‘ప్యాడ్ ఉమన్’ : పంకజా ముండే, మహారాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
ఏడాదిలో ముప్పై రోజులకు పైగా బాలికలు స్కూలుకు రాకపోవడంపై పరిశీలన జరిపించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కారణం ‘రుతుక్రమం’ అని గుర్తించింది. వారి హాజరు శాతాన్ని పెంచేందుకు ‘అస్మిత’ అనే పథకాన్ని మార్చి ఎనిమిది నుంచి అమలుచేయబోతోంది. ఆ పథకంలో మీరూ పాలుపంచుకోవచ్చు.
ఓ అనాథ బిడ్డను ఏడాది పాటు దత్తత తీసుకున్నాం అనుకోండి. దానర్థం.. ఒక ఏడాదిపాటు ఆ బిడ్డ పోషణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఒక విద్యార్థిని దత్తత తీసుకుంటే వారి చదువుకు ఏడాదికయ్యే ఖర్చును స్పాన్సర్ చెయ్యడం. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫార్ములాను బాలికలలో ‘రుతుక్రమ పరిశుభ్రత’ కోసం అనుసరించబోతోంది.
ప్రతి నెలా ‘పరీక్షా సమయమే’!
గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే.. అమ్మాయిల సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది. వారిలోనూ కనీసం ఐదవ తరగతైనా పూర్తి చేసే అమ్మాయిలు మరీ తక్కువ. అసలు వాళ్లు అక్కడి వరకు రావడమే పెద్ద విజయం అన్నట్లు ఉంటాయి బాలికలకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు. ఐదవ తరగతిని కూడా దాటుకుని ఎనిమిది, తొమ్మిది క్లాసులకొచ్చేటప్పటికి వారి హాజరు శాతం మరింత పడిపోతోంది. ఏడాదిలో ముప్పై రోజులకు పైగా ఆ తరగతి బాలికలు స్కూలుకు రాలేకపోతున్నారు! ఈ పరిస్థితిపై పరిశీలన జరిపించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కారణం ‘రుతుక్రమం’ అని గుర్తించింది.
మనసు బడిలో.. మనిషి ఇంట్లో..
పరిశుభ్రమైన పద్ధతుల్లో నెలనెలా రుతుక్రమాన్ని దాటుకుని రావడం గ్రామాల్లోని విద్యార్థినులకు ఒక సమస్యగా పరిణమిస్తోంది. డబ్బు పెట్టి ప్యాడ్స్ కొని వాడలేరు. దాంతో నెలకు నాలుగు రోజులు వారిని ఇంట్లోనే ఉంచేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ పరిస్థితిని గుర్తించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే ఓ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రుతుక్రమ పరిశుభ్రత గురించి తెలియజెప్పి ఊరుకుంటే సరిపోదు, అంతకు మించిన సహకారం బాలికలకు ఉండాలని భావించారు. ఫలితమే.. ‘అస్మిత’ ప్రోగ్రామ్.
ప్రభుత్వమే ‘ప్యాడ్‌మాన్’ అయింది!
గ్రామాల్లో అల్పాదాయ వర్గాల బాలికలకు ఏడాదికి దాదాపుగా 183 రూపాయలు రుతుక్రమ పరిశుభ్రత కోసం ఖర్చు చేయడం కష్టమైన పని. అందుకని ప్రభుత్వమే నామమాత్రపు ధరకు ప్యాడ్‌లను అందించాలని సంకల్పించింది. ఇందుకోసం ‘అస్మిత’ అనే పేరుతో ఒక పోర్టల్ ప్రారంభించబోతోంది. అందులో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల పేర్లు, వాటిల్లో చదువుకుంటున్న విద్యార్థినుల పేర్లు ఉంటాయి. వారందరికీ అస్మిత కార్డు ఇస్తారు. ఆ కార్డు ఉన్న అందరికీ ప్రతి నెలా... ఎనిమిది శానిటరీ ప్యాడ్స్ ఉన్న ప్యాకెట్‌ను ఐదు రూపాయలకే అందిస్తారు. వీటి పంపిణీ బాధ్యతను స్థానిక స్వయం సహాయక గ్రూపులు తీసుకుంటాయి. ప్యాడ్‌ల తయారీకి పాతిక నుంచి ముప్పై రూపాయలవుతుంది. ఐదు రూపాయలు పోగా మిగిలిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.
మనమూ ప్యాడ్‌మాన్ కావచ్చు!
గ్రామీణ బాలికలకు సహాయం చేయాలనుకునే వాళ్లు ఆన్‌లైన్‌లో అస్మిత పోర్టల్‌లోకి వెళ్లి ఒక బాలికకు ఒక ఏడాదికి అయ్యే ఖర్చు 183 రూపాయలను విరాళంగా ఇవ్వవచ్చు. ఈ స్కీమ్‌ని మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంలో మనం అరుణాచలం మురుగనాథమ్ సేవల్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్ర దర్శక నిర్మాతలకు ప్రేరణనిచ్చిన నిజజీవితపు ప్యాడ్‌మ్యాన్ అరుణాచలం మురుగనాథమ్.. బాలికలలో రుతుక్రమ బిడియాన్ని పోగొట్టి, వారు చదువులో వెనుకబడకుండా తోడ్పాటునివ్వగలిగారు.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment