పాతబస్తీలో కొత్త వేకువ
కృషి
జమీలానిషత్...పేరు వినే ఉంటారు. ‘హైదరాబాద్ పాతబస్తీ ఎప్పటికీ పాత సంప్రదాయాల్లోనే మగ్గిపోవాలా! ఇక్కడ కొత్తదనం రాకూడదా?’’ అనే ప్రశ్నతో మొదలైన ఆమె పోరాటం వల్ల ఎందరో ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగు నిండింది. ‘అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి మీద పెళ్లి చేస్తే చూస్తూ ఊరుకోనం’టూ అడ్డువచ్చినవారిని ఇదెక్కడి న్యాయమంటూ కాలర్‌పట్టుకుని నిలదీసిన జమీలా ఇప్పుడు మరో కొత్తయజ్ఞం మొదలెట్టారు.‘ఓ మూడు సూత్రాలను పాటించి ముందడుగు వేయండంటూ ‘యంగ్ ఉమెన్’ పేరుతో వెయ్యిమంది పాతబస్తీ యువతులకు శిక్షణనిస్తున్నారు. ‘వీళ్లు మొన్నటివరకూ పాతబస్తీ మహిళలు. ఇప్పుడు పాతబస్తీలోని కొత్తమహిళలు’ అంటున్నారు జమీలా.
‘‘పాతబస్తీలో మహిళల పరిస్థితి నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది’’ అంటూ పన్నెండేళ్లక్రితం జమీలా బాధపడడం వెనక ఎన్నో కఠినమైన వాస్తవాలు ఉన్నాయి. కన్నబిడ్డలకు కడుపునిండా తిండిపెట్టుకోలేని అమ్మలు, విదేశాలకు అమ్ముడుపోతున్న అమ్మాయిలు...గొంతెత్తి ఇదీ మా దుస్థితి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో జమీలా స్థాపించిన ‘షాయిన్ ఉమెన్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’ పాతబస్తీ మహిళలకు తోడుగా నిలిచింది. ఫలితంగా పరదాల చాటున కన్నీళ్లతో కలిసి బతుకుతున్న వందలాది పేద మహిళల జీవితాల్లో మార్పు వచ్చింది.
ఆ మార్పుకి మెరుగులు దిద్దే క్రమంలో పుట్టిందే ‘యంగ్ ఉమెన్’ కార్యక్రమం. గత ఏడాది సెప్టెంబర్‌లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఆమె విజయాలజాబితాలో కొత్తగా వచ్చి చేరింది. ఈ తాజా విజయం వెనక ‘షాయిన్’ టీం కృషి చాలా ఉందంటారు జమీలా. ‘‘ఇప్పటి వరకూ అన్యాయం జరిగిన మహిళలకు న్యాయం చేయడానికి ప్రయత్నించాం. అసలు అన్యాయమే జరక్కుండా ఉండాలంటే...మార్పు ముందుగా మహిళల్లో రావాలి. అందుకే 15 నుంచి 25 ఏళ్ల వయసులోపున్న యువతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనుకున్నాం. వీరిలో చదువుకున్నవారు, చదువులేని వారు కూడా ఉంటారు. ముందుగా వీరిలో మూడు అంశాల్లో మార్పు రావాలి. ఒకటి చక్కటి పని చేయడం, రెండోది ఆర్థికంగా నిలబడడం, మూడోది ఆరోగ్యం. కౌన్సెలింగ్‌ల ద్వారా ఈ మూడింటిపై వారికి అవగాహన పెంచాం. కంప్యూటర్ ట్రైనింగ్, ఎంబ్రాయిడరీ వర్క్, టైలరింగ్, మెహందీ వర్క్‌లకు సంబంధించి మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు పెట్టాం. దీనికోసం హైదరాబాద్‌లోని సుల్తాన్‌షాయ్‌తో పాటు అమాన్ నగర్, సిద్దిత్‌నగర్, వాల్మీకినగర్, పటేల్‌నగర్, హసన్‌నగర్‌లలో సెంటర్లు స్థాపించాం. అక్కడ శిక్షణ తీసుకున్నవారు చాలామంది ఇంట్లో సొంతంగా పనిచేసుకోవడం మొదలుపెట్టారు. కొందరు బయటికి వెళ్లి పనిచేసుకుంటున్నారు’’ అని వివరించారు జమీలా.
దారి దొరికింది...
ఏదైనా పని చేసుకుని బతకాలంటే బస్తీ దాటి బయటికి వెళ్లాలి. గుమ్మం దాటడానికే అవకాశంలేని మహిళలు ఎప్పటికీ పేదరికంలోనే మగ్గిపోవాలన్నమాట. అలాంటివారికి ‘యంగ్ ఉమెన్’ వరంలా మారింది. సుమాన్ అనే మహిళ చెప్పే విషయాలు వింటే పాతబస్తీ పేదమహిళల బతుకుచిత్రం మన కళ్లముందుంటుంది. ‘‘నాకు నలుగురు పిల్లలు. నా భర్త ఆటో నడుపుతాడు. ఆయన సంపాదన మా కడుపునింపడానికే సరిపోదు. అదనంగా ఖర్చులు వస్తే నేనే కారణమంటూ కొట్టేవాడు. వెంటనే ఇక్కడికి వచ్చి ఏదైనా పని నేర్పించమని అడిగాను. టైలరింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా పనిచేసుకోవడం మొదలుపెట్టాక నాకు నా భర్తకు గొడవలు తగ్గాయి. పిల్లలకు కడుపునిండా తిండి పెట్టుకోగలుగుతున్నాం’’ అని చెప్పింది. ఒక సుమాన్ మాత్రమే కాదు...పదిహేనేళ్లకే పెళ్లయి పాతికేళ్లలోపు ఓ ఐదుగురు పిల్లలకు తల్లయిన బాల్యవివాహ బాధితులు కూడా ‘యంగ్ ఉమెన్’లో చేరారు.
పాఠశాల రోజులనుంచే ముస్లిం మహిళల కష్టాలపై కవిత్వం రాసిన పుట్టి పెరిగింది సుల్తాన్‌షాయ్‌లోనే. ‘ఆడా మగా ఇద్దరూ సమానమే’ అన్న మాటను అంగీకరించేవరకూ తన పోరాటం ఆపనంటున్న జమీలా తలపెట్టిన ‘యంగ్ ఉమెన్’ మరిన్ని మహిళా విజయాలకు వేదిక కావాలని కోరుకుందాం.
- భువనేశ్వరి
తల్లిదండ్రులను ఒప్పించి:
‘‘వెయ్యిమంది యువతుల్ని ఒకచోటకి తెచ్చి అందరినీ ఓ మార్గంలో నడిపించడం చాలా కష్టమైన పని. పాతబస్తీలో మరీ కష్టం. ‘యంగ్ ఉమెన్’టీమ్ ఆరు నెలలపాటు ఇంటింటికీ తిరిగి అమ్మాయిలతో మాట్లాడి వారి తల్లిదండ్రులను ఒప్పించి వారికి శిక్షణ ఇప్పించింది. వీరికోసం ప్రత్యేకంగా ‘టెక్నికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్‌స్టిట్యూట్’ని స్థాపించమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అప్పుడు మా ఓల్డ్‌సిటీ నిజంగానే న్యూసిటీ అయిపోతుంది’’
- జమీలా నిషత్