హోమియో కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. నాకు ఈమధ్య పచ్చకామెర్లు అయ్యాయి. వాంతులు, అన్నం తినబుద్ధికాకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి హెపటైటిస్-బి అని నిర్ణయించారు. ఇప్పుడు తగ్గినా మళ్లీ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. హెపటైటిస్-బికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - గోపాల్‌రావు, నల్లగొండ
హెపటైటిస్-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. మొత్తం జనాభాలో 3-5 శాతం మంది దీనితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారిలో కాలేయానికి వాపురావడం, వాంతులు, పచ్చకామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది.
వ్యాధి వ్యాప్తి: ఒకసారి వ్యాధి ఒంట్లోకి ప్రవేశించిందంటే, హెపటైటిస్-బి వైరస్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.రక్తంలోనూ, లాలాజలంలోనూ, వీర్యంలోనూ, మానవుడి శరీర స్రావాల్లో ఈ వైరస్ ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సూదుల ద్వారా, గర్భవతి అయిన తల్లి నుంచి బిడ్డకు వ్యాపించవచ్చు.
తొలి దశ : వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్ది రోజులకు కామెర్లు వస్తాయి. దీన్ని అక్యూట్ దశ అంటారు. ఆమెర్లతో పాటు వికారం, అన్నం తినాలపించకపోవడం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఈ దశలో ఎలీజా అనే పరీక్ష చేయిస్తే పాజిటివ్ వస్తుంది.
రెండోదశ: ఈ దశలో వైరస్ శరీరంలో చాలాకాలం నుంచి ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా పరిగణిస్తారు. అంటే వైరస్ శరీరంలో ఉండిపోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఈ దశలో కామెర్లు తగ్గినా కూడా హెచ్‌బీఎస్‌ఏజీ వైద్య పరీక్ష పాజిటివ్ అనే వస్తుంది. ఇలాంటి వారికి శరీరంలో వైరస్ ఉన్నా ఏ బాధలూ ఉండవు. వీరిలో వైరస్ ఉన్నట్లే తెలియదు. అది వారికి ఇతరత్రా ఏవైనా వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు, మహిళలకు గర్భధారణ సమయంలో మిగతా పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు, రక్తదానం సమయంలో... వైరస్ ఉన్నట్లు బయటపడుతుంది. తమకు ఏ సమస్య లేకపోయినా... వారి నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.
తొలిదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ దశలో పదే పదే కామెర్లు వచ్చిపోతుంటాయి. వీరిలో 99.5 శాతం మందికి ప్రాణభయం ఉండదు. కానీ వైరస్ శరీరంలో ఉండిపోయి బాధిస్తుంది. కాబట్టి మీరు మంచి (పౌష్టిక) ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. అంతేకాకుండా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. ప్రతి ఆర్నెల్లకొకసారి పరీక్ష చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వైరస్ శరీరం నుంచి పూర్తిగా పోవడానికి చాలా సమయం పడుతుంది.
రెండో దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వీరి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ ఏ బాధలు / సమస్యలు ఉండవు. అయినప్పటికీ వీరి శరీరం నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ప్రతి ఆరెల్లకొకసారి పరీక్ష చేయించుకుంటూ, తగిన చికిత్స తీసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. పొగ/మద్యం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. వీళ్లకు ఎప్పుడో ఒకసారి భవిష్యత్తులో లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో సమస్యలేమీ లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా లక్షణాలు మొదలు కావచ్చు. హెపటైటిస్-బి వ్యాధి ఒక్కోసారి భవిష్యత్తులో క్యాన్సర్‌కి కారణం కూడా కావచ్చు. లివర్ ఫైబ్రోసిస్ మొదలై మెల్లగా లివర్ సిర్రోసిస్‌కు దారితీసే అవకాశం ఉంది.
చికిత్స : హోమియోలో ఎలాంటి సమస్యకైనా కాన్‌స్టిట్యూషన్ పద్ధతి ద్వారా చికిత్స చేయవచ్చు. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని క్రమేపీ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తారు. ఇలా క్రమక్రమంగా వ్యాధిని పూర్తిగా తగ్గిస్తారు.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్