అమ్మాయి... ఆమె... అమ్మ!  | Hormonal changes in women are very complicated | Sakshi
Sakshi News home page

అమ్మాయి... ఆమె... అమ్మ! 

Published Thu, Mar 7 2019 1:05 AM | Last Updated on Thu, Mar 7 2019 1:05 AM

Hormonal changes in women are very complicated - Sakshi

మహిళగా పుట్టడమే ఒక అదృష్టం. కుటుంబానికి ఆమే మూలం. కూతురిగా, తల్లిగా, భార్యగా ఆమె సేవలు నిరుపమానం. ఆమె ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం కోసం కుటుంబసభ్యులంతా కనిపెట్టుకొని ఉండాలి. ఓ అమ్మాయి... తొలుత యువతిగా, ఆ తర్వాత మహిళగా, పెద్దవయసావిడగా మారుతుండే క్రమంలో ఆమెకు వచ్చే వైద్యపరమైన సమస్యలన్నీ చాలా ప్రత్యేకంగానే ఉంటాయి. మహిళల్లోని హార్మోన్‌ మార్పులు చాలా సంక్లిష్టమైనవి కావడంతో వారికి ఆరోగ్యపరమైన చిక్కులూ, సమస్యలూ ఎన్నో వస్తుంటాయి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనేక దశల్లో మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలూ, అవసరమైన పరీక్షలూ, పరిష్కారాలను తెలుసుకునేందుకే  ఈ ప్రత్యేక కథనం. 

దాదాపు పదేళ్ల వయసు వచ్చేవరకు అబ్బాౖయెనా, అమ్మాౖయెనా వారికి వచ్చే ఆరోగ్య సమస్యల్లో పెద్దగా తేడాలు ఉండవు. సాధారణంగా వచ్చే జ్వరం, జలుబూ, చికెన్‌ పాక్స్‌ వంటి సమస్యలు మామూలే. అయితే ఒక అమ్మాయి... తొలుత కౌమారప్రాయంలో రుతుక్రమం వచ్చి యువతిగా, ఆ తర్వాత  మహిళగా, అటు పిమ్మట మధ్యవయస్కురాలిగా ఇలా తన జీవితంలో దశలు మారుతున్న కొద్దీ మహిళలకు వచ్చే సమస్యలెలా ఉంటాయో చూద్దాం.  ఓ బాలిక... యువతిగా మారుతోందనడానికి స్పష్టమైన విభజన రేఖ ఆమెకు తొలుత రుతుస్రావం రావడం. రుతుస్రావం రావడం గురించి చాలా మంది అమ్మాయిలు బిడియంగా ఫీలవుతుంటారు. ఇందులో సిగ్గుపడాల్సిందీ, బిడియపడాల్సిందేమీ లేదు. ముందుగా చెప్పుకున్నట్లు ఓ అమ్మాయి... ఆరోగ్యకరమైన మహిళగా ఎదుగుతుందనడానికి ఇదో మంచి సూచన మాత్రమే. అయితే మహిళగా రూపొందుతున్న ఆ సమయం నుంచి ఆమెకే ప్రత్యేకమైన కొన్ని ఆరోగ్యసమస్యలు మొదలవుతుంటాయి. రుతుసంబంధమైన సమస్యలేమిటో, అవి ఎలా బాధిస్తాయో, వాటికి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం. 

రుతు సంబంధిత సమస్యలు (మెనుస్ట్రువల్‌ డిజార్డర్స్‌): ఇవి యువతి రోజువారీ పనులకు నిత్యం అడ్డుపడుతుంటాయి. వాటి గురించి క్లుప్తంగా... 
∙ప్రైమరీ అమెనోరియా : కొంతమంది అమ్మాయిల్లో 16 ఏళ్లు దాటుతున్నప్పటికీ రుతుక్రమం మొదలుకాదు. ఈ కండిషన్‌ను ప్రైమరీ అమెనోరియా అంటారు. ఇలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇలా జరగడానికి చాలా కారణాలే ఉంటాయి. వాటిని డాక్టర్లు అన్వేషించి, కారణాలను బట్టి దానికి తగిన చికిత్స అందిస్తారు.
∙డిస్‌మెనూరియా: రుతుసంబంధిత సమస్యల్లో రుతు సమయాల్లో నొప్పి కూడా ఒకటి. దీన్ని డిస్‌మెనూరియా అంటారు. ఈ సమస్య ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు రుతుసమయాల్లో నొప్పి వచ్చినప్పుడు వారు సూచించిన మోతాదులో నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. రెండుకు మించి వాడాల్సివస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. 
∙పరిష్కారం: సాధారణంగా రుతు సమయంలో వచ్చే నొప్పి ఒక వయసు వచ్చాక చాలామందిలో అదే తగ్గిపోతుంది. కొన్ని న్యూట్రిషనల్‌ సప్లిమెంట్లు కూడా డిస్‌మెనూరియాతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగించవచ్చు. సంతానం కలిగాక దాదాపుగా రాకపోవచ్చు. కానీ  అలా తగ్గకపోతే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి. 
∙మెనొరేజియా: కొందరిలో రుతు సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుంటుంది. ఇది వారిని ఎంతో చికాకు పెట్టడమే కాకుండా... రక్తహీనతకూ దారితీస్తుంది. 
∙పరీక్షలూ, పరిష్కారం:  ఇలాంటి సమస్యలు ఉన్నవారు డాక్టర్‌ సలహా మేరకు అవసరమైనప్పుడు కొన్ని హార్మోనుల పరీక్షలు చేయించుకొని అవసరాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది.
∙ప్రి మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ :  కొంతమంది మహిళల్లో రుతుస్రావం మొదలు కావడానికి కొద్ది రోజులు ముందర శారీరకంగా కొన్ని సమస్యలు కనిపిస్తుంటాయి. ఆ సమయంలో వాళ్లకు రొమ్ముల్లో సలపరం, బాధ /నొప్పి, భావోద్వేగాలు వెంటవెంటనే మారిపోవడం (మూడ్స్‌ స్వింగింగ్‌) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలతో కనిపించే సమస్యను ప్రీ–మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ అంటారు. 
∙పరిష్కారం : ఈ సమయంలో కలిగే ఇబ్బందులను అధిగమించడానికి తగినన్ని నీళ్లు తాగాలి. ఆకుకూరలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్‌ అనే హార్మోన్‌లు విడుదలై, వాటి వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. ఇలాంటి వారు పొగతాగడం,  కెఫీన్‌ డ్రింక్స్‌ (ఆల్కహాల్, శీతల పానీయాలు కోలా డ్రింక్స్‌), ఆల్కహాల్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఉప్పు ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలోనూ ఉప్పు తగ్గించాలి. కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను వీలైనంతగా తగ్గించాలి. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే డాక్టర్‌ను సంప్రదించి, కొన్ని హార్మోన్‌ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. పరీక్షల్లోని ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స తీసుకోవాలి. 
∙ రక్తహీనత : ఇంతకు మునుపు చెప్పుకున్నట్లే మహిళకు రుతుసమయంలో చాలా ఎక్కువగా రక్తస్రావం అయ్యే మెనొరేజియా కండిషన్‌ కారణంగా రక్తహీనత రావడం చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇంకా చెప్పాలంటే... మనదేశంలో దాదాపు 85 శాతం మహిళల్లో రక్తహీనత ఉన్నట్లు అంచనా. 
∙పరిష్కారం:  మహిళలకు ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. రుతుస్రావం మొదలయ్యాక వారు ఐరన్‌ కోల్పోతుంటారు కాబట్టి మాంసాహారం తినేవాళ్లయితే (శరీరం త్వరగా ఐరన్‌ను గ్రహించే హీమ్‌ ఐరన్‌ అన్నది మాంసాహారంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి) మాంసాహారం ఇవ్వడం మంచిది. మాంసాహారంలోనూ లివర్‌ వంటి వాటిల్లో హీమ్‌ ఐరన్‌ ఎక్కువ. ఈ హీమ్‌ ఐరన్‌ డ్రైఫ్రూట్స్‌లోనూ ఎక్కువే. అయితే ఈ వయసు పిల్లలు డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకుంటే మళ్లీ బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. రుతుసమయంలో కోల్పోయే ఇనుము పాళ్ల భర్తీ కోసం ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారం... అంటే వూంసాహారం తినేవాళ్లయితే చికెన్, వేటవూంసం, చేపలు, వూంసాహారంలో లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండుఖర్జూరం, అటుకులు, అంజీర, రాగి, పుచ్చకాయ వంటి పదార్థాలు పీరియడ్స్‌కు వుుందే తీసుకుంటూ ఉండండి. దానివల్ల కోల్పోయే ఐరన్‌ భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువ.

∙గర్భధారణ సమస్యలు : సంతానం కలగడంలో పురుషుడు, మహిళ... ఈ ఇద్దరి పాత్ర ఉన్నప్పటికీ, మహిళ భూమిక చాలా కీలకమైనది. శిశువు తొమ్మిదినెలల పాటు మహిళ గర్భంలోనే పెరగడమే కాకుండా, ఆ తర్వాత దాదాపు రెండున్నర, మూడేళ్ల వయసు వచ్చే వరకు అమ్మపాలమీదే ఆధారపడుతుంటాడు. అందుకే గర్భధారణకు ముందూ... గర్భధారణ తర్వాత కూడా మహిళలు చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. వాటిలో కొన్నింటిని చూద్దాం.

గర్భధారణకు ముందు... 
గర్భధారణ అనేది మహిళల సంపూర్ణ ఆరోగ్యాన్ని సూచించే మరో అంశం. ఇది ఎంతమాత్రమూ అనారోగ్యం కాకపోయినప్పటికీ, ఈ సందర్భంలో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, కాబోయే తల్లే కొన్ని  మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. 
     
పరీక్షలూ / పరిష్కారాలు : కౌమార వయసులో అంటే టీనేజీలోనే గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలు గర్భధారణకు కనీసం రెండు మూడు నెలల ముందునుంచే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు తీసుకోవాలి. దీంతో పిల్లల్లో పుట్టుకతో వచ్చే అనేక సమస్యల (కంజెనిటల్‌ అనామలీస్‌)ను, వెన్నుపూస లోపాల (న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్స్‌)ను నివారించవచ్చు. కొన్ని మందులు గర్భవతికీ, ఆమెలోని పిండానికీ హాని చేస్తాయి. డాక్టర్‌ను సంప్రదించకుండా ఏ రకమైన మందులూ వాడకూడదు. ఏవైనా సమస్యలున్నవారు డాక్టర్‌ సలహా మేరకే మందులు   వాడాలి. ఇక గర్భంతో ఉన్న మహిళ ఎక్స్‌–రే వంటి పరీక్షలను అస్సలు చేయంచుకోకూడదు. ప్రసవం తర్వాత కూడా అన్నిరకాల పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు ఐరన్, క్యాల్షియమ్‌ సప్లిమెంట్లను కనీసం ఆర్నెల్ల పాటు వాడాలి. 

ప్రసవం తర్వాత 
 పోస్ట్‌పార్టమ్‌ బ్లూస్‌ : ఇది మహిళల్లో ప్రసవం తర్వాత వచ్చే ఒక రకం మానసిక రుగ్మత. ఇందులో గర్భధారణ సమయంలో మహిళపై పడే ఒత్తిడి, ప్రసవం తాలూకు వేదన, కొత్తగా పుట్టిన బిడ్డ తాలూకు బాధ్యతల భారం... ఇలా అన్నీ కలగలసి మహిళపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. అలా కలిగిన ఒత్తిడి ఆమెకు మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది. 

పరిష్కారాలు : పోస్ట్‌పార్టమ్‌ బ్లూస్‌ను అధిగమించడానికి కుటుంబ సభ్యులందరి సమష్టి ప్రోత్సాహం అవసరం. ఆమె ఆందోళన తొలగేలా ఆమెకు ధైర్యం చెబుతూ, తామెప్పుడూ అండగా ఉంటామనే భరోసాను ఆమెలో కలిగించాలి. అవసరమైతే  డాక్టర్‌/సైకియాట్రిస్ట్‌ సలహామేరకు కొన్ని యాంటీ సైకోటిక్‌ మందులు వాడాల్సి రావచ్చు.

మహిళలకు వచ్చే సాధారణ గైనిక్‌ సమస్యలు
ఎండోమెట్రియాసిస్‌: గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్‌ అంటారు.  రుతుస్రావం తర్వాత గర్భాశయం లోపలి గోడలపై ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌  ప్రభావంతో అక్కడ ఎండోమెట్రియమ్‌ అనే పొర మొదటి 14 రోజులపాటు వృద్ధి చెంది, 15వ రోజు నుంచి విడుదల అయ్యే ప్రోజెస్టిరాన్‌ అనే హార్మోన్‌ ప్రభావం వల్ల పొర మరింత మందమవుతుంది. అక్కడ సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఓవరీస్‌లో విడుదలైన అండం శుక్రకణంతో కలవడం  జరగకపోతే 14 రోజుల తర్వాత ప్రోజెస్టరాన్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్‌ పొర గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్‌ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే రుతుస్రావం. 

అయితే కొందరిలో ఎండోమెట్రియమ్‌ కణాలు గర్భాశయంలోపలి  వైపునకు కాకుండా, కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపైనా, ట్యూబ్స్‌పై, గర్భాశయంపై పొరపై, పొత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులో కూడా ఏర్పడవచ్చు. హార్మోన్ల ప్రభావం వల్ల అది రుతుచక్రంలో ఎలాంటి మార్పులకు లోనవుతుందో...  అవి పెరిగిన చోట కూడా అలాంటి మార్పులే కనిపిస్తాయి. బహిష్టు సమయంలో ఆ అవయవాల్లో కూడా కొద్దిపాటి బ్లీడింగ్‌ అవుతుంటుంది. వీటిని ఎండోమెట్రియల్‌ ఇంప్లాంట్స్‌ అంటారు. ఈ కండిషన్‌ను ఎండోమెట్రియాసిస్‌ అంటారు. వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్‌ ఇంప్లాంట్స్‌లో రక్తస్రావం జరిగి అది బయటకు వెళ్లడానికి మార్గం లేక కొందరిలో రక్తం అక్కడ కరిగిపోతుంది. అయితే కొందరిలో రక్తం గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య ఈ రక్తపు కణాలతో కండలాంటిది పెరగవచ్చు. వాటిని అడ్‌హెషన్స్‌ లేదా ఫైబ్రోసిస్‌ బ్యాండ్స్‌ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్‌ హార్మోన్స్‌తో పాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో నడుం, పొత్తికడుపులో  నొప్పి, సంతానలేమి, పేగులు అతుక్కుపోవడం, మూత్రనాళాలు, పేగుల్లో అడ్డంకులు వంటి అనర్థాలు కనిపిస్తాయి.  పరిష్కారం : ఈ సమస్యకు ఈస్ట్రోజెన్, ప్రోజెస్టరాన్‌ వంటి హార్మోన్‌ మాత్రలతో చికిత్స అందిస్తారు. కొందరికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. 

∙పీసీఓఎస్‌ / పీసీఓడీ : ఈ సమస్యను వైద్యపరిభాషలో పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ లేదా డిజార్డర్‌ అని వ్యవహరిస్తారు. ఈ సమస్య ఉన్నవారిలో అండాశయంలో నీటితిత్తులు (సిస్ట్స్‌) కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో అవి హానికరం కాదు,  గర్భధారణకు అంతరాయం కూడా కాదు. మహిళల అండాశయం నుంచి ప్రతి నెలా ఒక ఫాలికిల్‌ (అండం పెరిగే నీటి తిత్తి) కనిపిస్తుంది. దీని పరిమాణం 18 నుంచి 20 మిల్లీమీటర్లకు చేరాక ఇది పగిలి దాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే కొంతమందిలో ఫాలికిల్స్‌ 5–10 మిల్లీమీటర్లకు చేరగానే అంతకు మించి  పెరగకుండా... చిన్న చిన్న నీటి బుడగలాగా మారిపోతాయి. అవి పది, పన్నెండు కంటే ఎక్కువగా ఉన్న కండిషన్‌ను పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ అంటారు. ఇవి ఏర్పడానికి స్పష్టమైన కారణం తెలియదు. ఆధునిక జీవనశైలితో పాటు కొన్ని ఆహారపు అలవాట్లు, మానసిక, శారీరక సమస్యలు ఉన్నప్పుడు, హార్లోన్లలో అసమతౌల్యత, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉన్నప్పుడు ఇవి కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్న మహిళల్లో బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, పీరియడ్స్‌ సక్రమంగా లేకపోవడం, సంతానలేమి, గర్భధారణ సమస్యలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. 

పరీక్షలు/పరిష్కారాలు : కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ వంటి పరీక్షలతో  సమస్యను నిర్ధారణ చేయవచ్చు. దీని చికిత్స అందరిలో ఒకేలా ఉండదు. లక్షణాలు, రక్తపరీక్షల ఆధారంగా చికిత్స  కూడా మారుతుంది. బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి మెట్‌ఫార్మిన్‌ వంటి మందులు, హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి ల్యాపరోస్కోపిక్‌ శస్త్రచికిత్సా  అవసరం కావచ్చు. 
∙క్యాండిడియాసిస్‌ / ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌: ఇది చాలా సాధారణ సమస్య.  మహిళల శరీరాల్లో చెమటలు పట్టే ప్రదేశాలు, చర్మం ముడతలు ఉండే ప్రాంతాల్లో తగినంత గాలి, వెలుతురు సోకే అవకాశాలు తక్కువ. దాంతో అక్కడ ఉక్కపోతలతో చెమట,  చెమ్మ పెరగడం వల్ల క్యాండిడియాసిస్‌ వంటి ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఎక్కువ. ఇక కొందరు మహిళల్లో గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్యలు కనిపించడం చాలా సాధారణమే. డయాబెటిస్‌ ఉన్నవారికీ, రోగనిరోధక శక్తి తగ్గిన వారికి, యాంటీబయాటిక్స్‌ ఎక్కువగా వాడే వారికి ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ తరచూ కనిపిస్తుంటాయి. 

పరీక్షలు / పరిష్కారాలు : సాధారణ ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌తోనే ఈ సమస్యను చాలావరకు తెలుసుకోవచ్చు.  దీనికి చికిత్సగా శరీరంపైన సోకిన ఫంగస్‌ రకాన్ని బట్టి పైపూతగా వాడాల్సిన (టాపికల్‌) యాంటీఫంగల్‌ మందులతో పాటు, నోటి ద్వారా కూడా కొన్ని మందులు ఇవ్వాల్సి ఉంటుంది. 

∙మూత్రసంబంధ సమస్యలు : మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు పురుషులతో పోలిస్తే మహిళల్లోనే చాలా ఎక్కువ. చాలా సాధారణం కూడా. ఆమె శరీర నిర్మాణమే ఇందుకు కారణం. తరచూ మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యేవారు ఎక్కువగా నీళ్లు తాగడం, ద్రవాహారం పుష్కలంగా తీసుకోవడం, ప్రతి మూడు గంటలకోమారు మూత్రవిసర్జనకు వెళ్లి, మూత్రాశయాన్ని ఖాళీ చేసుకోవడం, భార్యాభర్త కలియక తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లడం (ఈ సమయంలో ఒకింత వేగంగా మూత్రవిసర్జన చేయాలి), ప్రైవేటు పార్ట్స్‌ను శుభ్రంగా కడుక్కోవడం, అక్కడ శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. 

∙స్ట్రెస్‌ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ : సాధారణంగా  మహిళల్లో మానసిక ఒత్తిళ్లు చాలా ఎక్కువ. దాంతో వారిలో కొందరు మూత్రంపై నియంత్రణను కోల్పోతుంటారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో వారు చిన్నగా దగ్గినా, తుమ్మినా, ఏదైనా వస్తువును ఎత్తినా లేదా నవ్వినా కూడా వారి పొట్టపై కండరాలు మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి... అసంకల్పితంగానే కొన్ని మూత్రం చుక్కలు పడిపోయేలా చేస్తాయి. ఈ సమస్య  ప్రసవం తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసవం తర్వాత మహిళల పొట్ట కండరాలు బలహీనం కావడంతో వారి మూత్ర విసర్జన స్ఫింక్టర్‌పై నియంత్రణను కోల్పోతారు. దానికి బలం చేకూరే వరకు ఈ తరహా సమస్య వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది.

పరిష్కారాలు : ఈ సమస్య ఉన్నవారు డాక్టర్‌ సూచించిన కొన్ని ప్రసవానంతర వ్యాయామాలు, కెగెల్స్‌ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించవచ్చు. ఈ ఇబ్బందులున్నవారు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. 

మధ్యవయసులో వచ్చేవి... 
మధ్యవయసు మహిళల్లో సాధారణ సమస్యలివి...  
ఒక వయసు దాటాక ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్‌ వంటి  ఎముకలకు సంబంధించిన వ్యాధులు మహిళల్లో ఎక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో ఎముక సాంద్రతా, బలం క్రమంగా తగ్గుతూ పోతాయి. తమ వ్యాధినిరోధక శక్తి తమపైనే ప్రతికూల ప్రభావం చూపే ఎముక సంబంధితమైన రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, ఎస్‌ఎల్‌ఈ వంటి వ్యాధులు మహిళ్లోనే ఎక్కువ. అందుకే మహిళల్లో ఎముకల బలాన్ని పెంచడానికి కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఉండే పొట్టుతీసిన ధాన్యాలైన (గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు, ఓట్స్‌)తో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు, క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు తీసుకోవడం, పాలు తాగడం చాలా మంచిది. 

మెనోపాజ్‌ సమస్యలు : దాదాపు 45 ఏళ్లు వచ్చాక మహిళకు రుతుక్రమం ఆగిపోవడమూ ఒక సమస్యగానే పరిణమిస్తుంది. రుతుక్రమం ఆగే సమయంలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్స్‌ స్వింగింగ్‌), ఆస్టియోపోరోసిస్‌తో ఎముకలు బలహీనం కావడం, ఈస్ట్రోజెన్‌ వల్ల గుండెకు కలిగే సహజ రక్షణ తొలగిపోవడం వల్ల గుండెజబ్బులకు తేలిగ్గా గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం  వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. 

పరిష్కారం : రుతుక్రమం ఆగిన మహిళల్లో ఏవైనా సమస్యలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్లు హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) వంటి చికిత్సలను సూచిస్తారు. క్యాల్షియమ్, విటమిన్‌ ’డి’ ఇవ్వడం వల్ల మెనోపాజ్‌ వచ్చిన మహిళల్లో ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలను నివారించవచ్చు. 

క్యాన్సర్‌ను పారదోలండి! 
క్యాన్సర్‌ చికిత్సలో రెండు అంశాలు ప్రధానం... మొదటిది క్యాన్సర్‌తో పోరాడేలా రోగికి ప్రోత్సాహం అందించడం... కుదరకపోతే కనీసం వారికి హాని జరగకుండా చూసుకోవడం. 
క్యాన్సర్‌ రోగులు ప్రధానమైనవి చాలా  కోల్పోతుంటారు. ‘‘మీకు క్యాన్సర్‌ ఉంది’’ అని చెప్పగానే వారు జీవితం మీద అదుపు కోల్పోతారు. వెంటనే వాళ్ల రోజువారీ దిన చర్యలో డాక్టర్లను సంప్రదించడమే ఒక కార్యక్రమంగా ఉంటుంది. దీర్ఘకాలిక చికిత్సతో వాళ్లలో కలిగే దుష్ప్రభావాలతో తమకు ఆనందాన్నిచ్చే పనుల్లో వాళ్లు పాలుపంచుకోలేరు.సరైన సమయానికి జబ్బును కనుగొంటే అటు సంప్రదాయ చికిత్సతో పాటు ఇటు ప్రత్యామ్నాయ చికిత్సతో రోగికి నయమయ్యేలా చేయవచ్చు. సకాలంలో చేసే చికిత్సతో రోగుల ఆయుఃప్రమాణాన్ని పెంచవచ్చు. క్యాన్సర్‌ ఒంట్లోని ఇతర అవయవాలకు పాకే మెటాస్టేసిస్‌ కండిషన్‌ అయిన స్టేజ్‌ 4 దశలో ఉన్న రోగులను పూర్తిగా ఆశ వదులుకున్న కేసుల వారికీ చికిత్స ఇవ్వవచ్చు. 

స్ఫూర్తినిచ్చే శారదాదేవి ఉదంతం 
వైద్యపరీక్షల్లో శారదాదేవి అనే మహిళకు గాల్‌బ్లాడర్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. మరోసారి పరీక్షల్లోనూ అదే నిర్ధారణ అయ్యింది. సాధారణ చికిత్సతో ఒకింత ఉపశమనం అనిపించినా, దుష్ప్రభావాలూ కనిపించాయి. పరిస్థితి మొత్తాన్ని సమీక్షించినప్పుడు ఆమెలో  మెరుగుదల ఏమీ కనిపించలేదు. పరిస్థితి బాగా విషమించింది. జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి.  ఆకలి మందగించి, ఆమె బరువు చాలా వేగంగా తగ్గిపోయింది. రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గడంతో వ్యాధి విజృంభించసాగింది. ఆమె చికిత్సకు ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ఆ పరిస్థితుల్లో 1996 జూలైలో ఆమె ‘డీఎస్‌ఆర్‌సీ’కి వచ్చింది. చికిత్సకు బాగా స్పందించింది. వేగంగా ఆరోగ్యం పుంజుకొని 6 – 8 నెలల్లోనే 17 కేజీల బరువు పెరిగింది. తన రోజువారీ పనులు మామూలుగానే చేసుకోసాగింది. గాల్‌బ్లాడర్‌లోని క్యాన్సర్‌గడ్డ దాదాపుగా తగ్గిపోయింది. పధ్నాలుగు నెలల తర్వాత స్కానింగ్‌ చేయిస్తే... కాలేయం, ప్యాంక్రియాస్, ప్లీహం, మూత్రపిండాలు... అన్నీ నార్మల్‌గా ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. ఇక 21 నెలల తర్వాత రోగిలో క్యాన్సర్‌ తాలూకు లక్షణాలేవీ కనిపించలేదు. ఇప్పుడు శారదాదేవి పూర్తిగా సాధారణ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతోంది. ఇప్పుడామెకు క్యాన్సర్‌ లేదు! ఇలాంటి కేసులను పరిశీలించడం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. వాళ్ల వల్ల ఇతర క్యాన్సర్‌ రోగులకూ ఎంతో మనోబలం చేకూరుతుంది. తమ భయాలను, ఆందోళనను వదిలేసి, మంచి పట్టుదలతో క్యాన్సర్‌తో పోరాడటానికి ఇలాంటి ఉదంతాలు స్ఫూర్తినిస్తాయి. రండి... క్యాన్సర్‌పై పోరాటంలో మాతో చేతులు కలపండి. మరింత సమాచారం కోసం  91009 43142కు ఫోన్‌ చేయండి. లేదా www.dsresearchcentre.com సైట్‌ను సంప్రదించండి. 

హిస్టరెక్టమీ: కొందరు మహిళలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు తమ చివరి కాన్పు తర్వాత గర్భసంచిని (యుటెరస్‌ను) ఓ ఉపయోగపడని అవయవంగా భావించి దాన్ని తొలగించమని కోరుతుంటారు. దానివల్లనే నొప్పులు, రక్తస్రావాలు, తెలుపు కావడం (వైట్‌ డిశ్చార్జీ) వంటివి జరుగుతున్నాయనే అపోహ వారిది. గర్భసంచి తొలగించే శస్త్రచికిత్సకే ‘హిస్టరెక్టమీ’ అని పేరు. ఇక మరికొందరు వైద్యులు యుటెరస్‌తో పాటు అండాశయాలు (ఓవరీస్‌) కూడా తొలగిస్తుంటారు. ఇది ఎంతమాత్రమూ మంచిది కాదు. మెనోపాజ్‌ తర్వాత స్త్రీలో శారీరకంగా, మానసికంగా ఏ మార్పులు వస్తాయో... అచ్చం అలాంటి మార్పులే గర్భసంచిని తొలగించాకా కనిపించవచ్చు. ఉదాహరణకు... ఒంట్లోంచి ఆవిర్లు రావడం (హాట్‌ ఫ్లషెస్‌), యోని పొడిబారడం (డ్రై వెజైనా), కలయికలో విపరీతమైన నొప్పి (డిస్పరూనియా), నిద్ర, మూడ్స్‌లో అంతరాయాలూ (స్లీప్‌ అండ్‌ మూడ్స్‌ డిస్టర్బెన్సెస్‌) వంటివి రావచ్చు. అంతేకాదు... ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలు, గుండెజబ్బులకు దారితీసే పరిస్థితులూ ఏర్పడతాయి. అందుకే డాక్టర్లు మరీ మరీ తప్పనిసరి అని చెప్పిన పరిస్థితుల్లో తప్ప... మామూలుగానైనా తమ యుటెరస్‌ను అందునా ఓవరీస్‌ను తొలగించుకోకూడదు. తొలగించమని డాక్టర్లను కోరకూడదు. పరిస్థితిని బట్టి డాక్టర్లేపేషెంట్‌ కండిషన్‌ను రోగి సంబంధితులకు పూర్తిగా వివరించి, మరీ అవసరమైతేనే తొలగింపునకు సూచనలు చేస్తారు.చివరగా... ఈరోజుల్లో మహిళలు ఇటు ఇంటిపనులతో పాటు ఇప్పుడు అటు బయటి పనులు కూడా సంభాళించుకుంటున్నారు. అందుకే వారిపై పనిభారం, ఒత్తిడి ఎక్కువ. అందువల్ల ఆమెకు భర్త నుంచి కుటుంబ సభ్యుల నుంచి తగినంత సహాయ సహకారాలు ఎప్పుడూ అవసరమని గుర్తుంచుకోండి. 

ఎండోక్రైనల్‌ సమస్యలు
ఇందులో రెండు రకాలు ప్రధానం. మొదటిది హైపోథైరాయిడిజమ్‌. థైరాయిడ్‌ గ్రంథి పనిచేయకపోవడం లేదా చాలా తక్కువగా పనిచేయడాన్ని హైపోథైరాయిడిజమ్‌ అంటారు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఈ కండిషన్‌ కనిపించినా సాధారణంగా ఇది కూడా మహిళల్లోనే ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హైపోథైరాయిడిజమ్‌ కనిపిస్తుంది. తీవ్రమైన అలసట/ మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో కనిపిస్తుంది. యుక్తవయస్కుల్లో హైపోథైరాయిడిజమ్‌ వచ్చినప్పుడు సక్రమంగా చికిత్స అందించకపోతే వారు అలసిపోయినట్లుగా ఉండి నిత్యజీవన వ్యవహారాల్లో చాలా మందకొడిగా ఉండవచ్చు. కొందరిలో ఈ కండిషన్‌ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్‌కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్‌ పాళ్లు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. గర్భిణుల్లో హైపోథైరాయిడిజం అన్నది బిడ్డ మానసిక వికాసానికి కొద్దిగా అంతరాయం కలిగించవచ్చు. అందుకే గర్భిణుల విషయంలో హైపోథైరాయిడిజమ్‌ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. లెవో థైరాక్సిన్‌ సోడియమ్‌ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. 

మహిళలకు వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు 
మహిళల క్యాన్సర్లు : గర్భాశయ ముఖద్వార  (సర్విక్స్‌), ఎండోమెట్రియల్, ఒవేరియన్, రొమ్ము క్యాన్సర్‌ల వంటివి కేవలం  మహిళలకే వచ్చే క్యాన్సర్లు. (రొమ్ము క్యాన్సర్‌ అన్నది కొందరు పురుషుల్లోనూ కనిపించినా అది కాస్తంత అరుదు). 

సర్విక్స్‌ క్యాన్సర్‌ : ఇది మహిళల్లో చాలా ఎక్కువ. ఇది హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వల్ల వస్తుంది. దీని లక్షణాలు... అది అభివృద్ధి చెందడానికి దాదాపు పదేళ్ల ముందే కనిపిస్తాయి కాబట్టి దీన్ని చాలా ముందుగానే కనుక్కోవచ్చు. 

పరీక్ష/పరిష్కారం : పాప్‌స్మియర్‌ అనే పరీక్షతో దీన్ని తెలుసుకోవచ్చు. సర్విక్స్‌ క్యాన్సర్‌ను చాలా ముందుగానే తెలుసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి  చికిత్స ద్వారా పూర్తిగా తగ్గించుకునేందుకు ఆస్కారం ఉంది. పైగా ఇప్పుడు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చు. సర్వికల్‌ క్యాన్సర్‌ను నివారించే వ్యాక్సిన్‌ 9 నుంచి 45 ఏళ్ల వయసున్న వారు తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్‌ను కలయిక జరగకముందే (యాక్టివ్‌ సెక్స్‌ లైఫ్‌కు ముందే) తీసుకోవడం మేలు. అప్పుడు దాని ప్రభావం చాలా ఎక్కువ. 

రొమ్ము క్యాన్సర్‌ : దీన్ని నివారించుకోవడం చాలా సులభం. బిడ్డకు రొమ్ముపాలు పట్టడం వల్ల దీన్ని చాలావరకు నిరోధించవచ్చు. 

పరీక్షలు/పరిష్కారాలు : ప్రతి మహిళా పీరియడ్స్‌ తర్వాత స్వయంగా చేసుకోదగ్గ రొమ్ము పరీక్ష (సెల్ఫ్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌) ద్వారా దీన్ని తెలుసుకోవడం చాలా తేలిక. ఒకవేళ ఇది కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఉంటే... ఆ కుటుంబానికి చెందిన మహిళలు తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి సోనోమామోగ్రఫీ వంటి పరీక్షలతో దీన్ని తెలుసుకుంటూ ఉండాలి.  35 ఏళ్ల వయసు తర్వాత ప్రతి మహిళా ఈ పరీక్షను ప్రతి ఏడాదీ విధిగా చేయించుకోవడం మంచిది. బహిష్టుకీ, బహిష్టూకీ మధ్యగాని, సెక్స్‌ తర్వాత గాని, మెనోపాజ్‌ తర్వాత చాలా కాలానికి మళ్లీ రక్తస్రావం అయితేగాని ఉన్నా లేదా కడుపు నొప్పిగాని, ఆకలి లేకపోవడం గాని ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 
డాక్టర్‌ ఎం. రజిని, కన్సల్టెంట్‌ అబ్‌స్టిట్రీషియన్‌ – గైనకాలజిస్ట్, 
మ్యాక్స్‌క్యూర్‌ సుయోష ఉమన్‌ – చైల్డ్‌ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement