
పొట్ట పగిలేలా కొవ్వు పదార్థాలు తిన్నా ఇంచు కూడా లావెక్కరాదని, మధుమేహం వంటి వ్యాధులేవీ రాకూడదని అందరం అనుకుంటాంగానీ..
పొట్ట పగిలేలా కొవ్వు పదార్థాలు తిన్నా ఇంచు కూడా లావెక్కరాదని, మధుమేహం వంటి వ్యాధులేవీ రాకూడదని అందరం అనుకుంటాంగానీ.. సాధ్యం కాదు కాబట్టి అవసరం కొద్దీ రకరకాలుగా కడుపు కట్టుకుంటాం. అయితే ఇలా ఉండటం సాధ్యమే అంటున్నారు వాషింగ్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కొవ్వు కణాల్లోని ఓ ప్రొటీన్‌ను చైతన్యవంతం చేయడం ద్వారా అవి లావెక్కకుండా చేయవచ్చునని ఫాంక్సిన్ లాంగ్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఎలుకలతో పాటు మన శరీరాల్లో కూడా హెడ్జ్‌హాగ్ సిగ్నలింగ్ పాథ్‌వే అని ఒక వ్యవస్థ ఉంటుంది. ఎదుగుదలతోపాటు కొవ్వు కణజాలం వద్ధి చెందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఇప్పటికే తెలుసు.
ఎలుకల కణాల్లో ఈ వ్యవస్థను మళ్లీ చైతన్యవంతం చేసి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం అందించారు. ఎనిమిది వారాల తరువాత లావెక్కుతాయి అనుకున్న ఎలుకలు కూడా ఉన్నవి ఉన్నట్టుగా స్పష్టమైంది. హెడ్జ్‌హాగ్ పాథ్‌వేను చైతన్యవంతం చేయని ఎలుకలు మాత్రం లావెక్కిపోయాయి. అంతేకాకుండా లావెక్కని ఎలుకల రక్తంలోని గ్లూకోజ్ శాతం కూడా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ‘‘మనం లావెక్కడమంటే.. మనలోని కొవ్వు కణాల సైజు పెరగడమే. కొవ్వు కణాలు సాధారణ సైజులోనే ఎక్కువ సంఖ్యలో ఉంటే పెద్దగా ఇబ్బంది లేదు.’’ అని లాంగ్ అంటున్నారు.