వనరుల వినియోగంలో స్వావలంబన, ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలన్నది గాంధీజీ ‘గ్రామస్వరాజ్య’ భావన మూల సూత్రం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన శాశ్వత వ్యవసాయం(పర్మాకల్చర్) మూలసూత్రాలు కూడా గాంధీజీ భావనకు దగ్గరగా ఉన్నాయి. ఈ నెల 25–26 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ పర్మాకల్చర్ సమ్మేళనం(ఐ.పి.సి–2017) జరగనుంది.
ఈ పూర్వ రంగంలో అసలు ‘శాశ్వత వ్యవసాయం’ అంటే ఏమిటో.. ఈ అవగాహనతో సాగయ్యే పొలం ఎలా ఉంటుందో.. మనందరికీ తిండిపెడుతున్న చిన్న, సన్నకారు రైతుల బతుకులను ఆకుపచ్చగా మార్చడానికి ఈ చైతన్యం ఎలా దోహదపడుతుందో తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.
పర్మాకల్చర్ నిపుణులు కొప్పుల నరసన్న, పద్మ దంపతులు అంతర్జాతీయ పర్మాకల్చర్ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ(హైదరాబాద్)ను స్థాపించి అనేక జిల్లాల్లో రైతులతో పనిచేస్తున్న వీరు తమ పర్మాకల్చర్ డిజైన్ ప్రకారం నెలకొల్పిన వ్యవసాయ క్షేత్రంలో బహుళ పంటలను పండిస్తున్నారు. వీరితో ఇటీవల ‘సాగుబడి’ ముచ్చటించింది.. ఆ విశేషాలు..
వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించిన కొప్పుల నరసన్న, పునాటి పద్మ తొలి దశలో జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీలో రిసోర్స్‌పర్సన్లుగా ఉంటూ రైతులతో పదేళ్లకు పైగా పనిచేశారు. ఆస్ట్రేలియాకు చెందిన బిల్ మాలిసన్ పర్మాకల్చర్ భావనకు, ఆచరణకు పునాదులు వేశారు. ఆయన అనేకసార్లు మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పర్యటించి పర్మాకల్చర్ భావనను చిన్న, సన్నకారు రైతుల కమతాలకు అనుసంధానం చేయటంపై ఆచరణాత్మక ప్రయోగాలు చేశారు. బిల్ భావాలతో ప్రభావితులైన అరోరా, డాక్టర్ వెంకట్ వంటి ఆధ్వర్యంలో పర్మాకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.
వారి సాంగత్యంలో శాశ్వత వ్యవసాయాన్ని ఔపోశన పట్టిన నరసన్న, పద్మ అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేసి స్థానిక రైతాంగంలో పర్మాకల్చర్ వ్యాప్తి కృషికి శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం సమీపంలో 1999లో 11.5 ఎకరాలను కొనుగోలు చేసి ‘అరణ్య’ శాశ్వత వ్యవసాయ క్షేత్రాన్ని నెలకొల్పారు. తొలి దశలో టేకు సహా అనేక స్థానిక అటవీ జాతుల చెట్లతోపాటు పండ్లు, కలప జాతుల చెట్లను పెంచుతూ వచ్చారు. శాశ్వత వ్యవసాయ పద్ధతికి ప్రతిరూపంగా గత మూడేళ్లుగా కూరగాయలు, వార్షిక పంటల సాగును ప్రారంభించారు. శాశ్వత వ్యవసాయ పద్ధతిని అమలు చేసే పొలం ఎలా ఉంటుందో ఈ క్షేత్రాన్ని చూసి తెలుసుకోవచ్చు.
పంటల వైవిధ్యంతో స్వయం పోషకత్వం
ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవటంతోపాటు ప్రత్యేక డిజైన్‌ను రూపొందించుకొని, అమలు చేయటం, పంటల జీవవైవిధ్యం ద్వారా స్వయం పోషకత్వాన్ని సాధించటం పర్మాకల్చర్ మూల సూత్రాల్లో ముఖ్యమైనది. భూసారం పెంపుదల, వాన నీటి సంరక్షణ, పెనుగాలులు, వడగాడ్పుల బారి నుంచి పంటలను, కోతకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవటం, కాంటూరు కందకాలు తీయటం, 12 రకాల అటవీ జాతి చెట్లను పొలం దక్షిణ సరిహద్దులో 6 మీటర్ల వెడల్పున పెంచటం.. గడ్డీ గాదాన్ని, ఆకులు అలములను కాల్చివేయకుండా కంపోస్టు తయారీకి వినియోగించటం.. ఇవన్నీ పర్మాకల్చర్ క్షేత్రానికి ఉండే లక్షణాలు.
అడుగు నేలలో ‘అరణ్య’ సేద్యం
అరణ్య క్షేత్రం దక్కను పీఠభూమిలో లేటరైట్ (ఎర్ర) నేలలో ఉంది. మట్టి 8–12 అంగుళాల లోతు మాత్రమే ఉంది. అడుగున అంతా లేటరైట్ రాయి ఉండటంతో ఈ పొలంలో పంటల సాగు సవాళ్లతో కూడుకొని ఉంది. డిజైన్ ప్రకారం అనేక జోన్లుగా విభజించి.. ఏడాది పొడవునా సీజనల్ పండ్లు, కూరగాయలతోపాటు ఖరీఫ్, రబీ పంటలను పండిస్తున్నారు. స్నానపు గదులు, వంటకు వాడిన నీటిని వృథా పోనీయకుండా వృత్తాలుగా అనేక రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. వృత్తం వల్ల గాలుల తీవ్రతను తట్టుకోవటం సులువవుతుంది. మట్టి కోతకు గురికావటం తగ్గుతుంది. గాడ్పులు, పెనుగాలులకు చెట్లు పడిపోకుండా సర్కిల్స్ ఉపయోగపడతాయని నరసన్న చెప్పారు.
కాంటూరు బోదెలపై కూరగాయలు
కూరగాయల విభాగంలో కాంటూరు ప్రకారం ఎస్ ఆకారంలో బోదెలు తోలి అనేక రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు. డ్రిప్‌తో బోరు నీటిని తగుమాత్రంగా అందిస్తున్నారు. బొప్పాయి, మోరింగ, అవిశ, టేకు, ఆముదం, దోస, బెండ, టమాటా, చెర్రీ టమాటా, బీర, చిక్కుడు, కాకర, గోంగూర, మెంతి, చుక్కకూర, కొత్తిమీర, మిరప, బంతి తదితర మొక్కలన్నీ బోదెలపై నాటారు. వీటిని నాటటం/విత్తటం దశల వారీగా చేయటం వల్ల ఏడాది పొడవునా అనుదినం కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటున్నాయని నరసన్న, పద్మ వివరించారు..
కాంటూరు బోదెలను ఎస్ ఆకారంలో ఏర్పాటు చేయటం వల్ల ఎండ, గాలి, నీరు వంటి ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి వీలవుతుంది. కూరగాయల విభాగంలో ఆముదం, బంతి మొక్కలను అక్కడక్కడా వేయటం వల్ల ఎత్తు తక్కువ మొక్కలకు నీడ దొరకటంతోపాటు పురుగులను ఆకర్షించటం ద్వారా పంటలకు నష్టం లేకుండా చూడటం సాధ్యమవుతుంది. ఇటువంటి ఎర పంటలు వేయటం ద్వారా పురుగులకు కావాల్సిన ఆహారం పెడితే అవి పంటల జోలికి రాకుండా ఉంటాయి.
ఆకుకూరల ఒరుగులు!
‘అరణ్య’ శాశ్వత వ్యవసాయ క్షేత్రంలో శనగ, కుసుమ మొక్కలను కలిపి ఆకుకూరలుగా సాగు చేయటం, ఈ రెండు రకాల ఆకులను కలిపి వండుకు తినటం విశేషం. అంతేకాదు, గోంగూర, తోటకూర, శనగ, మెంతికూరలను కోసి నీడలో ఎండబెట్టి ఆకుకూరల ఒరుగులు చేసి దాచుకొని, తదనంతరం వంటల్లో వేసుకుంటున్నారు. వీటిని బంధుమిత్రులకూ పంపుతున్నారు. టమాటా, వంగ, బొప్పాయి, ఉల్లి, వెల్లుల్లి వంటి పంటల్లో గడ్డీ గాదంతో ఆచ్ఛాదన మొదటి నుంచీ అవసరమే.
నెలా నెలన్నరలో కోసేసే ఆకుకూరల్లో మాత్రం ఆచ్ఛాదన చేయాల్సిన అవసరం లేదు. తేనెటీగల ద్వారా పంటల్లో పరపరాగ సంపర్కాన్ని వేగవంతం చేయడానికి పంటల మధ్యలో గోంగూర, పొద్దుతిరుగుడు, ఆముదం, బంతి, ఉల్లి, బడిమ దోస, ముల్లంగి పెంచుతున్నారు. అరణ్య వ్యవసాయ క్షేత్రంలో కూరగాయలకు మాత్రమే డ్రిప్‌తో నీటిని అందిస్తున్నారు. జొన్న, శనగ, కంది తదితర పంటలను వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. జొన్న ప్రధాన పంటగా, అంతర పంటలుగా శనగ, అవిశ, కుసుమ సాగు చేస్తున్నారు. శనగ ప్రధాన పంటగా, అంతర పంటలుగా కుసుమ, జొన్న, ఆవాలు, కట్టె గోధుమలు వేశారు.
జమైకా గోంగూర రేకులతో తేనీరు, జామ్!
ఖరీఫ్‌లో పచ్చజొన్న ప్రధాన పంటగా.. అంతర పంటలుగా 5 రకాల కందులు, బొబ్బర్లు, అనుములు, జమైకా గోంగూర పంటను సాగు చేస్తున్నారు. ఇన్ని రకాలు కలిపి సాగు చేసినప్పటికీ వీటి మధ్య ఎండ కోసం తప్ప పోషకాల కోసం పోటీ ఉండదు. ఆరడుగుల ఎత్తు, పెద్ద సైజు ఆకులు, కాయలతో జమైకా గోంగూర పంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోగు కాయల చుట్టూ ఉండే ఎర్రని రేకులలో చక్కని పోషక విలువలున్నాయి. ఈ రేకులతో జామ్ తయారు చేయటంతోపాటు, రేకుల పొడితో ఆరోగ్యదాయకమైన టీ కాచుకుంటున్నారు!
విత్తు దాతా సుఖీభవ!
పర్మాకల్చర్ సాంఘిక బాధ్యతతో స్థానిక పంటల జీవవైవిధ్యాన్ని పరిరక్షించడాన్ని నేర్పిస్తుంది. అరణ్య ఫామ్‌లో 52 రకాల స్థానిక ఆహార పంటలు, పండ్ల రకాలను సాగు చేస్తూ పరిరక్షిస్తున్నారు. సొంత తిండి పంటల విత్తనాలను నిలబెట్టుకోవటమే రైతుల తొలి కర్తవ్యంగా పర్మాకల్చర్ నొక్కిచెబుతుంది. సొంత విత్తనాన్ని కోల్పోయిన రైతు ఆహార సార్వభౌమత్వాన్నీ కోల్పోయినట్టేనని.. అందుకే, విత్తు దాతా సుఖీభవ అని అనాలంటున్నారు నరసన్న, పద్మ!
మార్కెట్ కోసం కాదు, మన కోసమే పండించుకోవాలి!
పర్మాకల్చర్ నిపుణుడు కొప్పుల నరసన్నతో ముఖాముఖి
► సేంద్రియ వ్యవసాయానికి పర్మాకల్చర్‌కు తేడా ఏమిటి?
అమెరికా, ఐరోపా దేశాల్లో సేంద్రియ వ్యవసాయంలోనూ ఏక పంటల సాగు జరుగుతోంది (క్యూబాలో ఇప్పుడిప్పుడే పంటల వైవిధ్యం వైపు దృష్టిపెడుతున్నారు). భూసారం గురించి మాట్లాడతారు, కానీ వాన నీటి సంరక్షణ గురించిన స్పృహ ఉండదు. భారీ యంత్రాలు వాడుక మామూలే. పంటను మార్కెట్‌లో అమ్ముకోవటం గురించి, ఎగుమతుల గురించే ఆలోచిస్తున్నారు. రసాయనాలు వాడకపోవటం అన్నదొక్కటే రసాయనిక వ్యవసాయానికి, సేంద్రియ వ్యవసాయానికి మధ్య ఉన్న తేడా. వ్యాపారులదే పైచేయిగా ఉండటం వల్ల బాగా డబ్బున్న వారికి మాత్రమే సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్ కోసమే వ్యవసాయం చేసే వారికి, ప్రజలకు ఏ సంబంధం లేదు. పర్మాకల్చర్ ఉద్యమం అలా కాదు. మన తిండి పంటలను, సొంత విత్తనాలతో పండించుకొని తినాలని, సంబంధ బాంధ్యవ్యాలను కొనసాగించటం ముఖ్యమని పర్మాకల్చర్ చెబుతుంది. అంతర/మిశ్రమ/ఎర పంటల సాగు, వాననీటి సంరక్షణ, చెట్టూ చేమ, పశువులు, కోళ్లు, జీవరాశులన్నీటికీ సంరక్షించుకోవటం, వాటికీ సమాన వాటా ఇవ్వటం ముఖ్యమని భావిస్తాం. స్థానిక సమాజం ఆహారపు అవసరాలు తీరిన తర్వాతే మిగులును అమ్ముకోవాలని భావిస్తాం. దేశవిదేశాల నుంచి నా దగ్గరకు వచ్చి శిక్షణ పొందే వారంతా సొంతంగా ఆహారాన్ని పండించుకునే వారే.
► మన చిన్న రైతులకు పర్మాకల్చర్ ఎలా ఉపకరిస్తుంది?
మన రైతుల్లో 80% మంది 2–3 ఎకరాల భూమి కలిగిన వారు. రెక్కల కష్టంతో తమ కోసేమే సొంత విత్తనంతో తిండి పంటలు పండించుకుంటారు. అమ్మటం కోసమే పత్తి తదితర పంటలు వేస్తున్న వాళ్లు అప్పులు, ఆత్మహత్యలపాలవుతున్నారు. ఉన్న పొలంలో కొంత భాగంలో పత్తి వేసినా.. కంది, బంతి, ఆముదం, జొన్న, నిమ్మగడ్డి వంటి అంతర పంటలు తప్పకుండా వేసుకోవాలి. ఒకటి కాదు కొన్ని కలిపి వేసుకోవాలి. పది పంటలు వేస్తే 5 రకాల విత్తనాలైనా రైతు సొంతవై ఉండాలి. ఇప్పుడు 99% కంపెనీల విత్తనాలే వాడుతున్నారు. హైబ్రిడ్ విత్తనాలు కొని వేస్తూ సేంద్రియం/పర్మాకల్చర్ చేస్తున్నామనటంలో అర్థం లేదు. విత్తన సార్వభౌమత్వం పోయాక ఆహార సార్వభౌమత్వం ఎలా ఉంటుంది? బయటి వనరులపై ఆధారపడకుండా వ్యవసాయం చేయటాన్నే డిజైన్ చేసుకోవటం అంటున్నాం.
► పొలాన్ని డిజైన్ చేసుకోవటం అంటే ఏమిటి?
రసాయనాలు, అమ్మే పంటలు వచ్చి మన రైతుల సంప్రదాయ వ్యవసాయ డిజైన్‌ను దెబ్బతీశాయి. శాశ్వత ఆస్తి అయిన భూమిని నాశనం చేసుకుంటున్నాం. వాన నీరు బయటకుపోకుండా పొలంలోనే నిలుపుకోవాలి. పొలంలో 40% చోటులో పండ్ల/అటవీ జాతుల చెట్లుండాలి. 60%లో పంటలుండాలి. గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు 60% వాడినా కనీసం 40% మొక్కలు స్థానిక జాతులవి ఉండేలా చూసుకోవాలి. పశువులను మళ్లీ వ్యవసాయంలోకి తేవాలి. ప్రకృతితోటి, సమాజంతోటి అనుబంధాన్ని పెంచుకోవటం ముఖ్యం. ఈ చైతన్యాన్ని మన చిన్న రైతులకు అందించడానికి కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ పర్మాకల్చర్ సమ్మేళనం ఉద్దేశం కూడా ఇదే.
25, 26 తేదీల్లో అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సమ్మేళనం
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన పర్మాకల్చర్ సేద్య చైతన్యానికి పుట్టిల్లు ఆస్ట్రేలియా. రెండేళ్లకోసారి ఏదో ఒక దేశంలో అంతర్జాతీయ సమ్మేళనం జరుగుతుంది. 13వ అంతర్జాతీయ పర్మాకల్చర్ (శాశ్వత వ్యవసాయ) సమ్మేళనానికి హైదరాబాద్ తొలిసారి వేదిక అవుతోంది. ఈ నెల 25, 26 తేదీల్లో రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సమ్మేళనం జరుగుతుంది.
దేశ విదేశాల నుంచి విచ్చేసే సుమారు 800 మంది శాశ్వత వ్యవసాయదారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సదస్సుల్లో పాల్గొంటారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో ఆసక్తి గలవారెవరైనా పాల్గొనవచ్చు. పర్మాకల్చర్ డిజైన్ కోర్సు పూర్తిచేసి శాశ్వత వ్యవసాయాన్ని అనుసరిస్తున్న వారి కోసం ప్రత్యేక సమ్మేళనం 27 నుంచి డిసెంబర్ 2 వరకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులోని ‘పొలం’లో జరుగుతుంది. 72 దేశాల నుంచి వచ్చే వందలాది మంది పర్మాకల్చర్ అభిమానులు అనుభవాలను పంచుకుంటారు. పూర్తి వివరాలకు..
ధర్మేంద్ర – 99160 95545, రజని – 79817 55785
www.ipcindia2017.org/ www.facebook.com/IPCIndia2017/
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఫొటోలు: బి.శివప్రసాద్, ఫొటో జర్నలిస్టు, సాక్షి, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment