మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే వచ్చింది.. లేదంటే మహిళలే తమంతట తాము ముప్పై మూడు శాతంలోకి వచ్చేస్తారన్న ఒక ఉత్తేజకరమైన ఆశాభావాన్ని అత్యధికంగా ఎన్నికైన కొత్త మహిళా ఎంపీల సంఖ్య కలిగిస్తోంది. మహిళలు ఉత్సాహంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఈ సంఖ్య పెరగడం అనేది ఒక ప్రేరణాంశం.
మాధవ్ శింగరాజు
పార్టీల సిద్ధాంతాలు వేరుగా ఉన్నట్లే, ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలూ వేరుగా ఉంటాయి. అయితే ఈసారి నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే విధమైన హామీ ఇచ్చారు. తమని అధికారంలోకి తెస్తే మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు ఇస్తామని! బాగా పాతబడిన హామీ ఇది. ఇరవై రెండేళ్లుగా నాయకులు హామీ అయితే ఇస్తున్నారు కానీ, రిజర్వేషన్ మాత్రం ఇవ్వడం లేదు. గత ఐదేళ్ల పాలనలో మన్‌కీ బాత్, పాకిస్తాన్‌కి జరిపిన ఆశ్చర్యకర పర్యటన, ‘యోగా డే’కి ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం, పెద్ద నోట్ల రద్దు, స్వచ్ఛ భారత్, సర్జికల్ స్ట్రయిక్స్.. ఇవి మాత్రమే మోదీ సాధించిన ఘనతలుగా, గుర్తులుగా మిగిలిపోయాయి. రిజర్వేషన్ బిల్లుని నోటి మాటగానైనా మోదీ ఎక్కడా ప్రస్తావించలేదు.
బహుశా పైన వేటికీ (మన్ కీ బాత్ వగైరా..) పార్లమెంటు ఆమోదం అవసరం లేదు కాబట్టి అవి సాధ్యమయ్యాయేమో! మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం అవసరం. రాజ్యసభ 2010లోనే బిల్లును ఆమోదించింది. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పదహారవ లోక్‌సభలో (ఇప్పుడొచ్చింది పదిహేడవ లోక్‌సభ) ఎన్డీయేకి తగినంత బలం ఉన్నప్పటికీ మహిళా బిల్లును తెచ్చే సంకల్పబలం లేకపోయింది. గత ఐదేళ్లలో వంద వరకు కీలకమైన బిల్లులు పాస్ అయిన లోక్‌సభలో మహిళా బిల్లు కనీసం ప్రతిపాదనకు కూడా రాలేదు.హెచ్.డి. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారిగా 1996 సెప్టెంబర్ 12న పార్లమెంటులో ప్రతిపాదనకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆయన తర్వాత.. ఐ.కె.గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి.
మన్మోహన్‌సింగ్, నరేంద్ర మోదీ.. ఇంత మంది ప్రధానులు మారినా.. లోక్‌సభకు రాలేదు. మహిళా బిల్లు చట్టంగా వస్తే కనుక లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల స్థానాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. మహిళా బిల్లు చట్టంగా రావాలంటే లోక్‌సభలో, రాజ్యసభలో ఆమోదం పొందాలి. దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. రాష్ట్రపతి సంతకం చేయాలి. ఇప్పటి వరకు ఒక్క రాజ్యసభలో మాత్రమే అయితే బిల్లు ఆమోదం పొందింది.2009 డిసెంబర్ 17న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండు సభల్లో బిల్లును ప్రవేశపెట్టింది. సమాజ్‌వాదీ, జనతాదళ్ (యు), ఆర్జేడీ నిరసనలు, తీవ్ర వ్యతిరేకతల నడుమ బిల్లుపై ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయింది. అనంతరం 2010 మార్చి 8న బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఆ మర్నాడు జరిగిన ఓటింగులో భారీ మెజారిటీతో మహిళా బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
అప్పట్నుంచీ ఎనిమిదేళ్లు గడిచాయి. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే బిల్లును లోక్‌సభకు తేలేకపోతున్నామని రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నా.. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం గానీ, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం గానీ ఒక చట్టం తెచ్చేందుకు ఏకాభిప్రాయంతో పని లేదని నిపుణులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు.బీజేపీని గెలిపిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును తెస్తామని ఈ ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ కారణంగానే ఆయన గెలవక పోవచ్చు కానీ, గెలిచాక హామీని నెరవేర్చే బాధ్యత ఆయన మీద ఉంది. రాహుల్ వచ్చి ఉంటే రాహుల్ మీద ఉండేది. కొద్ది రోజుల్లో కొలువు తీరబోతున్న కొత్త లోక్‌సభకు 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన పదహారు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ఎంపీలు లేరు. 78 మంది అంటే లోక్‌సభలో 14 శాతం. ఇది ముప్పైమూడు శాతానికి చేరుకోవాలంటే ఇంకా 103 మంది ఉండాలి. రిజర్వేషన్‌లేమీ లేకుండా లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య వన్ థర్డ్‌కు (వందకు ముప్పైమూడు) అందుకోవాలంటే మరో నలభై ఏళ్లు పడుతుందని ఒక అంచనా! అంటే మరో ఎనిమిది సార్వత్రిక ఎన్నికలు. ‘పెర్ఫార్మింగ్ రిప్రెజెంటేషన్ : ఉమెన్ మెంబర్స్ ఇన్ ది ఇండియన్ పార్లమెంట్’ అనే పుస్తకం కోసం 2009–2016 మధ్య.. డాక్టర్ కరోల్ స్ప్రే అనే ఇంగ్లండ్ ప్రొఫెసర్.. షిరిన్ రాయ్ అనే భారతీయ ప్రొఫెసర్ సహకారంతో వందల మంది మహిళా ఎంపీలను, పురుష ఎంపీలను ఇంటర్వ్యూ చేశారు. కరోల్ వేసిందే ఈ ‘మరో నలభై ఏళ్లు’ అనే అంచనా.
అసలీ రిజర్వేషన్‌లు లేకుండా ప్రతి పార్టీ తప్పనిసరిగా 33 శాతం సీట్లను మహిళలకు ఇచ్చేలా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తే పోయేదానికి రాజ్యాంగాన్నే సవరించడం ఎందుకు?! అలా చేస్తే మహిళలకు మళ్లీ అదొక అవరోధం అవుతుంది. ఓడిపోయే స్థానాల్లో పార్టీలు మహిళా అభ్యర్థుల్ని నిలబెట్టి, గెలిచే చోట మగాళ్లను నిలబెడతాయి. అప్పుడిక రిజర్వేషన్ అన్నమాటకే అర్థం ఉండదు. పోటీ చేసేవాళ్లు 33 శాతం ఉంటారు కానీ, గెలిచి చట్టసభల్లోకి వెళ్లే వాళ్లు అంతమంది ఉండరు. ఇన్ని రాజకీయాలు ఉంటాయి కనుకే మహిళలు చట్టసభల్లోకి రావడానికి మహిళా రిజర్వేషన్ చట్టం తప్పనిసరిగా ఉండాలి. చట్టం రాకపోతే.. కరోల్ భావిస్తున్నట్లు చట్టంతో పనిలేకుండా తమంతట తామే ముప్పై మూడు శాతంలోకి వచ్చేస్తారు..కాలక్రమంలోనో, కాలాన్ని తామే ముందుకు నడిపిస్తూనో!
Comments
Please login to add a commentAdd a comment