కేశ సంరక్షణే ప్రధానం
ఆయుర్వేద ఇతిహాసాన్ని పరిశీలిస్తే చరక సుశ్రుత వాగ్భటుల్ని వృద్ధత్రయమంటారు. భావమిశ్రుడు, శారంగధరుడు, మాధవకరుడు లఘుత్రయంగా పేరొందారు. ‘దారుణక’ అనే పేరుగల వ్యాధిని వాగ్భటుడు కపాలగత రోగంగానూ, మాధవాచార్యులు ‘క్షుద్ర’రోగంగానూ అభివర్ణించారు. వ్యాధి తీవ్రత స్వల్పంగా ఉన్నవాటిని క్షుద్రరోగాలుగా వర్గీకరించారు. వ్యాధి స్థానాన్ని బట్టి ఇది కపాల చర్మరోగం.
లక్షణాలు : తల మీద చర్మం పొడిబారి చిన్న పొలుసులుగా రాలిపోతుంది. అప్పుడప్పుడు చిన్న పొక్కులు వస్తుంటాయి. విపరీతమైన దురద ఉంటుంది. కనుక దీన్ని కఫ ప్రధానమైన వాతానుబంధ వ్యాధిగా చెప్పారు. శాలాక్యతంత్ర నిపుణుడైన ‘విదేహుడు’ మరికొన్ని లక్షణాలను కూడా చెప్పాడు. సూదులతో పొడిచినట్లు నొప్పి, మంట, స్రావం. వీటితో పాటు తలవెంట్రుకలు రాలిపోవడాన్ని ఉపద్రవంగా చెప్పాడు. అంటే ఇది సెకండరీ ఇన్ఫెక్షన్ స్వభావం. ఇదే పిత్తప్రకోపావస్థ.
కారణాలు : తల మీది చర్మంలో శుభ్రత లోపించడం, కేశమూలాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, మానసిక ఉద్వేగాలు కూడా ఈ వ్యాధిపై ప్రభావం చూపిస్తాయి.
నివారణ... తలను శుభ్రంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతత అవసరం. చర్మానికి హాని కలిగించే రసాయనాలున్న తీవ్రమైన షాంపూలను వాడకూడదు. ఆహారంలో ఉప్పు, కారం తక్కువగా తినాలి.
ఔషధాలు... త్రిఫలాచూర్ణంతో కషాయం కాచుకొని, తలను కడుక్కుని, తర్వాత తలస్నానం చేయాలి. తడి ఆరిన తర్వాత తల చర్మంపై పూయవలసిన ఔషధ తైలాలు: దూర్వాది తైలం లేక మహామరీచాదితైలం లేక మంజిష్ఠాది తైలం.
కడుపులోకి మందులు:
లఘుసూతశేఖరరస మాత్రలు పూటకొక్కటి చొప్పున రోజుకి మూడు మాత్రలు పంచతిక్త గుగ్గులు ఘృతం రెండు చెంచాలు ఉదయం, రెండు చెంచాలు సాయంత్రం, కొంచెం పాలతో కలిపి ఖాళీ కడుపుతో సేవించాలి. ఖదిరారిష్ట రెండు చెంచాలు, శారబాద్యాసవ రెండు చెంచాలు కలిపి, నాలుగు చెంచాలు నీళ్లు కూడా కలిపి రోజుకి రెండుసార్లు ఆహారం తిన్న తర్వాత తాగాలి. అధిక ఒత్తిడి చుండ్రు సమస్యను తీవ్రతరం చేస్తుంది. దాని నివరణకు ప్రాణాయామం చేయడం మేలు.
చర్మతత్వాన్ని బట్టి చికిత్స
చర్మవ్యాధులు, నరాల బలహీనత , రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో చుండ్రు వచ్చే అవకాశాలు ఎక్కువ. అన్ని చర్మవ్యాధులలో మానసిక ఒత్తిడి ఏ విధంగా కారకమో చుండ్రుకు కూడా ఒత్తిడి ముఖ్యమైన కారకం.
పొడి చుండ్రు: ఇది చాలా తరచుగా చూసే సమస్య. తలలో పెద్ద పెద్ద తెల్లటి పొలుసులు ఏర్పడి, పొడి చారికలుగా పైకి లేస్తుంది. ఈ తరహా చుండ్రు యుక్తవయసు వారిలో ఎక్కువగా చూస్తాం. ఇది ఒక సౌందర్య సమస్యగానే తీసుకుంటారు.
తడి చుండ్రు: దీన్ని కొంచెం తీవ్రస్థాయి చుండ్రుగా పరిగణిస్తారు. దీనిలో పచ్చటి చమురుతో కూడిన పొలుసులు, వాటి అంచులు ఒక క్రమమైన పరిమాణంలో ఏర్పడతాయి. త్వరత్వరగా చర్మకణాలు వృద్ధి చెందడమే కాకుండా అవి దెబ్బతింటూ ఉంటాయి. ఇవి ఎక్కువగా రాలి పోయే క్రమంలో చర్మంపై వాపు, ఎర్రగా అవుతుంది. అధికంగా దురద కలుగుతుంది. ఈ తరహా చుండ్రు తలపై భాగాన మాత్రమే కాకుండా నుదుటిపైన, శిరోజాల మొదలులో, కనుబొమల్లో, కనురెప్పల్లో, చెవి భాగాలలో కూడా చూస్తుంటాం.
చుండ్రు వేరు - సోరియాసిస్ వేరు
తలపై ఏర్పడే సోరియాసిస్‌లో ఎర్రటి మచ్చలు ఏర్పడి అవి క్రమేణ నల్లగా మారి వాటి మీద ఎండిన తెలుపు, బూడిద రంగులో చర్మం పొలుసు పొలుసులుగా రాలుతుంటుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో చర్మకణాలు త్వరత్వరగా అంటే 2-3 రెట్లు ఎక్కువగా వృద్ధిచెందుతుంటాయి. పైగా అక్కడి పొలుసులను తొలగిస్తే రక్తస్రావమై వ్యాధి ఎక్కువవుతుంది.
జాగ్రత్తలు
సరైన నియమాలతో పోషకాహారం తీసుకోవడం.
మానసిక వ్యాకులతకు దూరంగా ఉండటం
తలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, రోజుకు రెండుసార్లు సరిగ్గా దువ్వడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా జాగ్రత్త పడటం.
మందులు
చుండ్రు నివారణకు, శిరోజాల నిగారింపుకు కాలిసల్ఫ్, ఆర్సనిక్ ఆల్బమ్, బాడియాగ, గ్రాఫైటిస్, నేట్రం మూర్, వినికామైనర్, మెజీరియమ్ మందులు ఉపయోగపడతాయి.
వినికామైనర్: చర్మంపై నూనె ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవారిలో చర్మగ్రంథులు మూసుకుపోయి విపరీతమైన దురద పుడుతుంది. గోకడం వల్ల పుండు పెద్దగా మారి పొరలు పొరలుగా రాలుతుంది. వెంట్రుకలన్నీ కుచ్చుల్లా ఒకదానికొకటి అంటుకుపోయి చర్మకణాలు బాగా దెబ్బతింటాయి. దీర్ఘకాలంగా ఈ తరహా చుండ్రుతో బాధపడేవారికి బట్టతలకు దారితీసేవారికి ఈ మందు ను ఉపయోగిస్తారు.
నేట్రం మూర్: మానసికంగా బాగా ఒత్తిడికి గురై భయాందోళనలకు లోనై బాగా కుంగిపోయేవారిలో చుండ్రు ఎక్కువగా కనిపిస్తుంది. నూనె గ్రంథులు ఎక్కువగా ప్రేరేపణకు గురికావడం వల్ల చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, తెల్లటి పొరలుగా రాలే వారికి ఈ మందును వాడతారు.
సెవియా: దిగులుగా, ఉత్సాహం లోపించినట్టుగా ఉండటం, చర్మగ్రంథులు తడిగా ఉండి చర్మం పొలుసులుగా రాలడం, వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా ఉండి, జుట్టు అధికంగా రాలడం వంటి సమస్యలకు ఈ మందు వాడుతారు.
గ్రాఫైటీస్: మందంగా ఉన్న చర్మంపై పెచ్చులు పెచ్చులుగా పొట్టు రాలడం, శుభ్రత లోపించి చెడువాసన రావడం, దురద మూలంగా పుండ్లు ఏర్పడటం, రాత్రివేళలో దురద ఎక్కువవటం, భయస్తులకు ఈ మందు ఇస్తారు.
బాడియాగ: పొడి చర్మతత్వం కలిగి చలికాలంలో ఏర్పడే చుండ్రు, దురదతో పాటు చాలా సున్నితంగా ఉండే మాడు కలిగిన వారికి ఉపయోగిస్తారు.
కాలిసల్ఫ్: చుండ్రు విపరీతంగా ఉండి, సోరియాసిస్ ఎగ్జిమాను తలపించే చారికలు, పొరలు దురదతో పొక్కులతో పాటు... త్వరగా ఉలిక్కిపడటం, భయపడటం, సున్నితవిషయాలకు త్వరగా స్పందించడం వంటి వారికి ఈ మందు ఉపయోగిస్తారు.