
ముక్కుపొడుం అలవాటు మానడం ఎలా?
నా వయసు 51. నాకు చిన్నప్పటి నుంచి ‘ముక్కుపొడుం’ పీల్చే అలవాటు ఉంది. రోజూ చాలాసార్లు పీలుస్తుంటాను. ఒక్కరోజు మానేస్తేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల దుష్ఫలితాలుంటాయని మిత్రులు చెబుతున్నారు. ఇది ప్రమాదకరమా? పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉందా? దీని దుష్ర్పభావాల నుంచి కాపాడుకోవడానికి ఆయుర్వేదంలో మందులు సూచింపగలరు.
- పేరి జగన్నాథరావు, విశాఖపట్నం
ముక్కుపొడుం పొగాకు నుంచి తయారుచేస్తారు. చుట్ట, బీడీ, సిగరెట్, కైనీ మొదలైనవి కూడా పొగాకు నుంచే తయారుచేస్తారు. ఇవన్నీ ‘మాదకద్రవ్యాలే’. వీటన్నిటి ద్వారా లభించేది ‘తాత్కాలిక ఉత్తేజం’ మాత్రమే. ముందు అలవాటుగా మొదలై, క్రమంగా బానిసత్వానికి దారితీస్తాయి. వీటిపై అమితంగా ఆధారపడేట్టు చేస్తాయి. దీన్నే వ్యసనం అంటారు. ఒక్కసారిగా మానేస్తే... నీరసం, వణుకు, నిరుత్సాహం, ఆందోళన, మానసిక బలహీనత వంటి బాధలు వెంటాడతాయి.
మాదకద్రవ్యం సేవించే మార్గాన్ని బట్టి ఆయా భాగాలు స్థానికంగా దెబ్బతింటాయి. వాటి క్రియాసామర్థ్యం నశించి, రోగనిరోధకశక్తి దెబ్బతిని, రకరకాల వ్యాధులు జనిస్తాయి. మీలాగ ‘నస్యం’ పీల్చేవారికి... ముక్కుదిబ్బడ, తరచు జలుబు, గొంతునొప్పితో మొదలై మీ శరీరతత్వాన్ని బట్టి క్యాన్సరు కూడా సంభవించే అవకాశాలుంటాయి.
ఏ వ్యసనాన్నైనా త్యజించాలంటే అమోఘమైన ‘సంకల్పసిద్ధి’ కావాలి. రోజూ రెండుమూడుసార్లు ‘నేనింత బలహీనుణ్ణా? ఇది మానుకోలేనంత అశక్తుణ్ణా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఆ వ్యసన తీవ్రతను క్రమక్రమంగా తగ్గిస్తూ రావాలి. ఒక కాలపరిమితిని మీరే నిర్ధారణ చేసుకుని, ఇక ఆనాటి నుంచి సంపూర్ణంగా మానేయాలి. మీ పిల్లల్ని, కొంతమంది శ్రేయోభిలాషులను, మిత్రుల్ని మీపై పర్యవేక్షకులుగా మీరే నియమించుకుని వారి మాటను శిరసావహించాలి. క్రమశిక్షణ అనేది కేవలం ఇంటిదగ్గర, డాక్టరుగారి ముందు మాత్రమే కాకుండా మిగతా వాతావరణంలోనూ స్వచ్ఛందంగా పాటించడమే గొప్పదనం. ఇలాంటి దురలవాట్లు మానేసే ప్రక్రియలో అదే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇది అలవరచుకుంటూ ఈ కింది సూచనలు పాటిస్తే మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. క్షమత్వం పెరిగి, మానసిక శక్తి కూడా పరిపుష్టమౌతుంది.
ఆహారం: ఉప్పు, నూనెలు గణనీయంగా తగ్గించండి. ఇంటి తిండికి మాత్రమే పరిమితమవ్వండి. పీచుపదార్థాలు, పోషకవిలువలు ఉన్న శాకపాకాలు, తాజా ఫలాలు, శుష్కఫలాలు( డ్రై ఫ్రూట్స్) తీసుకోవాలి. ద్రవాహారం బాగా సేవించాలి. ఆవుపాలు తాగితే మంచిది.
విహారం: ఆహారం, నిద్ర, విశ్రాంతి తగినంత ఉండాలి. వ్యాయామం, ప్రాణాయామం నిత్యం ఆచరించాలి.
ఔషధం: అణుతైలం: దీన్ని ఒక్కొక్క ముక్కు రంధ్రంలో ఒక్కొక్క చుక్క చొప్పున రెండుపూటలా వేసుకోవాలి.
యష్టిమధు (మాత్రలు) : ఉదయం ఒకటి, రాత్రి ఒకటి
అశ్వగంధ (లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి.
గమనిక: వయసుని బట్టి వచ్చే మధుమేహం, అధికరక్తపోటు లేదా మరి ఏ ఇతర వ్యాధులేమైనా ఉన్నాయో లేదో చూసుకుని, ఒకవేళ ఉంటే వాటిని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
హుమయున్ నగర్, హైదరాబాద్