
జలుబు... చాలా తరచుగా బాధించే వ్యాధి. ఒక్కసారిగా ఏడు రోగాల పడినంత బాధ పెడుతున్నా దానిని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఇప్పుడు స్వైన్‌ఫ్లూ భూతంలా భయపెడుతోంది. దీన్నుంచి కుటుంబాన్ని రక్షించుకోవడమే ఇప్పుడు ప్రధాన సమస్య అవుతోంది.
1. హెచ్1ఎన్1 అనే స్వైన్ ఫ్లూ వైరస్ మనిషి శరీరం నుంచి బయటపడిన తర్వాత 24 గంటల సేపు బతికి ఉంటుందని తెలుసు.
ఎ. అవును బి. కాదు
2. స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్లు వాడిన వస్తువులను ఉపయోగించినా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి తరచుగా చేతుల్ని యాంటి బ్యాక్టీరియల్ సోప్‌తో కడుగుతున్నారు.
ఎ. అవును బి. కాదు
3. ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా చూసుకుంటున్నారు.
ఎ. అవును బి. కాదు
4. రోజుకు తప్పని సరిగా ఎనిమిది గంటల నిద్ర ద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పని చేస్తుంది.
ఎ. అవును బి. కాదు
5. ఎక్కువ నీటిని తాగితే దేహంలోని విషపదార్థాలు, వ్యర్థాలు బయటకు పోతాయి. దీని ద్వారా వ్యాధుల బారిన పడే అవకాశమూ తగ్గుతుందని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
6. ఆల్కహల్ సేవనం వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుందని, ఆకుపచ్చని కూరగాయలు, విటమిన్లు,పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
7. వ్యాయామం ద్వారా రక్తప్రసరణ వేగం పెరిగి, శరీరంలో అన్ని భాగాలకూ ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని తెలుసు.
ఎ. అవును బి. కాదు
8. వ్యాధి బారిన పడిన వారికి మనం దూరంగా ఉండడమే కాకుండా మనకు వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానం వస్తే ఫంక్షన్లకు వెళ్లకూడదని తెలుసు.
ఎ. అవును బి. కాదు
9. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు పిల్లలను స్కూలు పంపరు, అలాగే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కర్చీఫ్ వాడకాన్ని అలవాటు చేశారు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే ఈ వ్యాధి గురించిన ప్రాథమిక సమాచారం, జాగ్రత్తలు మీకు తెలుసు. తుమ్మినప్పుడు బయటపడిన ఈ వైరస్ టేబుల్, కంప్యూటర్ కీ బోర్డుల వంటి గట్టి వస్తువుల మీద ఒక రోజంతా బతికే ఉంటాయి. ఈ లోపు వాటిని తాకిన వాళ్ల శరీరంలోకి చేరతాయి. అందుకే ఆఫీసు వస్తువులు, బస్సులు, ఆటోల వంటి వాటిని వాడేవాళ్లు కనీసం గంటకొకసారయినా చేతులను శుభ్రం చేసుకోవాలని అంకిత్ అరోరా చెబుతున్నారు.