
గాటు తక్కువ.. రిలీఫ్ ఎక్కువ!
ఇప్పటికీ సంప్రదాయ గుండె శస్త్రచికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి గుండెజబ్బు వచ్చాక కొన్నిసార్లు భవిష్యత్తులో వచ్చే గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి గుండె ఆపరేషన్ చేయడం మామూలే. దీన్ని ఓపెన్‌హార్ట్ సర్జరీ అని కూడా వ్యవహరిస్తుంటారు.
సంప్రదాయ గుండె శస్త్రచికిత్సలో సరిగ్గా ఛాతీ మధ్య భాగాన ఒక గాటు పెడతారు. ఆ తర్వాత గుండెను చేరేవరకు ఛాతీని తెరుస్తారు. ఇలా సంప్రదాయ శస్త్రచికిత్స చేసే సమయంలో గుండెను చేరడానికి మన ఉరఃపంజరంలోని రెండు వైపులా పక్కటెముకలను కలిపి ఉంచే ప్రధాన ఛాతీ ఎముకను కోయాల్సి ఉంటుంది.
సంప్రదాయ ఆపరేషన్ ఎలా చేస్తారు...?
ఈ స్టెర్నమ్‌ను తెరవడం ఒకింత శ్రమతో కూడుకున్న వ్యవహరమే. ఛాతీపై చర్మాన్ని కట్ చేశాక... స్టెర్నమ్‌ను కూడా కట్ చేసి రెండు వైపులా విస్తరించాలి. ఛాతీ ఎముకకు ఇరువైపులా పంజరంలా పక్కటెముకలు ఉంటాయి. పక్కటెముకలన్నీ కలిసి ఒక పంజరంగా (ఉరఃపంజరంగా) ఏర్పడి మనలోని కీలకమైన అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవాలను భద్రంగా సంరక్షిస్తుంటాయి. ఆ పంజరాన్ని ఛేదించి రెండు వైపులా ఇలా విస్తరించడం ఒకింత కష్టమే. పైగా బలంగా విస్తరించే సమయంలో వెనకవైపు ఉండే వెన్నుపూసలపై కూడా ఒత్తిడి పడుతుంది. కొందరిలో ఈ పక్కటెముకల పంజరాన్ని కనీసం 6-7 సెంటీమీటర్లు వెడల్పు చేయాల్సి ఉంటుంది. అరుదుగా మరికొందరిలో 10 సెంటీమీటర్లు కూడా జరపాల్సి వస్తుంది.
సంప్రదాయ చికిత్సలో ప్రయోజనం: ఛాతీ ఎముకలను విప్పి చేసే సంప్రదాయ చికిత్సలో ప్రయోజనం ఏమిటంటే గుండెను పూర్తిగా, స్పష్టంగా చూడవచ్చు. అది పూర్తిగా కనిపిస్తుంటుంది. అదే తక్కువగా గాటు పెట్టినప్పుడు ఆపరేషన్ ఒకింత సంక్లిష్టమవుతుంది.
మరి తక్కువ గాటు ఆపరేషన్ ఎందుకు...? గుండె స్పష్టంగా కనిపించడం మాట ఎలా ఉన్నా... సంప్రదాయ చికిత్సలో అంత పెద్ద పంజరాన్ని పూర్తిగా పక్కలకు నెట్టడం వల్ల ఛాతీ పూర్తిగా కదిలిపోతుంది. అక్కడ ఎదుర్రొమ్ము ఎముక చీల్చిన ప్రదేశంలో నొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. సంప్రదాయ ఆపరేషన్‌లో 20 నుంచి 25 సెంటీమీటర్ల గాటు ఉంటే, తక్కువ గాటు చేసే చికిత్సలో కేవలం 6 సెంటీమీటర్ల మేరకు గాటు పెడితే చాలు. మరోమాటలో చెప్పాలంటే కేవలం మూడు వేళ్లు దూర్చేంత గాటు మాత్రమే ఈ తక్కువ గాటు శస్త్రచికిత్స ( మినిమమ్ ఇన్‌వేసివ్ సర్జరీ)లో సరిపోతుంది.
తక్కువ గాటు సర్జరీ ప్రక్రియలో కుడి పక్కన ఉండే ధమనుల నుంచి గుండె లోపలికి పంపించే ఒక పరికరం (క్యాథెటర్) సహాయంలో గుండెలోని కవాటాలను మార్చడం లేదా రిపేర్ చేయడం వంటి చికిత్స చేయవచ్చు అలాగే ఎడమవైపు ఉండే రక్తనాళాల్లోకి క్యాథెటర్‌ను పంపి బైపాస్ సర్జరీని చేయవచ్చు. వాల్వ్‌ను సరిదిద్దాలంటే కుడివైపున ఉండే రక్తనాళాల్లోకి క్యాథెటర్‌ను పంపుతారు.
తక్కువ గాటు శస్త్రచికిత్సలో...
గుండె స్పందిస్తూ... శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుందన్న విషయం తెలిసిందే. రక్తంతో నిండి ఉన్న గుండె పెద్ద పరిణామంలో ఉంటుంది. అయితే గుండెకు రక్తసరఫరా ఆపేస్తారు. గుండె చేసే పని హార్ట్ లంగ్ మిషన్ అనే యంత్రం చేసేలా జాగ్రత్త తీసుకుంటారు. అప్పుడు గుండెకు రక్తసరఫరా తగ్గడంతో గుండె సైజ్ కుంచించుకుపోతుంది. ఉన్న ఖాళీలో గుండె సైజ్ తగ్గడంతో చిన్న గాటు సహాయంతోనే గుండెకు చేయాల్సిన రిపేర్లు సులువుగా చేయవచ్చు. ఈలోపు గుండె చేయాల్సిన పని హార్ట్ లంగ్ మెషిన్ చేస్తుంది.
తక్కువ గాటు సర్జరీ ప్రయోజనాలు...
సంప్రదాయ చికిత్సలో గాయం 25 సెం.మీ. ఉంటుంది. ఆ గాయం చాలా పెద్దది కావడంతో మానడానికి పట్టే సమయం కూడా ఎక్కువే. అది మానడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. అయితే తక్కువ గాటుతో చేసే ఆపరేషన్‌లో గాటు సైజు కేవలం ఆరు సెంటీమీటర్లు కావడంతో అది మాని, కోలుకునేందుకు పట్టే సమయం కూడా చాలా తక్కువ గాయం తక్కువ కావడంతో రక్తస్రావం అయ్యే అవకాశాలు కూడా తక్కువ గాయం తక్కువ కావడంవల్ల ఇన్ఫెక్షన్‌కు ఆస్కారం కూడా తక్కువే అల్పాదాయ వర్గాల్లో హృద్రోగం వల్ల ఎక్కువ కాలం పనికి వెళ్లకుండా ఉండటం ఆర్థికంగా భారమే. ఇక చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహించే వారు సైతం ఎక్కువ రోజులు తమ బాధ్యతలకు దూరంగా ఉండటం సాధ్యం కాదు. తక్కువ గాటు సర్జరీ వల్ల ప్రయోజనం ఈ రెండు వర్గాలకూ చేకూరుతుంది. .
భవిష్యత్తులో : గుండె సర్జరీల్లో మొదట 25 సెంటీమీటర్ల గాటుతో చేసే శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కేవలం 6 సెంటీమీటర్ల గాటుతో చేయగల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇక భవిష్యత్తులో కేవలం చిన్న రంధ్రం మాత్రమే పెట్టి (కీ-హోల్) చేయగల సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా అటు ఖర్చు, ఇటు కోలుకునే సమయం రెండూ తగ్గే అవకాశాలు ఉన్నాయి.
గుండె సర్జరీ అంటే
గుండెకోత పెట్టాల్సింది. కానీ ఆ గుండెకోత కూడా అవసరం లేకుండానే గుండెకు శస్త్రచికిత్స సాధ్యమైతే...? అవుతుంది. అదే మినిమల్లీ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ. దీని గురించి తెలుసుకుందాం రండి...
గుండె కవాటాలు... వాటి సమస్యలు
గుండెలోని రక్తం ఒకవైపు ప్రవహించడానికి కవాటాలు (వాల్వ్స్) తోడ్పడతాయి. గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి... ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మునరీ వాల్వ్, మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్.
ఈ నాలుగు వాల్వ్స్‌లోనూ ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి...
1. వాల్స్‌సన్నబడటం (స్టెనోసిస్)
2. వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్)
వాల్వ్స్ సమస్యలకు కారణాలు.. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల మరికొందరిలో ఇవి పుట్టుకతోనే రావచ్చు ఇంకొందరిలో వయసు పెరగడం వల్ల రావచ్చు.
వాల్వ్స్ సమస్యలు... లక్షణాలు: హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం పొడిదగ్గు పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం గుండెదడ గుండె దడ (పాల్పిటేషన్స్) నీరసం ఒక్కోసారి గుండెనొప్పి కూడా రావచ్చు.
ప్రత్యేక లక్షణాలు: ఈ సాధారణ లక్షణాలతో కొందరిలో సమస్య వచ్చిన వాల్వ్‌ను బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు... ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ (రీగర్జిటేషన్) సమస్యలో కాళ్లలో వాపు కనిపిస్తుంది మైట్రల్ వాల్వ్ సన్నబడటం (స్టెనోసిస్) అయితే రక్తపు వాంతులు కావచ్చు అయోర్టిక్ వాల్వ్ సన్నబడితే స్పృహ తప్పవచ్చు.
ట్రాన్స్ ఈసోఫేజియల్ కార్డియోగ్రామ్ ఒక వరం...
ఇప్పుడు ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రామ్ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్కచోటే ఉంటే మొత్తం వాల్వ్‌ను మార్చవచ్చు.
వాల్వ్స్ సమస్యలకు చికిత్స ఇలా: వాల్వ్ సమస్యలకు కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితి( కండిషన్)ని బట్టి సర్జరీ అవసరం అవుతుంది. అంటే... మైట్రల్ వాల్వ్ సన్నగా మారితే (స్టెనోసిస్) అలాంటి రోగుల్లో బెలూన్ వాల్విలోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు మిగతా వాల్వ్స్ సన్నగా మారి, లీక్ అవుతున్న సందర్భాల్లో ఈ వాల్విలోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్‌మెంట్ అన్నదే పరిష్కారం. వాల్వ్‌ను రీప్లేస్ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్స్‌ను ఉపయోగించవచ్చు.
1) మెటల్ వాల్వ్ 2) టిష్యూ వాల్వ్
మెకానికల్ వాల్వ్ (మెటల్ వాల్వ్)ను ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూలత (డిజట్వాంటేజ్) ఉంది. ఇలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలచవార్చే మందు అసిట్రోమ్ వాడాలి ఇక టిష్యూ వాల్వ్ అన్నవి ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ వాల్వ్స్‌ను వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది.
వాల్వ్స్‌కు సరికొత్త చికిత్స ప్రక్రియలివే
ప్రస్తుతం వాల్వ్స్‌కు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్‌ను రిపేరు చేయడానికే ప్రాధాన్యం. ఎందుకంటే... వాల్వ్ రీప్లేస్ చేయడం కంటే ఉన్నవాల్వ్ ఎప్పుడూ మెరుగైనది కావడం వల్ల ఇప్పుడు వైద్యనిపుణులు రిపేర్‌కే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఉన్న వాల్వ్‌నే రిపేర్ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్ని పలుచబార్చే మందు)ను వాడాల్సి అవసరం లేదు. కాబట్టే ఇప్పుడు వాల్స్‌ను (ప్రత్యేకంగా మైట్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్స్ అయితే) రిపేర్ చేయడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
మహాధమని (అయోర్టా)తో జాగ్రత్త...!
నా వయసు 42 ఏళ్లు. ఒక ప్రైవేట్ ఆఫీసులో పనిచేస్తున్నాను. గత కొంతకాలం నుంచి నేను ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాను. మొదట్లో నాకు ఛాతీలో నొప్పి వచ్చేది. ఆ నొప్పి వెన్ను మీద నుంచి భుజాల వరకు పాకేది. నాకు సిగరెట్ అలవాటు ఉంది. బీపీ వచ్చిందేమోనని అనుమానంతో డాక్టర్‌ని కలిస్తే అదేమీ లేదంటూ కొన్ని మందులు రాసిచ్చారు. వాడాను. తగ్గకపోగా తరచూ కడుపునొప్పి రావడంతో పాటు నా గొంతు బొంగురుపోవడాన్ని గమనించాను. మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లాను స్కానింగ్ చేసి అయోర్టా సమస్య ఉందని చెప్పారు. అసలు అయోర్టా అంటే అంటే ఏమిటి? ఇది ప్రాణాంతకమైనదా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - సుబ్బారావు, నెల్లూరు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీరు ‘అయోర్టిక్ వాల్‘ (మహాధమని)కి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది మన శరీరంలోని చాలా ముఖ్యమైన రక్తనాళం. గుండె నుంచి ఇతర అవయవాలన్నింటికీ శుద్ధి చేసిన రక్తాన్ని సరఫరా చేసే అతి పెద్ద రక్తనాళం ఇది. ఇది సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. రక్తప్రసరణ వేగానికి తగ్గట్లుగా ఇది సాగడం మళ్లీ ముడుచుకుపోవడం చేస్తుంది. అయితే ఈ మహాధమని (అయోర్టా)లోని ఏదో ఒక భాగం ఉబ్బిపోతే ‘అయోర్టిక్ అన్యురిజమ్’ సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి ఉబ్బిన భాగం పగిలిపోయి తీవ్ర రక్తప్రావం జరిగి మరణానికి దారితీస్తుంది. ఈ సమస్య రక్తపోటు, గుండెజబ్బు, కొవ్వు అధికంగా తీసుకోవడం, వయసు పైబడటం, పొగతాగడం వల్ల వస్తుంది.
అంతేకాకుండా జన్యుపరంగా గానీ రక్తనాళంలో అరుగుదల వల్లగానీ ఈ అయోర్టిక్ వాల్ సమస్య తలెత్తవచ్చు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు చాలా సందర్భాల్లో బయటకు కనిపించవు. అందుకే దీన్ని సెలైంట్ కిల్లర్‌గా వైద్యులు పరిగణిస్తారు. ఈ వ్యాధి రెండు భాగాలుగా సంక్రమించే అవకాశం ఉంది. ఒకటి థొరాసిక్ అన్యురిజమ్, రెండు అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్. మీకు పొగతాగే అలవాటు ఉన్నట్లు చెప్పారు. మీ విషయానికి వస్తే మీరు చెబుతున్న లక్షణాలు ‘ధొరాసిక్ అన్యురిజమ్’తో సరిపోలుతున్నాయి. కాబట్టి మీరు వెంటనే అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి వెళ్లి, అక్కడ నిపుణులైన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌కు చూపించండి. వారు మీకు అల్ట్రాసౌండ్, సీటీస్కాన్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ జరుపుతారు.
రిపోర్టుల్లో మీరు హైరిస్క్ కేటగిరిలో ఉన్నట్లు తేలితే ఏమాత్రం అధైర్యపడకండి. ఈ సమస్యకు అత్యాధునికమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కత్తిగాటు లేకుండా మినిమల్లీ ఇన్వేజిక్ ప్రక్రియ (సర్జరీ) ద్వారా స్టెంట్ అమర్చి దెబ్బతిన్న రక్తనాళం భాగాన్ని మరమ్మతు చేయవచ్చు. ఆలస్యం చేస్తే అయోర్టిక్ అన్యురిజమ్‌లో రక్తపు గడ్డలు పగిలి వాటి అవశేషాలు రక్తప్రసరణలో చేరి మెదడుకు చేరుకొని స్ట్రోక్ (పక్షవాతం)కు దారితీయవచ్చు. అది ప్రాణాపాయం కూడా కావచ్చు. మీరు ఇక ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఒక మంచి కార్డియాలజిస్ట్‌ను కలిసి చికిత్స చేయించుకోండి.