పరిపరిశోధన
డీజిల్ పొగ అనర్థాలను తెచ్చిపెడుతుందన్న విషయం ఇంతకముందే మనందరికీ తెలుసు. కానీ అది మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెజబ్బులకు కారణమవుతుందన్నది కొత్తగా ఇప్పుడు పరిశోధనల్లో తేలిన అంశం. డీజిల్ పొగలో చాలాసేపు ఉన్నప్పుడు మనకు అందాల్సినంతగా ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) ఉత్పత్తి తగ్గుతుంది. ఈ హెచ్‌డీఎల్ అన్నది రక్తనాళాల ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. శరీరంలో హెచ్‌డీఎల్ ఉత్పత్తి తగ్గడం వల్ల అది రక్తనాళాల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపి, గుండెజబ్బులకు కారణమవుతుందని పేర్కొంటున్నారు సియాటిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు డాక్టర్ గ్రిఫిత్ బెల్.
‘‘ట్రాఫిక్ పొగకూ, గుండెజబ్బులకూ సంబంధం ఉందని ఈ పరిశోధనల వల్ల తేలింది’’ అంటారు డాక్టర్ బెల్. అమెరికాకు చెందిన దాదాపు 6,700 మంది మధ్యవయస్కులపై ఈ పరిశోధనలు నిర్వహించారు. వారిలో హెచ్‌డీఎల్ పాళ్లు తగ్గడం గమనించారు. డాక్టర్ బెల్ పరిశోధన వివరాలు ‘ద జర్నల్ ఆఫ్ అర్టీరియో స్కె›్లరోసిస్, థ్రాంబోసిస్ అండ్ వ్యాస్క్యులార్ బయాలజీ’లో ప్రచురితమయ్యాయి.