బులు... | Heart disease in women ... | Sakshi
Sakshi News home page

మహిళల్లో గుండెజబ్బులు...

Published Sun, Sep 29 2013 12:08 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

మహిళల్లో గుండెజబ్బులు...

మహిళల్లో గుండెజబ్బులు...

మహిళల్లో గుండెజబ్బులు, గుండెపోటు లక్షణాలు కాస్తంత వేరుగా ఉంటాయి. ఒకింత ప్రత్యేకం కూడా. మహిళలు, పిల్లల్లో  గుండెజబ్బుల నివారణ ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే థీమ్. అందుకే మహిళల విషయంలో గుండెజబ్బులు కనిపించే తీరుతెన్నులను తెలుసుకుంటే, నివారణ కూడా సులభం. ఇక గుండెజబ్బుల పట్ల అప్రమత్తతగా ఉండి, తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉంటే వీటిలో 80 శాతాన్ని సమర్థంగా నివారించవచ్చు. కావాల్సిందల్లా కాస్త అవగాహన. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం.
 
 గుండెజబ్బులు అనగానే చాలామంది అది పురుషుల్లోనే ఎక్కువగా వచ్చే జబ్బుగా అభిప్రాయ పడుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. గుండెజబ్బులు మహిళల్లో కూడా  సాధారణంగానే కనిపిస్తుంటాయి. మహిళల్లో మరణానికి దారితీసే కారణాల్లో గుండె, రక్తనాళాల సమస్యలు (కార్డియో వాస్క్యులార్ డిసీజెస్) ప్రధానమైనవి. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో మూడోవంతు మరణాలు కార్డియో వాస్క్యులార్ డిసీజెస్ వల్లనే జరుగుతున్నాయి. మహిళల్లో కనిపించే గుండెజబ్బులకు ప్రధాన కారణం గుండెకు రక్తాన్ని చేరవేసే ప్రధాన రక్తనాళాలైన కరొనరీ ఆర్టరీస్‌లో అడ్డంకులు ఏర్పడటం. దీన్నే వైద్య పరిభాషలో కరొనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు.
 
 మహిళల్లో గుండెపోటు లక్షణాలు


 గుండెజబ్బుల విషయంలో మనకు తెలిసిన ఏకైక లక్షణం ఛాతీలో నొప్పి మాత్రమే. నిజానికి గుండెపోటు వచ్చినప్పుడు గుండెపై ఒత్తినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చి అది మెడ లేదా భుజం లేదా మెడవైపునకు పాకుతున్నట్లుగా వెళ్తుంది. అదే సమయంలో చెమటలు పడతాయి. దాంతోపాటు ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. ఈ లక్షణాలన్నీ పురుషుల్లో చాలా సాధారణం. మహిళల్లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే 50 శాతం మంది మహిళల్లో మాత్రం ఇవి పురుషులతో పోలిస్తే కాస్త వేరుగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే... బాగా అలసటగా/నీరసంగా ఉన్నట్లుగా ఉండటం(ఫెటీగ్), తిన్న ఆహారం జీర్ణం కానట్లుగా ఉండటం, పొట్ట పైభాగంలో ఇబ్బంది, దవడలో నొప్పి, గొంతులో నొప్పి, భుజంలో నొప్పి వంటి సాధారణ లక్షణాలకు భిన్నమైనవి కనిపించవచ్చు. దాంతో చాలామంది మహిళలు వాటిని గుండెజబ్బు లక్షణాలుగా పరిగణించరు. మహిళల్లో కనిపించే పై లక్షణాలను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు.
 
 మహిళల్లో గుండెజబ్బులకు రిస్క్ ఫ్యాక్టర్స్


 మహిళలో గుండెజబ్బులు క్రమేణా అభివృద్ధి చెందుతూ ఉండటానికి కొన్ని అంశాలు దోహదపడుతుంటాయి. వాటినే రిస్క్‌ఫ్యాక్టర్స్‌గా చెప్పవచ్చు. అవి...  
 వయసు  
 కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండెజబ్బులున్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ)
 రక్తపోటు మధుమేహం
 రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం  
 పొగతాగే అలవాటు స్థూలకాయం  
 శారీరక శ్రమ/వ్యాయామం లేకపోవడం  
 ఒత్తిడి
 
 మహిళల్లో గుండెజబ్బులకు సహజ రక్షణ... రుతుక్రమం  


 పురుషులతో పోలిస్తే మహిళలకు గుండెజబ్బులు రావడం పదేళ్లు ఆలస్యంగా జరుగుతుంది. ఈ సహజ రక్షణకు కారణం... వాళ్ల రుతుక్రమమే. ప్రతినెలా రుతుక్రమం సమయంలో విడుదల అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా వారి గుండెకూ, రక్తనాళాలకూ రక్షణ ఉంటుంది. కాబట్టి రుతుక్రమం ఆగిన వారితో పోలిస్తే... రుతుక్రమం అయ్యే మహిళలకు (మెనోపాజ్ దశకు చేరని వారిలో) గుండెజబ్బులు వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు తక్కువ. అయితే ఈ సహజ రక్షణ కవచం డయాబెటిక్ లేదా పొగతాగే మహిళల్లో కనిపించదు.
 
 హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీతో ఆ సహజ రక్షణ కరవే...


 కొందరు మహిళల్లో రుతుక్రమం ఆగాక కనిపించే లక్షణాలను తగ్గించడానికి బయట నుంచి ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఇస్తుంటారు. దీన్నే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీగా పేర్కొంటారు. అయితే ఇలా బయటి నుంచి ఇచ్చే ఈస్ట్రోజెన్‌తో అంతకుముందు దొరికే సహజ రక్షణ దొరకకపోవడం గమనించాల్సిన అంశం.  
 
 గుండెపోటు-మహిళలు, పురుషుల్లో తేడాలు...
 
 గుండెపోటు తీవ్రత పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ. దీనికి చాలా అంశాలు కారణం. ముందుగా చెప్పుకున్నట్లుగా మహిళల్లో గుండెజబ్బుల లక్షణాలు భిన్నంగా ఉండటంతో వాటిని గుర్తించడం ఆలస్యం కావడం, దానికి అనుగుణంగా చికిత్స అందడంలోనూ జాప్యం జరగడం చాలా సాధారణం. దీంతో మహిళల్లో గుండె మరింత దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పైగా మన దేశంలోని వివక్ష కారణంగా పురుషులతో పోలిస్తే మహిళల విషయంలో తరచూ చేయించుకునే ఆరోగ్య పరీక్షలు కూడా తక్కువే. ఇక శరీర నిర్మాణపరమైన అంశానికి వస్తే... పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తనాళాలు సన్నగా ఉంటాయి, ఫలితంగా పురుషులతో పోలిస్తే మహిళ చికిత్స కాస్తంత సంక్లిష్టం అనుకోవచ్చు. కాబట్టి మహిళల్లో గుండెజబ్బులను నివారించడానికి మరింత శ్రద్ధ వహించాలి.
 
 నివారణ:  
 మహిళల్లో వ్యాయామం చేయడం అన్న అంశం మనదేశంలో చాలా చాలా తక్కువ. రోజూ కనీసం 30 నిమిషాల చొప్పున వారంలో కనీసం 5 రోజుల పాటు నడక, మెల్లగా జాగింగ్ చేయడం వంటి వ్యాయామాలు మహిళల గుండెజబ్బులను సహజంగానే నిరోధిస్తాయి  
 
 ఆహారంలో ఉప్పు తగ్గించడం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులను నివారించవచ్చు. (ఒక నెలకు ఒక మనిషి అరలీటరు నూనె కంటే ఎక్కువగా తీసుకోకుండా ఉండటం అన్నది ఆరోగ్యకరమైన పరిమితి అని గుర్తుంచుకోండి)
 
 రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ పాళ్లు పెరగడం వంటివి ఉంటే వాటికి తగిన చికిత్స చేయించుకుంటూ... అవి ఉన్నవారు గుండెజబ్బులు ఉన్నట్లుగానే పరిగణించి జాగ్రత్తలు తీసుకోవడం అన్నది గుండెజబ్బుల విషయంలో మంచి నివారణ చర్య.
 
 - నిర్వహణ : యాసీన్

 
 డాక్టర్ రమేశ్ గూడపాటి
 చీఫ్ ఆఫ్ కార్డియాలజీ
 స్టార్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement