వివిధ దేవాలయాలలో ద్వారతోరణమధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే మకరతోరణమని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణమధ్యంలో ఎందుకు అలంకరిస్తారో చెప్పే కథ ఒకటి స్కందమహాపురాణంలో కనిపిస్తుంది. పూర్వం ‘కీర్తిముఖుడ‘నే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలను పొందాడు. అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనాలలోని సంపదలను సొంతం చేసుకున్నాడు. దాంతో అతడికి తాను త్రిమూర్తులకన్నా అధికుడినన్న అహం అతిశయించి చివరకు దేవతలనందరినీ తూలనాడసాగాడు. కోపించిన మహేశ్వరుడు అతనిని మింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.
కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలలో తిరిగి చివరకు పరమశివుని శరణు వేడాడు. భక్తవశంకరుడైన శివుడు ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవకన్నుగా ధరించాడు. కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉందని, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు ‘నిన్ను నువ్వే తిను‘ అని చెప్పాడు. శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగంనుంచి తినటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు.
అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. నీవు ఈ నాటినుంచి సమస్తదేవతాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు. దైవదర్శనానికి వచ్చే వారిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను తింటూ ఉండు. అందరికీ పూజనీయుడవు అవుతావు‘ అని వరమిచ్చాడు. ఆనాటినుంచి కీర్తిముఖుడు ఆలయాలలోని తోరణ మధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు. అందుకనే దేవతామూర్తుల వెనుకనుండే తోరణానికి మకరతోరణం అని పేరు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment