
దొంగాపోలీసాట
హాలీవుడ్ సినిమా / క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్
ఫ్రాంక్ అబాంగేల్ పరిస్థితులు తయారు చేసిన నేరస్థుడు. అతనికి విమానం నడపటం రాదు. అయినా ఇంటర్నేషనల్ పైలట్‌గా చాలా సౌకర్యాలు అనుభవించాడు. ఇంజక్షన్ చేయడం కూడా రాదు. అయినా డాక్టర్‌గా చలామణీ అయ్యాడు. నేరస్తుడిగా బోన్‌లో ఉండాల్సినవాడు లాయర్ అని చెప్పుకున్నాడు. కొన్ని వేల మిలియన్ల డాలర్ల చెక్కులు ఫోర్జరీ చేశాడు. ఇంతా చేసి, ఇన్ని తెలివైన మోసాలు చేసిన ఫ్రాంక్ ముదురు వయసువాడు కాదు. జస్ట్ 19 ఏళ్ల టీనేజర్. తన పదహారవ ఏట తల్లిదండ్రులు విడిపోయినప్పుడు ఫ్రాంక్‌కి దిక్కుతోచలేదు.
నష్టాల్లో పడ్డ తండ్రి, మరో ప్రేమ వ్యవహారంలో ఉన్న తల్లిని కలపాలంటే డబ్బులు కావాలన్పించింది. బాగా డబ్బు ఉంటే వాళ్లిద్దరూ కలుస్తారని ఆశపడ్డాడు. ఇక అతను చేసిన మోసాలకు అంతే లేదు. ఆ మోసాల గురించి చెప్పాలంటే ఓ పుస్తకం అవుతుంది. అందుకేనేమో 1980లో ఓ రచయితతో కలిసి ‘క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్’ అని తన ఆత్మకథ రాసుకున్నాడు. 1997లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ డ్రీమ్‌వర్క్ సంస్థ ఈ స్క్రిప్ట్‌ని కొనుగోలు చేసింది. స్పీల్‌బర్గ్‌ని ఈ సినిమా డెరైక్ట్ చేశారు.
హీరో ఫ్రాంక్ తల్లిదండ్రులు ఎలా విడిపోయారో, అలాగే ఈ సినిమాలోని ఎఫ్‌బీఐ ఆఫీసర్ కార్ల్ హేన్రెట్ (టామ్‌హాంక్స్) కూడా భార్య నుంచి విడాకులు తీసుకుంటాడు. స్పీల్‌బర్గ్ తల్లిదండ్రులు కూడా అతని టీనేజ్‌లోనే విడాకులు తీసుకున్నారు. ‘‘ఇలాంటి విచ్ఛిన్న కుటుంబాల వల్ల కలిగే పరిణామాలు కాస్త సున్నితంగా, వినోదభరితంగా చెప్పాలనుకున్నా’’ అని ఈ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొన్నాడు స్పీల్‌బర్గ్. ఇది 1963 నేపథ్యంలో జరిగే కథ.
పదహారేళ్ల ఫ్రాంక్ అబాంగేల్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న తండ్రి, తన భర్త స్నేహితుడితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న తల్లి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఫ్రాంక్ రోడ్డుమీద పడ్డాడు. డబ్బుల్లేని పరిస్థితుల్లో మోసాలకు శ్రీకారం చుట్టాడు. పాన్ అమెరికన్ ఫ్లైట్ సర్వీసెస్ జీతాల చెక్కులు ఫోర్జరీ చేసి, మూడు మిలియన్ల డాలర్లు కొట్టేశాడు. ఫ్రాంక్‌ని పట్టుకోవడానికి ఓ ఎఫ్‌బీఐ ఆఫీసర్ కార్ల్ హేన్రెట్ రంగంలోకి దూకితే, అతణ్ని కూడా తను సీక్రెట్ ఏజెంట్ అని చెప్పి బురిడీ కొట్టించాడు. కార్ల్ మోసపోయానని గ్రహించి, ఫ్రాంక్‌ని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు. ఫ్రాంక్ చెప్పిన మారు పేరు ‘బారీ అలెన్’ని బట్టి అతనో టీనేజర్ అని గ్రహిస్తాడు.
ఫ్రాంక్ లాయర్‌గా, డాక్టర్‌గా మరికొన్ని మోసాలు చేస్తాడు. బ్రెండా అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఎంగేజ్‌మెంట్ జరగబోతుండగా కార్ల్ అక్కడికొస్తాడు. ఫ్రాంక్ పారిపోవలసి వస్తుంది. రెండు రోజుల తర్వాత తనని కలిస్తే ఇద్దరమూ పారిపోదామని బ్రెండ్‌కి చెబుతాడు ఫ్రాంక్. అయితే పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తే, యూరప్ పారిపోతాడు ఫ్రాంక్.
కార్ల్, ఫ్రాంక్‌ని అరెస్ట్ చేయడానికి యూరప్ వెళ్తాడు. ఈ దశలో ఫ్రాంక్ గతం తెలుసుకుంటాడు. అరెస్ట్ చేసి, జైల్లో ఉంచుతాడు. బ్యాంక్ మోసాల నేరస్తులని పట్టుకోవడానికి ఎఫ్‌బీఐ తరఫున సహకరించమని ఫ్రాంక్‌ని కోరుతాడు కార్ల్. మొదట చేసినా - ఈ వృత్తిలో థ్రిల్ లేదని భావించిన ఫ్రాంక్, జైలు నుంచి పారిపోయి, దొంగ పెలైట్‌గా మోసాలు ప్రారంభిద్దామనుకుంటాడు. అయితే ఫ్రాంక్‌ని కలిసి, నేరంలో ఎప్పుడూ రిస్క్ ఉంటుందని, ఎఫ్‌బీఐకి సహకారం అందించడం గౌరవప్రదమైన వృత్తి అని చెప్పి ఒప్పిస్తాడు. ఫ్రాంక్‌గా లియొనార్డో డికాప్రియో, కార్ల్‌గా టామ్ హాంక్స్ నటించారు.
- తోట ప్రసాద్
ఈ సినిమాని 147 లొకేషన్లలో కేవలం 52 రోజుల్లో చిత్రీకరించారు. 52 మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 352 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది.ఈ సినిమా అసలు కథానాయకుడు ఫ్రాంక్ అబింగేల్ క్లైమాక్స్‌లో లియొనార్డోని అరెస్ట్ చేసే ఫ్రెంచ్ ఆఫీసర్‌గా నటించాడు.ఒరిజినల్ ఫ్రాంక్ ప్రస్తుతం సెక్యూరిటీ సర్వీసెస్ నిర్వహిస్తూ, వైట్ కాలర్ క్రిమినల్స్‌ని పట్టుకునేందుకు ఎఫ్‌బీఐకి సహకరిస్తున్నాడు.