దేశమే నా కుటుంబం | house of the barrier soldier | Sakshi
Sakshi News home page

దేశమే నా కుటుంబం

Published Wed, Apr 4 2018 12:36 AM | Last Updated on Wed, Apr 4 2018 12:36 AM

house of the barrier soldier - Sakshi

సరిహద్దే సైనికుడి ఇల్లు...  దేశమే అతని కుటుంబం. ఆ కుటుంబానికి కాపలా సైనికుని విధి.డ్యూటీ ఫస్ట్‌ అనుకున్నాడు ఫిరోజ్‌లోని సైనికుడు. బుల్లెట్లకు ఎదురొడ్డి ‘నా దేశం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను’ అని నినదించాడు. నేడు సైనికుడు లేకపోవచ్చు...దేశం అనే ఈ కుటుంబం అతణ్ణి  తలుచుకోకుండా ఉంటుందా?

సరిహద్దే సైనికుడి ఇల్లు.ఇంటి కాపలా సైనికుని విధి.శతృవు టక్కరి నక్క అయినప్పుడు సైనికుడు పులిలా గాండ్రిస్తాడు.తుపాకీని ఎక్కుపెడతాడు.బుల్లెట్‌ తాకిన శతృవు హాహాకారాలు చేస్తాడు.బుల్లెట్లకు ఎదురొడ్డిన సైనికుడు ‘భారత్‌ మాతాకీ జై’ అని నినదిస్తాడు.నేడు సైనికుడు లేకపోవచ్చు.దేశం అనే ఈ ఇల్లు అతణ్ణి తలుచుకోకుండా ఉంటుందా?‘నస్రీన్‌.. బక్రీద్‌ పండక్కి రాలేకపోతున్నా..’ చెప్పాడు ఫిరోజ్‌.‘కోషీష్‌ చేయండి.. పిల్లలు చాలా జ్ఞాపకం చేస్తున్నారు... ’ నిరాశ పడుతూ అంది నస్రీన్‌. ‘నీకు తెలుసుగా నస్రీన్‌.. మిలట్రీలో ఇలాగే ఉంటుంది... పిల్లలని సముదాయించు’‘అలాగే... మీరు జాగ్రత్త’
దాదాపు అరగంట సాగింది ఆ సంభాషణ. ఆ అరగంటలో  చాలాసార్లు సిగ్నల్‌ కట్‌ అయింది. మళ్లీ మళ్లీ ట్రై చేస్తూ భార్యతో మాట్లాడాడు. ఇంకా ఆమెకు భర్తను వినాలనే ఉంది. కాని జమ్ము, కశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌ కమ్యూనికేషన్‌ సిగ్నల్‌ అంత బలంగా లేదు. ఫోన్‌ డిస్కనెక్ట్‌ అయ్యాక ఫిరోజ్, నస్రీన్‌ ఇద్దరిలోనూ బాధే!

నేపథ్యం...
ఫిరోజ్‌ది హైదరాబాద్‌లోని నవాబ్‌సాబ్‌ కుంట. నస్రీన్‌ది ఎమ్‌.ఎస్‌ మఖ్తా. ఇద్దరికీ దూరపు బంధుత్వం ఉంది. 2006లో నిఖాతో విడదీయని బంధంగా మారారు. ఫిరోజ్‌ కుటుంబంలో అతనే మొదటి సంతానం. ఫిరోజ్‌ వాళ్ల నాన్న మిలటరీలో ఉండి రిటైరయ్యాడు. ఫిరోజ్‌ కూడా పద్దెనిమిదేళ్లకు మిలటరీలో జాయిన్‌ అయ్యాడు. యూనిఫామ్‌ అంటే అమితమైన భక్తి, గౌరవం. డ్యూటీ అంటే ప్రాణం. ఏ బార్డర్‌లో ఏ సెక్టార్‌లో బాధ్యతలు అప్పజెప్పినా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. సౌత్‌ఆఫ్రికాకు వెళ్లమంటే ఇంట్లో వాళ్లు వద్దని వారించినా వినకుండా వెళ్లాడు. డ్యూటీ అంటే డ్యూటీనే అనేవాడు.
వీరుడు లాన్స్‌ నాయక్‌ ఫిరోజ్‌.అమరవీరుడు ఫిరోజ్‌!

2013 అక్టోబర్‌...
కశ్మీర్‌ సరిహద్దులో విపరీతంగా కాల్పులు జరుగుతున్నాయి. ఆ సంఘటనప్పడు ఆ రోజు డ్యూటీలో ఉన్నాడు ఫిరోజ్‌. అది బక్రీద్‌కు ముందు రోజు. ఆ సమయంలోనే దసరా కూడా ఉండడంతో హిందూ జవాన్లు సెలవుల మీద సొంతూళ్లకు వెళ్లారు. ఫిరోజ్‌ బక్రీద్‌కి లీవ్‌ తీసుకోకుండా డబుల్‌ డ్యూటీలో ఉన్నాడు. ఆ విషయాన్నే  ఫోన్‌లో భార్యతో పంచుకున్నాడు. అన్నట్లుగానే సరిహద్దులో రెప్ప వేయకుండా నలు దిక్కులా దృషిసారిస్తున్నాడు. అప్పుడే అవతలవైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి. సమాధానంగా  ఫిరోజ్‌ఖాన్‌ తుపాకి గురిపెట్టాడు. ఫైర్‌ చేస్తూనే ఉన్నాడు. ధడ్‌ధడ్‌ధడ్‌... శతృవు తోక ముడుస్తూ ఉండగా... ధడ్‌ధడ్‌మంటూ ఎదురు నుంచి బుల్లెట్లు దూసుకొచ్చి జివ్వున ఫిరోజ్‌కు గుచ్చుకున్నాయి. అయినా ఫిరోజ్‌ తగ్గలేదు. పోరాడాడు. పోరాడుతూ పోరాడుతూనే కుప్పకూలాడు. వెంటనే అతణ్ణి శిబిరంలోకి చేర్చారు తోటి సైనికులు.

అదే సమయానికి హైదరాబాద్‌లో...
నస్రీన్‌ తన ముగ్గురు పిల్లల (ఇద్దరమ్మాయిలు, ఒక్కబ్బాయి)తో తల్లిగారింట్లో ఉంది. బక్రీద్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నస్రీన్‌ తండ్రి మొయినుద్దీన్‌ హడావిడిగా ఉన్నాడు. ఇంతలోకే అతనికి ఫోన్‌.. ‘బార్డర్‌లో చిన్నగా కాల్పులు. ఫిరోజ్‌కి షోల్డర్‌లో బుల్లెట్‌ దిగింది’ అని సమాచారం. ‘యాల్లాహ్‌...’ మొయినుద్దీన్‌ కంగారు పడ్డాడు. ‘కంగారు పడకండి.. ఏం కాలేదు. మీతో  ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు’అని ఫిరోజ్‌కి ఫోన్‌ ఇచ్చారు. ‘అబ్బాజాన్‌.. అ..బ్బా...జా...’ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఫిరోజ్‌. కాని చెప్పలేకపోయాడు. అందరూ ఉన్న పని వదిలేసి దేవుడి ప్రార్థనల్లో మునిగి పోయారు. తెల్లవారో.. ఆ మర్నాడో.. ఫిరోజ్‌ భౌతిక కాయం రానే వచ్చింది. నస్రీన్‌ కుప్ప కూలిపోయింది. ‘పిల్లలు పెరుగుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నారు. ఫౌజీ వద్దు ఏం వద్దు.. అందరం ఒక్క చోటే ఉందాం.. ఉన్నది తిందాం.. వచ్చేయండి’ ఎన్నో సార్లు బతిమాలుకుంది. ‘నస్రీన్‌.. దీన్ని నేనొక ఉద్యోగంలా అనుకోవట్లేదు. ఈ నేలను కాపాడ్డం ఈ దేశ పౌరుడిగా నా బాధ్యత అనుకుంటున్నా. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పూ..!? నాకు మాత్రం ఉండదా? నీతో, పిల్లలతో ఉండాలని. ఇన్ని రోజులు ఓపిక పట్టావు. ఇంకొన్ని రోజుల్లో రిటైరైపోతా.. అప్పుడంతా మీతోనే కదా..’ అంటూ అంతకుముందే ఆగస్ట్‌లో ఈద్‌ పండక్కి వచ్చినప్పుడు  ఆప్యాయంగా చేయి పట్టుకొని భరోసా ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి అట్లా ఎట్లా పోతాడు? 

అల్లాహ్‌.. ఈ పిల్లలకు ఏమని చెప్పాలి? ‘నస్రీన్‌.. తుపాకి భుజానేసుకొని జమీన్‌ను కాపాలకాసే జావాన్‌ను నేను. ఎప్పుడేమవుతుందో తెలియదు. అన్నిటికీ సిద్ధపడాలి. ఒంటరిగా బతకడం నేర్చుకోవాలి. ఇండిపెండెంట్‌గా బతికే ధైర్యాన్ని తెచ్చువాలి’ మొన్న ఈద్‌కొచ్చినప్పుడే అన్నాడు. గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆమె కళ్లల్లో జలధారలు. ఎప్పుడూ దగ్గరగా లేకపోయినా అప్పుడప్పుడు కనీసం నెలకో రెండునెల్లకైనా అరగంట అయినా సిగ్నల్‌ సతాయిస్తూ అయినా ఫిరోజ్‌తో మాటలుండేది. ఊరడింపులు.. ధైర్యవచనాలు.. ప్రేమ.. అనురాగం.. భవిష్యత్‌ ప్రణాళికలు.. ఆశలు.. ఆశయాలు..ఎన్నో పంచుకునే వాళ్లు. డ్యూటీ గురించి ఎప్పడూ ఏమీ చెప్పవు అని గారంగా విసుక్కునేది. ‘చెబితే భయపడ్తావ్‌.. మళ్లీ నన్ను వెళ్లనివ్వవ్‌.. నీ భర్త బహద్దురీ నీ భర్త గుండెలోనే ఉండనివ్వు’ అనేవాడు నవ్వుతూ. ‘మరినాకెట్లా తెలిసేది.. మీ నాన్నను చూసి నువ్వు ఇన్స్‌పైర్‌ అయినట్లు వాళ్ల నాన్నను నా పిల్లలు ఇన్స్‌పైర్‌ కావొద్దా?’ అనేది. నవ్వి ఊరుకునేవాడు అంతే!ఆ నవ్వు లేదు.. ఆ ధైర్యం రాదు.. ఆ సాహసం కనిపించదు ఇప్పుడు! అన్నీ ఈ నేలకు సెల్యూట్‌ చేసి ఆయనతోపాటే వెళ్లిపోయాయి. ఫిరోజ్‌ అంటే.. వెలుగు.. విజయం! ఆ పేరే తనకు ప్రేరణ. ఆ వెలుగే తనకు దారి చూపిస్తోంది.. ఆ కామియాబీనే తనను నడిపిస్తోంది అంటుంది నస్రీన్‌. ఆమె కోరుకునేది ఒక్కటే. ‘బతికున్నంత కాలం.. ఫౌజీ ఫౌజీ అని తపించాడు. ఈ దేశం కోసం ప్రాణాలర్పించాడు. ఆయన చనిపోయినప్పుడు ఈ స్టేట్‌ గవర్నమెంట్‌ రెండువందల గజాల స్థలాన్నిస్తానని చెప్పింది.  జవాన్‌ భార్యగా అది నా హక్కు. ఆయన చనిపోయి అయిదేళ్లయినా ఇంకా ఆ జాగ ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడ్డాక అదిచ్చే బాధ్యత తెలంగాణ గవర్నమెంట్‌కు వచ్చింది. రేపు మాపు అంటూ తిప్పుతూనే ఉన్నారు. కాని ఇప్పటికీ జాడలేదు. కాళ్లరిగేలా తిరుగుతున్నా.. అమర జవాన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ ఆవేదన చెందుతోంది నస్రీన్‌. ఫిరోజ్‌ పెద్ద కూతురికి పదేళ్లు. పెద్దయ్యాక ఏమవుతావ్‌ అని అడిగితే.. ‘పప్పాలాగా మిలిట్రీ పోలీస్‌ అవుతా’ అంటుంది ఉత్సాహంగా. బక్రీద్‌ పండగ త్యాగానికి చిహ్నం.ఆ పండుగ సమయంలో దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసినవాడు ఫిరోజ్‌. సలాం..  ఫిరోజ్‌ సాబ్‌.. సలాం!
– సరస్వతి రమ 

డ్యూటీ గురించి ఎప్పడూ ఏమీ చెప్పవు అని గారంగా విసుక్కునేది.  ‘చెబితే భయపడ్తావ్‌.. మళ్లీ నన్ను వెళ్లనివ్వవ్‌.. నీ భర్త శౌర్యం నీ భర్త గుండెలోనే ఉండనివ్వు’ అనేవాడు నవ్వుతూ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement