ఓ గాడ్!
హ్యూమర్ ప్లస్
మనిషి సుఖాలు కోరుకుంటాడు. దేవుడు కష్టాలు ఇస్తాడు. దేవుడు సుఖాలు ఇచ్చినప్పుడు మనిషి కోరి కష్టాలు తెచ్చుకుంటాడు. మా మిత్రుడు ఒకాయన యూట్యూబ్ చూసి యోగాసనాలు వేశాడు. తరువాత టైరు, ట్యూబు రెండూ పగిలాయి. పద్మాసనమే పద్మవ్యూహం అయింది. వేశాడు కానీ విడిపించుకోలేకపోయాడు. పాము చుట్టలా ఉన్న ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు. జబ్బుని బట్టి డబ్బు పాత మాట. డబ్బును బట్టి జబ్బు. చేతికి సెలైన్, ముక్కుకి ఆక్సిజన్, సుగర్‌కి ఇన్సులిన్, పిర్రకి పెన్సిలిన్ ఇచ్చి చాంతాడంత ప్రిస్కిప్షన్ ఇచ్చారు. బిల్లు చూసేసరికి ఆసనం దానంతట అదే విడిపోయింది. ‘ఆసం’ అని కుటుంబ సభ్యులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. అన్ని చప్పట్లూ అభినంద నలు కాదు. దోమలు పాడుతున్నప్పుడు కూడా చప్పట్లు కొడతాం.
పాటగాళ్లతో వచ్చిన ఇబ్బందేమంటే తమది పాటో, పోటో తెలుసుకోలేదు. సరిగమలు నేర్చుకోవడం సులభమే. సరిగా పాడడమే కష్టం. ఒకాయన పాటతో కష్టాలు తెచ్చుకున్నాడు. బాగా పాడుతున్నానని ఆయన అనుకున్నాడు. జనం అనుకోలేదు. కోడిగుడ్లతో కొట్టారు. మొహం ఆమ్లేట్ ఆయింది. నాన్‌వెజ్‌ని నాన్‌స్టాప్‌గా ద్వేషించే వాళ్లావిడ ఇదే అదనుగా విడాకులిచ్చేసింది. మిడిగుడ్లేసుకుని మన వాడు గుడ్డు శాకమేనని వాదించినా శోకమే మిగిలింది.
విడాకుల వల్ల మగవాళ్లకి మనశ్శాంతి, ఆడవాళ్లకి గృహశాంతి కలుగుతాయని ఒకాయన ఫిలాసఫీ. దీన్ని నిరూపించడానికి ఆయన అనేకసార్లు వెళ్లిళ్లు చేసుకుని వాటిని పెటాకులు చేసి విడాకుల వరకు వెళ్లాడు. స్త్రీలకు స్వేచ్ఛ ఉండాల్సిందే కానీ అది మగవాళ్ల బానిసత్వానికి దారి తీయకూడదని, బానిస యుగం అంతరించిపోవడం ఒక భ్రాంతి మాత్రమేనని ఇరవై రెండు చాప్టర్లతో ఒక బుక్ రాశాడు. ఫెమినిస్టులు ధర్నా, దాడి చేసి తరువాత నినాదాలతో చావగొట్టి చెవులు మూశారు. దాంతో అతని చాప్టర్ క్లోజ్ అయింది. నిజం నిష్టూరమైందని, ఫెమినిజం అంతకు మించి నిష్టూరమైందని అతను గొణిగాడు కానీ, ఇంకా ఎవరికీ వినిపించలేదు. గోడలకి చెవుల కాలం పోయి, చెవులకే గోడల కాలం వచ్చింది.
చిన్నప్పుడు కాలం, దూరం లెక్కలు చదువుకుంటాం కానీ, మారుతున్న కాలం ఎన్నటికీ అర్థం కాదు. ఒకే ఆఫీస్‌లో పని చేస్తున్నవాళ్ల మధ్య వందల కిలోమీటర్ల దూరముంటుంది. ఒకే ఇంట్లో వున్నవాళ్లు రెండు వేర్వేరు ప్రపంచాల్లో జీవిస్తుంటారు. ఎవరి లోకం వాళ్లది. ఎవరి సిద్ధాంతం వాళ్లది. వేదం కంటే ఆయుర్వేదం గొప్పదని ఒకాయన నమ్మి సుగర్ కంట్రోల్ కోసం కనిపించిన ప్రతి ఆకునీ మేక నమిలినట్టు నమిలాడు. ఆకులు మేకులై పేగుల్ని చుట్టుకున్నాయి. సుగర్ సంగతేమో కానీ కడుపులో గరగరమని సౌండ్స్ మొదలయ్యాయి. ఎక్కడ కూచున్నా కడుపు చెడిపోయిన రేడియోలా అరవసాగింది. ఆ ధ్వనికి మొదట ఆయన భార్య, తర్వాత చుట్టుపక్కల వాళ్లు పారిపోయారు. ఆకులో ఆకునై అని పాడుకుంటూ ఎక్కడో ఆయన తిరుగుతున్నాడు. లోకాన్ని మార్చడం ఈజీ. మనల్ని మార్చుకోవడమే కష్టం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా మారిన తర్వాత జ్ఞానం రావడం. ఈ మధ్య కృష్ణానరగర్‌లో ఒక ఆత్మ కనిపించింది. బతికున్నంత కాలం సినిమాల్లో యాక్ట్ చేయాలని ప్రయత్నించిందట. చివరికో వేషం వచ్చింది. శవంగా నటించాలి. సంతోషంలో పాత్రలో జీవించే సరికి ఆత్మగా మారాల్సి వచ్చింది. సినిమాలకి పని చేస్తున్న వాళ్లలో ఎవరు మనుషులో, ఎవరు దెయ్యాలో అర్థం కావడం లేదట. అందుకే సినిమాలు చచ్చినా బాగుపడవని చెప్పింది. దేవుణ్ణి మనం కోరుకోవలసింది ఏమంటే బతికే తెలివితేటలు ఎలాగూ ఇవ్వడు. చావు తెలివితేటలు ఇవ్వకపోతే అదే పదివేలు.
- జి.ఆర్.మహర్షి