ఆత్మహత్యల్లో మగాడు...
రిపోర్ట్
సంపాదించాల్సిన బాధ్యత ఒకవైపు... సంపాదించే క్రమంలో ఎదురయ్యే ఒత్తిళ్లు మరోవైపు... మగాళ్లు ఎంతటి మొండిఘటాలైనా నిరంతర నరక యాతనను తట్టుకునే శక్తిని ఏదో ఒక దశలో కోల్పోతారు. ప్రేమ వ్యవహారాలు విఫలమైన సందర్భాల్లోనైనా కొంతలో కొంత తట్టుకోగలరు గానీ, సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు తలెత్తితే మాత్రం మగాళ్లు ఏమాత్రం జీర్ణించుకోలేరు. నిరసనను, నిరాదరణను, నిరాకరణను తట్టుకోలేని సున్నిత మనస్తత్వం మగాళ్లది. బాధలను పంచుకుంటే మనసు తేలికపడుతుందని అంటారు. మగాళ్లకు బాధలేం ఉంటాయని ప్రశ్నించే సమాజంలో మగాళ్లు తమ బాధలను ఎవరితో పంచుకోగలరు? గుండె బరువును ఎలా దించుకోగలరు? విజయపథంలో దూసుకుపోయే పుణ్యపురుషులకు అందరూ జేజేలు పలుకుతారు. వారి వెన్నంటే ఉంటూ భజనలు చేస్తారు. జీవన వైఫల్యాలతో కుమిలిపోయే సగటు మగాళ్లను ఒక్కరైనా పలకరించరు.
కనీసం పలకరించే దిక్కయినా లేని వాళ్లు దిగులుతో కుంగి కృశించిపోతారు. ఇక బతకడమే దండగని తీర్మానించేసుకుంటారు. ఎవరికీ చెప్పాపెట్టకుండా అర్ధంతరంగా లోకానికి రాజీనామా చేసేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల గణాంకాలను పరిశీలిస్తే, ఈ సంగతి తేటతెల్లమవుతుంది. ఆత్మహత్యలు చేసుకునే వారిలో మహిళల కంటే మగాళ్ల సంఖ్య దాదాపు రెట్టింపు ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, సింగపూర్‌లో 2010 నాటి లెక్కల ప్రకారం 126 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, అదే ఏడాది అక్కడ 227 మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా వరకు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉందని విశ్లేషకుల కథనం.