
ఉప్మా విర్ది: రుచికి అవార్డు
మన దేశంలో ‘చాయ్‌వాలా’ కు చాలా పాపులారిటీ ఉంది. 26 ఏళ్ల ఉప్మా విర్ది ఆ పాపులారిటీని ప్రపంచ వ్యాప్తం చేస్తోంది. విషయం ఏంటంటే ఆమె చాయ్‌వాలీ! వాళ్ల తాత ఆయుర్వేద వైద్యుడు. చాయ్ కాచడంలో దిట్ట.విర్ది చిన్నపిల్లగా ఉన్నప్పుడు హెర్బల్ టీ కాచడం ఎలాగో నేర్పాడట. ఇష్టంగా నేర్చుకుంది కాని దాని మీద శ్రద్ధ పెట్టే అవకాశం తాను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడూ రాలేదట. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి, ‘లా’లో అడ్మిషన్ దొరికాక అప్పుడొచ్చింది ఆమెకు ఆలోచన.
పార్ట్‌టైమ్ జాబ్‌గా టీ
లా చదువుతూనే పార్ట్ టైమ్‌గా టీ కాచడం మొదలుపెట్టింది విర్దీ. ఆస్ట్రేలియన్స్‌కి ఈ ఇండియన్ గర్ల్ చేస్తున్న దేశీ చాయ్ పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ఆమె లా పూర్తయ్యేలోపు చాయ్‌వాలీగా ఫేమస్ అయిపోయింది. చిత్రంగా లాయర్‌గా ప్రాక్టీసే పార్ట్ టైమ్ అయిపోయి చాయ్‌వాలీగా ఫుల్‌టైమ్ బిజీ అయింది. ఇంకేముందీ ఆన్‌లైన్‌లో చాయ్ బిజినెస్ ప్రారంభించింది. వెరైటీ టీలను కాచడమెలాగో నేర్పిస్తోంది. టీ, దానికి సంబంధించిన అనుబంధ ఉత్పత్తులను. అంటే పాట్స్, కెటిల్స్, టీతో తయారైన చాక్‌లెట్స్ వంటివి అమ్ముతోంది. వీటికి ఎంత డిమాండ్ అంటే యూరప్ నుంచి కూడా ఆమె ఆర్డర్స్ వస్తుంటాయి. వర్క్‌షాప్స్ కండక్ట్ చేయమని రిక్వెస్టులూ అందుతుంటాయి. చేస్తోంది కూడా.
అన్న పెళ్లికి వేల కప్పులు
ఉప్మా విర్ది స్వస్థలం చండీగఢ్. ఇంటికి ఎవరు వచ్చినా టీ ఇచ్చే బాధ్యత తీసుకునేదట. తన అన్న పెళ్లప్పుడు ఇంటికి వచ్చిన అతిథులందరికీ వేల కప్పుల టీ కాచి అందించిందట. ‘‘మా పేరెంట్స్ అలసిపోయి ఇంటికి రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్.. ‘ఉప్మా.. నీ చేతులతో టీ పెట్టివ్వవా?’ అనే. స్కాలర్‌షిప్ మీద ఆస్ట్రేలియా వెళ్లాను. అక్కడ మా హాస్టల్‌లో ఉన్న వాళ్లందరికీ టీ పెట్టిచ్చేదాన్ని. నా టీ కోసమే వాళ్లంతా ఒక చోట గ్యాదర్ అవడం మొదలుపెట్టారు. అంతకుముందు ఎవరికి వారే యమునా తీరే’’ అంటుంది విర్ది. అన్నట్టు.. బిజినెస్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ (2016), ఇండియన్ ఆస్ట్రేలియన్ బిజినెస్ అండ్ కమ్యూనిటీ అవార్డ్స్(ఐఏబిసిఏ)కు కూడా ఎంపికైంది ఉప్మా విర్ది. మెల్‌బోర్న్ టీ ఫెస్టివల్‌కు ప్రత్యేక అతిథిగా ఆమెకు ఆహ్వానం అందింది. ‘‘మన దేశ చాయ్ రుచిని ప్రపంచమంతటికీ తెలియజేయాలన్నదే నా లక్ష్యం’’ అంటోంది ఉప్మా విర్ది.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment