నూతనత్వం.. నైపుణ్యాలు | Innovation skills | Sakshi
Sakshi News home page

నూతనత్వం.. నైపుణ్యాలు

Published Sun, Mar 29 2015 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

నూతనత్వం..  నైపుణ్యాలు

నూతనత్వం.. నైపుణ్యాలు

గెస్ట్ కాలమ్

‘కార్పొరేట్ రంగం కొత్త పుంతలు
తొక్కుతోంది. నేటి ప్రపంచీకరణ
కాలంలో.. విద్యార్థులు విస్తృతస్థాయి
నైపుణ్యాలు సొంతం చేసుకోవడం చాలా అవసరం. అకడెమిక్ కోర్సుల్లో నూతనత్వం ఉండాలి. అలాగే ఇన్‌స్టిట్యూట్‌లు మూస
ధోరణికి స్వస్తి పలికి.. కొత్త కోర్సులు, సరికొత్త బోధన విధానాలు అనుసరించాలి. భారతీయ విద్యార్థులు విశ్వవ్యాప్త అవకాశాలు
అందుకోవాలంటే.. మన విద్యావ్యవస్థలో సమూల మార్పులు అవసరం’ అంటున్నారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- కాన్పూర్, డెరైక్టర్ ప్రొఫెసర్ ఇంద్రనీల్ మన్నా. ఇటీవల హైదరాబాద్‌లో.. ఐఐటీ-హైదరాబాద్, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించిన 3డీ డిజిటల్ ఫ్యాబ్రికేషన్ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ ఇంద్రనీల్ మన్నాతో ఈ వారం గెస్ట్ కాలం..
 
జనాభాపరంగా రెండో పెద్ద దేశంగా ఉన్న భారత్‌లో ప్రస్తుత పరిస్థితులు చూస్తే సామాజికంగా, సాంకేతికంగా అన్ని రంగాల్లో లక్షిత వర్గాల అవసరాలు రోజురోజుకీ మారుతున్నాయి. ప్రజలు నూతన సేవలు, ఉత్పత్తులవైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా పరిశ్రమలు పోటీదారులకంటే ముందంజలో నిలవాలనే ఆలోచనతో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణల దిశగా కృషిచేస్తున్నాయి. అంటే.. మార్పు అత్యంత అవసరంగా, అదో నిరంతర ప్రక్రియగా మారింది. ఈ మార్పులు ఆశాజనకంగా ఉండాలంటే యువశక్తి, వారి అకడమిక్ నైపుణ్యాలు ఎంతో కీలకం.
 
సరికొత్త నైపుణ్యాలు అందించే కోర్సులు

రోజురోజుకీ మారుతున్న సామాజిక, పారిశ్రామిక అవసరాలు వాటికి సంబంధించిన సేవలు, ఉత్పత్తుల ఆవిష్కరణలకు అకడమిక్ స్థాయి నుంచే పునాదులు పడాలి. భవిష్యత్తులో ఒక సంస్థలో చేరే వ్యక్తి అక్కడ విధుల్లో భాగంగా వివిధ ఉత్పత్తి విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త ఉత్పత్తుల రూపకల్పనలోనూ భాగస్వాములు కావలసి ఉంటుంది. ఇలాంటి వారికి అకడమిక్‌గా సంబంధిత నైపుణ్యాలు లేకపోతే రాణించలేరు. అదేవిధంగా ఇన్‌స్టిట్యూట్‌లు కూడా మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు అందించే కోర్సుల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 3-డీ ఫ్యాబ్రికేషన్. డిజైనింగ్, రూపకల్పన విషయంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న క్యాడ్, క్యామ్ పద్ధతులకు అడ్వాన్స్‌డ్ దశ 3-డీ ఫ్యాబ్రికేషన్. దీనివల్ల వస్తువుల రూపకల్పన, నిర్మాణం వంటివి మరింత సులభతరం అవుతాయి. సంబంధిత సేవలు అందించే సంస్థలకు, లక్షిత వర్గాలకు కూడా త్వరగా అవి అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి అధునాతన నైపుణ్యాలను అకడమిక్ స్థాయిలోనే అందించే విధంగా కోర్సుల రూపకల్పన చేయడం నేటి పరిస్థితుల్లో ఎంతో అవసరం. కేవలం కోర్ కోర్సుల బోధనకే పరిమితం కాకుండా వాటికి అనుసంధానంగా ఉండే కొత్త కోర్సులు అందించాలి. ఈ క్రమంలో ఇండస్ట్రీ వర్గాలు, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలోని ఇతర ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలు చేసుకోవడం ఉపయుక్తం.
 
అకడమిక్ ఎక్స్ఛేంజ్.. ఎంఎన్‌సీలే కానక్కర్లేదు


ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల విద్యార్థులకు జాబ్ రెడీ స్కిల్స్, క్షేత్ర నైపుణ్యాలు అందించేందుకు మార్గం ఇండస్ట్రీ వర్గాలతో ఒప్పందాల ద్వారా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం. ఈ విషయంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర జాతీయ ఇన్‌స్టిట్యూట్‌లకే ప్రోత్సాహం ఉంటోందని, రాష్ట్ర స్థాయి విద్యాసంస్థలకు ఒడిదుడుకులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. అయితే రాష్ట్రాల స్థాయిలోనూ అకడమిక్ పనితీరు బాగున్న ఇన్‌స్టిట్యూట్‌లు తమ పరిసర ప్రాంతాల్లోని ఎంఎస్‌ఎంఈలతోనూ సంప్రదింపుల ద్వారా ఎక్స్ఛేంజ్ ఒప్పందాలు, స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ప్రయత్నించాలి. ఇలా ఒక ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇతర కంపెనీల దృష్టిని ఆకర్షించడం సులువవుతుంది.
 
సీబీసీఎస్ సాధ్యమే


ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసి, వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న సరికొత్త బోధన-అధ్యయన విధానం. ఇది ఆహ్వానించదగిన పరిణామం. విద్యార్థులకు భిన్న నైపుణ్యాలు అందించే మార్గం. దీని అమలు సాధ్యాసాధ్యాలు, ఫలితాల విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. దేశంలోని యూనివర్సిటీలకు వేర్వేరు సిలబస్ విధానాలు, మూల్యాంకన విధానాల కారణంగా ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు సహజమే. ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు కూడా మొదట్లో ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ సజావుగా సీబీసీఎస్ విధానం అమలవుతోంది. సీబీసీఎస్ పూర్తిస్థాయిలో విజయవంతం కావాలంటే.. అన్ని యూనివర్సిటీల్లోని కోర్సుల సిలబస్ అంశాల మధ్య వైవిధ్యం తగ్గేలా చూడాలి. ఈ దిశగా సంబంధిత నియంత్రణ సంస్థలు దృష్టిసారించాలి.
 
ఐఐటీల్లో అడుగు పెట్టాలనుకుంటే

ఐఐటీల్లో చదవాలనుకునే విద్యార్థులకు నా సలహా ఒకటే.. ఎంట్రెన్స్‌లో ర్యాంకు ఆధారంగా సీటు సాధించగలిగినా.. ఆ తర్వాత కోర్సు పూర్తిచేసే క్రమంలో నిరంతరం అన్వేషణ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అక్కడ నిర్వహించే ప్రాజెక్ట్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్పంచుకోవాలి. మొదట్లో కొంత ఒత్తిడికి గురయ్యే ఆస్కారముంది. కాబట్టి వీటిపై ముందుగానే అవగాహన పెంచుకొని మానసికంగా సిద్ధమవడం మంచిది.
 
‘స్ఫూర్తి’తోనే సక్సెస్

ఇంజనీరింగ్ అనే కాకుండా ఏ కోర్సులో చేరే విద్యార్థులైనా ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఇప్పుడు కోకొల్లలు. చాలా మంది విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో సీటు రాలేదని నిరాశ చెందుతుంటారు. కానీ ఆ రంగంలో విజయ శిఖరాలు అధిరోహించిన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుంటే తాము కూడా సక్సెస్ దిశగా సాగొచ్చు.
 ఆల్ ది బెస్ట్!!
 
ప్రొఫెసర్ ఇంద్రనీల్ మన్నా  డెరైక్టర్,
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ - కాన్పూర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement