హృతిక్ ఈజ్ రోషన్ | hrithik roshan special on he's next movie 'kabil' | Sakshi
Sakshi News home page

హృతిక్ ఈజ్ రోషన్

Published Sun, Oct 23 2016 12:30 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

హృతిక్ ఈజ్ రోషన్ - Sakshi

హృతిక్ ఈజ్ రోషన్

‘కహో నా ప్యార్ హై ’తో మొదలుపెట్టాడు. అంటే... ‘నన్ను ప్రేమిస్తున్నానని చెప్పవా’ అని ఈ సినిమాతో అడిగాడు ఒకరా... ఇద్దరా... కోకొల్లలు ప్రేమించే అభిమానులు ఎందరో! ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడే హృతిక్‌లో ఎంత రోషన్ ఉందో... ఆ రోషన్ కోసం ఎంతమంది పడి చస్తున్నారో అర్థమైంది. రియల్లీ హృతిక్ ఈజ్ రోషన్.. ప్రేమకే వెలుగు చూపించినవాడు ఇతనేనేమో! కెహ్ దియా ప్యార్ హై..  అవును... నిన్ను ప్రేమిస్తున్నాం!

మీ నాన్నగారు రాకేష్ రోషన్‌కి ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో మంచి అనుబంధం ఉండేది కాబట్టి, తెలుగు సినిమాల గురించి మీతో చెబుతుంటారా?
మా నాన్నగారు మూవీ లవర్. ఎక్కడ టాలెంటెడ్ ఆర్టిస్టులున్నా వాళ్ల గురించి నాతో చెబుతుంటారు. సౌత్ మూవీస్ టెక్నికల్‌గా బాగుంటాయని నాన్నగారు అంటారు. నాది కూడా సేమ్ ఓపీనియనే. నేను అప్పుడప్పుడూ సౌత్ మూవీస్ చూస్తుంటాను.

ఇక్కడ హైదరాబాద్‌లో మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా?
రానా మంచి ఫ్రెండ్. తను చాలా ఎనర్జిటిక్. మేం కలిస్తే సందడి సందడిగా ఉంటుంది. రానా ఆకారమే కాదు.. హార్ట్ కూడా పెద్దదే. చాలా మంచివాడు. పింకీరెడ్డి కూడా మంచి ఫ్రెండే. నా చిన్నప్పుడు స్కూల్ సెలవుల్లో హైదరాబాద్ వచ్చేవాళ్లం. పింకీరెడ్డి వాళ్ల ఇంట్లో కూడా ఉండేవాణ్ణి. ఇప్పుడు కూడా ఏదైనా పని మీద హైదరాబాద్ వస్తే, పింకీరెడ్డి వాళ్లను కలుస్తుంటాను. ఇంకా ఇక్కడ చాలామంది స్నేహితులు ఉన్నారు.

సౌత్‌లో సీనియర్ ఆర్టిస్టుల్లో మీకు ఎవరితోనైనా పరిచయం ఉందా?
రజనీకాంత్ సార్‌తో పరిచయం ఉంది. చిన్నప్పుడు నేను కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాను. వాటిలో రజనీ సార్ నటించిన హిందీ చిత్రం ‘భగవాన్ దాదా’ ఒకటి. మా నాన్నగారే ప్రొడ్యూసర్. ఆయన యాక్ట్ చేశారు కూడా. రజనీ సార్ ఎంత మంచి మనిషంటే మా ఇద్దరి కాంబినేషన్‌లో సీన్స్ తీస్తున్నప్పుడు నేను టేక్స్ మీద టేక్స్ తీసుకునేవాణ్ణి. కానీ, రజనీ సార్ నేను భయపడతానని తనే తప్పు చేసినట్లు కలరింగ్ ఇచ్చేవారు. ‘హౌ ఫెంటాస్టిక్’ కదా. ఆ సినిమా నాకు మంచి మెమరీ.

చిన్నప్పుడు మాట్లాడటానికి తడబడిపోయేవారట.?
ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటలు సరిగ్గా వచ్చేవి కావు. కంగారు, తడబాటు. ఎగ్జామ్స్ రాయడం ఇబ్బంది అనిపించేది కాదు కానీ, ఓరల్ టెస్ట్‌లంటే భయం ఉండేది. స్కూల్ ఎగ్గొట్టడం కోసం కడుపు నొప్పనో, ఏదైనా దెబ్బ తగిలించుకోవడమో.. ఇలా ఏదోకటి చేసేవాణ్ణి. అమ్మా నాన్న గ్రహించి, ‘స్పీచ్ థెరపీ’ ప్రాక్టీస్ చేయించారు. అది హెల్ప్ అయింది.

పర్సనల్, ప్రొషెషనల్‌గా మీ టైమ్ ఎలా ఉందనుకుంటున్నారు... మీ భార్య సుజానే నుంచి విడిపోవడం, కంగనాతో వివాదం...?
పర్సనల్ విషయాలు మాట్లాడనండి. జరిగేవి జరగకుండా మానవు. ‘ఇలా జరిగిందేంటి? మన టైమ్ బ్యాడేమో’ అని ఎనలైజ్ చేసుకుని బాధపడితే జరిగినవన్నీ మాయమైపోతాయా? జరిగేవన్నీ జరగకుండా ఆగుతాయా? అందుకే జీవితం ఎలా వెళుతోంది? మనం ఎటు వెళుతున్నాం? అని అదే పనిగా ఆలోచించి, టైమ్ వేస్ట్ చేసుకోకూడదు.

మరి.. సినిమా సినిమాకీ ఎక్కువ గ్యాప్ తీసుకుని టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు?
కావాలని వేస్ట్ చేస్తానా? ఈ మధ్య ‘మొహెంజొదారో’ సినిమా చేశాను. దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ ఆ సినిమాని వంద రోజుల్లో పూర్తి చేస్తానని, రెండొందల రోజులు తీసుకున్నాడు. ఏం చేయమంటారు? డెరైక్టర్ చెప్పింది చేయాలి కదా.

ఓకే... మీరు చాలా హైట్ కాబట్టి స్కూల్లో మీరే లాస్ట్ బెంచేమో?
ఫస్ట్ బెంచ్‌లోనే కూర్చునేవాణ్ణి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పొట్టిగా ఉండేవాణ్ణి. నా వయసు పిల్లలందరూ నాకంటే కొంచెం హైట్‌గా ఉండేవారు. దాంతో మా నాన్నగారు బాధపడిపోయేవారు. చెక్కతో దూలాన్ని తయారు చేయించి ఉదయం, సాయంత్రం దాన్ని పట్టుకుని వేలాడమనేవారు. నేను వేలాడుతున్నానా? లేదా? అని మాటి మాటికీ చెక్ చేసేవారు. 17 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను బాగా హైట్ అయ్యాను.
నాలుగైదేళ్లుగా ప్రపంచంలోనే సెక్సీయస్ట్ ఏషియన్ మెన్‌లో మీ పేరు మిస్ కాకపోవడం ఎలా అనిపిస్తోంది?
సెక్సీయస్ట్ మేన్ అనిపించుకున్నందుకు నేను లక్కీ కాదు. ఆ దేవుడు నాకో అందమైన లోపం ఇచ్చాడు (కుడి చేతికున్న ఆరు వేళ్లను ఉద్దే శిస్తూ). మన లోపాలు మనల్ని బలవంతుల్ని చేస్తాయి. ఆరు వేళ్లతో నా చెయ్యి పర్ఫెక్ట్‌గా ఉండదు. అది ‘బ్యూటిఫుల్ ఇన్‌పర్ఫెక్ట్’. అందుకే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి.

అలా వేలాడడటం వల్లే హైట్ పెరిగానంటారా?
అయ్యో అలా అనడం లేదు. హైట్ తక్కువగా ఉన్నవాళ్లందరూ వేలాడాలని అనుకుంటారేమో. అలా చేయొద్దు.

ఇక్కడ బాగా ఎత్తుగా, హ్యాండ్‌సమ్‌గా ఉన్నవాళ్లను ‘తెలుగు హృతిక్ రోషన్’ అంటుంటారు. మీ ఫీలింగ్?
ఓహ్. వినడానికి చాలా బాగుంది. హిందీ ప్రేక్షకులు అభిమానం కనబర్చడం సహజం. తెలుగు ప్రేక్షకులకూ దగ్గర కాగలిగానంటే లక్కీ.

మీలా ఆరు వేళ్లు ఉన్నవాళ్లు లక్కీ అట కదా?
లక్ అనుకుంటే లక్. బ్యాడ్ లక్ అనుకుంటే బ్యాడ్ లక్. ఏదైనా మనం అనుకోవడం బట్టే ఉంటుంది.

హ్యాండ్‌సమ్ అని మీ గురించి కాంప్లిమెంట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది?
కాంప్లిమెంట్స్ చాలా డేంజరస్. కొంతమంది మనం అందంగా లేకపోయినా ఉన్నామంటారు. ఉన్నా.. లేమంటారు. వీటిని మనసుకి తీసుకోకూడదు. అభినందనల వల్ల అహం వచ్చే అవకాశం ఉంది. విమర్శించా రని బాధపడితే ఇన్‌ఫీరియార్టీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది. అందుకే మన గురించి మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఒకవేళ మన నడవడిక గురించి ఏమైనా కామెంట్ చేశారనుకోండి.. అప్పుడు మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి.

మీ ఇద్దరి పిల్లలు రెహాన్, రిదాన్‌లతో ఎప్పుడూ హాలిడే ట్రిప్స్ వెళుతుంటారు. గుడ్ డాడ్ అన్న మాట?
నా పిల్లల గురించి చెప్పే ముందు మా నాన్నగారి గురించి చెబుతా. ఆ దేవుడు మంచి తండ్రి ని ఇచ్చాడు. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా మా నాన్నగారు నాకు కొండంత అండగా ఉంటారు. నేను నా పిల్లలకు అంత మంచి డాడ్‌గా ఉండాలనుకుంటున్నాను. మా ముగ్గురికీ ట్రావెల్ చేయడం అంటే ఇష్టం. ఎక్కువగా విదేశాలు వెళతాం. పిల్లలతో స్పెండ్ చేసినప్పుడు నాకు మరో ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది చాలా అందమైన ప్రపంచం. అన్నిటికన్నా నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చే ప్రపంచం అది.

మీ సినిమాలు చూసి మీ పిల్లలు ఏమంటారు?
‘సినిమా బాగుంది.. బాగా యాక్ట్ చేశావ్’ అని వాళ్లు అంటే, ఆనందపడిపోతా. పిల్లల అభినందనలు ఆస్కార్ అవార్డు కన్నా గొప్పవి. అయితే నా ఆనందం కోసం అభినందనలు చెప్పాలని నా పిల్లలు అనుకోరు. ఒకవేళ నచ్చకపోతే ఆ విషయాన్ని మొహం మీదే చెప్పేస్తారు.

ఫైనల్లీ... లైఫ్ ఎలా ఉంది?
నో కంప్లైంట్స్.. బాగుంది. 
- డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement