హోమియో కౌన్సెలింగ్
నా వయసు 23. ఇటీవల తీవ్రమైన పార్శ్వపు నొప్పి వస్తోంది. దీనికి హోమియోలో చికిత్స సూచించండి.
- మహేశ్వరి, నిర్మల్
పార్శ్వపునొప్పి ఒక దీర్ఘకాలికమైన నరాలకు సంబంధించిన వ్యాధి. తలలో ఒకవైపు నొప్పి రావడం ఈ వ్యాధికి సంబంధించిన సాధారణ లక్షణం. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వికారం, ఒక్కోసారి వాంతులు, వెలుతురునూ, శబ్దాలను భరించలేకపోవడం మరికొన్ని లక్షణాలు. శారీరక శ్రమతో తలనొప్పి పెరుగుతుంది. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రించడం వల్ల నొప్పి నుంచి కొంత ఉపశమనం ఉంటుంది.
పార్శ్వపునొప్పికి కచ్చితమైన కారణాల నిర్ధారణ జరగలేదు. అయితే కొన్ని అంశాలు ఈ నొప్పికి దారితీయవచ్చు. జన్యుపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి వంటివి ముఖ్యమైన కారణాలుగా భావించవచ్చు. అయితే ప్రత్యేక కారణాల నిర్ధారణ జరగనప్పటికీ నొప్పిని తీవ్రతరం చేసే అంశాలు ఉంటాయి. వీటిని ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి నొప్పిని ప్రేరేపించవచ్చు. అవి... విపరీతమైన ఆకలి, నీరసం, శారీరక శ్రమ, మహిళలల్లో హార్మోన్ హెచ్చుతగ్గులు, రుతుక్రమం, కుటుంబ నియంత్రణ మందులు వాడటం మొదలైనవి. నొప్పి ప్రారంభం కాబోయే ముందు కొన్ని దశలు కనిపిస్తాయి. అవి...
1. ప్రోడ్రోమల్ స్టేజ్: ఇది నొప్పి ఆరంభం కావడానికి రెండు రోజుల ముందు నుంచి రెండు గంటల ముందు కనిపిస్తుంది. మానసిక ఆందోళన, చిరాకు, కోపం, ప్రత్యేకమైన ఆహారంపట్ల పెరిగే ఇష్టం, కండరం బిగబట్టడం (ముఖ్యంగా మెడ కండరాలు), మలబద్దకం లేదా విరేచనాలు వంటి లక్షణాలు ఈ దశలో కనిపిస్తాయి. 2. ఆరా స్టేజ్: చూపు మసగ్గా ఉండటం, చేయి లేదా భుజం దగ్గర పొడిచినట్లుగా ఉండటం వంటి లక్షణాలు ఈ దశలో ఉంటాయి. 3. నొప్పి దశ: తలలోని ఏదో ఒక పక్క నుంచి నొప్పి ఆరంభమవుతుంది. క్రమేణా తీవ్రమవుతుంది. సాధారణంగా ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. వికారంతో కూడిన వాంతులు, కాంతిని భరించలేకపోవడం, శబ్దాలను తట్టులేకపోవడం వంటి లక్షణాలు ఉండి, చికటి గదిలో విశ్రాంతి తీసుకోవడం వల్ల తలనొప్పి కొంత తగ్గవచ్చు. 4. పోస్ట్ డ్రోమ్ దశ: తలనొప్పి తీవ్రత తగ్గిన తర్వాత ఉండే స్థితి ఇది. దీనిలో నీరసం, జీర్ణాశయ సంబంధ సమస్యలు, మానసిక అలజడి తదితర లక్షణాలు కనబడతాయి.
హోమియో విధానంలో పార్శ్వపునొప్పికి చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. బెల్లడోనా, నక్స్‌వామికా, సాంగ్యునేరియా, ఐరస్ వెరిసికోలర్ లాంటి చాలా రకాల మందులు సమర్థంగా పనిచేస్తాయి.
డాక్టర్ టి. కిరణ్ కుమార్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. ఇటీవల మెడ నొప్పి వస్తూ, అది చేతికి పాకుతుంటే డాక్టర్‌ను సంప్రదించాను. మెడలోని వెన్నుపూసలు చేతికి వెళ్లే నరాలను నొక్కడం వల్ల ఇలా జరుగుతోందని చెప్పారు. ఫిజియోథెరపీతో పాటు ఇంటర్‌ఫెరిన్షియల్ థెరపీ తీసుకొమ్మని సూచించారు. ఫిజియోథెరపీ, ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీలో అవలంబించే ప్రక్రియల గురించి వివరించండి.
- జీవన్, హైదరాబాద్
మీ మెడలోని వెన్నుపూసలు చేతికి వెళ్లే నరాన్ని మూలం (రాడికిల్)లో నొక్కుతున్నందు వల్ల మీ మెడలోనూ, చేతిలోనూ నొప్పి వస్తోంది. ఫిజియోథెరపిస్టులు చేయించే కొన్ని రకాల వ్యాయామాల వల్ల మెడ కండరాలు బలంగా రూపొందుతాయి. మెడ కండరాలను బలంగా అయ్యేలా చేసే ఈ వ్యాయామాల వల్ల తల భారమంతా వెన్నుపూసలపై పడకుండా చేయవచ్చు. ఆ భారాన్ని వెన్నుపూసలకు బదులు, మెడకండరాలు తీసుకోవడం వల్ల నరం నొక్కుకుపోవడం కూడా తగ్గుతుంది. దీంతోపాటు మెడ కండరాలపై అసమతౌల్యమైన రీతిలో భారం పడకుండా ఉంచుకోవడం ఎలాగో, సరైన పోశ్చర్ ఏమిటో కూడా ఫిజియోథెరపిస్టులు చెబుతారు. అంటే కంప్యూటర్ చూస్తున్నప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మెడను నిటారుగా ఉంచకుండా... ఒకపక్కకు వంచడం వంటివి చేయ ఒత్తిడి పడకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలను వివరిస్తారు. ఇక ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీ (ఐఎఫ్‌టీ)లో ఒకరకమైన విద్యుత్‌తరంగాలను ఉపయోగించి నొప్పి నివారణ జరిగేలా చూస్తారు. అయితే ఒంటిపై గాయం, పుండు ఉన్నవాళ్లకు ఈ చికిత్స చేయరు. ఇక అల్ట్రాసోనిక్ థెరపీలో శబ్దతరంగాలను ఉపయోగించి నొప్పి నివారణ జరిగేలా చూస్తారు. వాటితో పాటు మెడపైన వేడి నీటి కాపడం, ఐస్ కాపడం (హాట్ ప్యాక్, కోల్డ్ ప్యాక్) వంటి ప్రక్రియలను కూడా ఫిజియోథెరపిస్ట్‌లు అనుసరిస్తూ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తారు.
ఎన్. మేరీ
ఫిజియోథెరపిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్
డర్మడాలజీ కౌన్సెలింగ్
నా వయసు 33 ఏళ్లు. రెండు రోజుల క్రితం పొరపాటున వేడిగా ఉన్న పాత్రను చేత్తో పట్టుకున్నాను. వేడిగా ఉందని చూసుకోకపోవడంతో బాగా కాలాయి. బొబ్బలు కూడా వచ్చాయి. అప్పుడు వాటిపై మచ్చలు పడతాయని ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
- సురేఖ, తెనాలి
మీ అరచేతుల్లో బొబ్బలు వచ్చాయంటే ఆ తీవ్రత సెకండ్ డిగ్రీ బర్న్స్‌ను సూచిస్తోంది. ఒకవేళ ఈ బొబ్బలు చాలా పెద్దవిగా ఉంటే మీరు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలిసి, క్రమం తప్పకుండా డ్రస్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు మూడు రోజుల పాటు అజిథ్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇక గాయాలపై రోజుకు రెండుసార్లు మ్యూపిరోసిన్ అనే యాంటీబయాటిక్ పూతమందు వాడాలి. ఇది వారంరోజుల పాటు పూయాల్సి ఉంటుంది. మీ బొబ్బలు ఆ తర్వాత మచ్చలుగా మారకుండా ఉండాలంటే సిల్వర్ సల్ఫాడైజీన్‌తో పాటు మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ వాడాల్సి ఉంటుంది. గాయం మానిన తర్వాత కూడా మచ్చలు వస్తే క్లిగ్‌మాన్స్ రెజీమ్ వంటి స్కిన్ లెటైనింగ్ క్రీమ్స్‌ను రెండుమూడు వారాలపాటు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్, నికోటినమైడ్ వంటివి ఉన్న నాన్‌స్టెరాయిడ్ క్రీమ్స్ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మచ్చలు వస్తే ఫ్రాక్షనల్ లేజర్ లేదా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది.
నా వయసు 40 ఏళ్లు. నా కుడిచెంప మీద మూడువారాల క్రితం ఒక మొటిమ వచ్చింది. దాన్ని చిదిమేయడానికి ప్రయత్నించాను. అప్పట్నుంచి దాని పరిమాణం పెరిగి నల్ల మచ్చలా మారిపోయింది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- రాంబాబు, హైదరాబాద్
మీరు చెప్పిన లక్షణాలను బట్టి అది ‘యాక్నే వల్గారిస్’అలా అనిపిస్తోంది. దాన్ని గిల్లకండి. అలా చేస్తే ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు కొన్నిరోజులు అజిథ్రోమైసిన్ 500 ఎంజీ వంటి యాంటీబయాటిక్ మాత్రలను మూడురోజులకు ఒకసారి చొప్పున మూడు వారాల పాటు వాడాలి. అలాగే క్లిండామైసిన్, అడాపలిన్ కాంబినేషన్ ఉండే జెల్‌ను రోజూ రాత్రివేళ మొటిమపై రాయండి. ఎస్‌పీఎఫ్ 40 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌లోషన్‌ను ప్రతి మూడు గంటలకోసారి చొప్పున ప్రతిరోజూ ముఖంపై రాసుకోండి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్,
త్వచ స్కిన్ క్లినిక్,
గచ్చిబౌలి,
హైదరాబాద్
మెడనొప్పి చేతికి పాకుతూ ఉంటే..?
Published Tue, Nov 24 2015 10:28 PM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM
Advertisement
Advertisement