
షాదీ కాదు బర్బాదీ
నెట్‌ఇంట్లో
ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ఫేమ్... ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కనీసం పదిహేను నిమిషాల పాటు సెలబ్రిటీ అయ్యే ఛాన్స్ వస్తుందట. సోషల్ మీడియా సామ్రాజ్యంలో తండ్రి ఒళ్లో ఒదిగి కూర్చున్న పసి కూన కూడా సెలబ్రిటీ కాగలదు. గజరాజుకి సలాం కొట్టి ప్రాణాలు కాపాడుకున్న వాడూ సెలబ్రిటీ కావచ్చు. కొందరు సెలబ్రిటీ స్ట్టేటస్ కోసం అవసరమైతే పెళ్లిని పెటాకులు చేసుకోగలరు. కొన్ని షేర్లు, కాసిన్ని లైక్‌లు, ఇంకొన్ని ఎమోటికాన్లు ఉంటే చాలు. సెలబ్రిటీ స్టేటస్‌ను శాశ్వతంగా ఉంచుకోగలరు. సలహాల నుంచి, సరదాల దాకా ఏదైనా ఈ స్టేటస్‌ను ఇచ్చేస్తాయి. గత వారంలో సామ్యాలకు సెలబిటీ స్టేటస్ తెచ్చిపెట్టిన కొన్ని నెట్టింటి కబుర్లూ కహానీలు మీ కోసం...
పెళ్లంటే పందిళ్లు, లోగిళ్లు, వాకిళ్లు, తలంబ్రాలు, తప్పెట్లు... పరమాన్నాలు పప్పన్నాలు.... ఛ...ఛ... ఇవేం కావు. పెళ్లంటే ఏడు అడుగులు. మూడు ముళ్లు... రెండు మనసులు... ఒక్క జీవితం... ఛస్... కాదంటే కాదు... ఆస్ట్రేలియాకి చెందిన స్టిఫానీ రింగ్వెట్ అనే అమ్మాయికి, డ్రూ సిల్వర్ అనే అబ్బాయికి మాత్రం పెళ్లంటే టోర్నడోలు, తుఫాన్లు, షార్కులు, గాడ్జిల్లాలు.... ఒక్క మాటలో చెప్పాలంటే స్టిఫానీ పెళ్లి అందరికీ చావుకొచ్చిందన్న మాట. వాళ్లది ప్రళయంలో ప్రణయమో లేక వాళ్ల ప్రణయమే ప్రళయమో తెలియదు కానీ, అమ్మడికి ఇలాంటి భయంకర బ్యాక్ గ్రౌండ్‌లో పెళ్లి ఫోటోలు దిగాలని భలే సరదా. అందుకే షార్క్ నాడో సినిమాలో లాగా బ్యాక్ గ్రౌండ్‌లో రెండు టోర్నడోడు, కోరలు చాస్తున్న నాలుగు షార్కులు, విధ్వంసరచనకు వరల్డ్ రైట్స్ తీసుకున్న ఓ భయంకర గాడ్జిల్లా, నల్లని మేఘాలు, నలు దిక్కులా విలయం సీన్‌ని వెడ్డింగ్ ఫోటోలో డిజిటల్‌గా ఫిక్స్ చేశారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు, తోడు పెళ్లికొడుకు, కూతుళ్లూ ప్రాణాలరచేత పెట్టుకుని పరిగెడుతున్నట్లు ఫోటోలు తీశారు. ఇంకేముంది. వారి పెళ్లి ఓ సినిమా పోస్టర్ లా ఉంది. స్టిఫానీ రింగ్వెట్ అయితే నిజంగా జీవించేసింది. కావాలంటే ఫోటోని మీరూ చూడండి. చూస్తే ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అనుకుని షాదీ మాటే వద్దు గురూ... సోలో బతుకే సో బెటరూ అని చెప్పడం ఖాయం. http://www.dailymail.co.uk/femail/article&3283951/Newlyweds&flee&terror&Sharknado&Godzilla&invade&wedding&unique&wedding&pictures.html
దణ్ణం దశగుణం భవేత్!
ఎక్కడైనా ఏనుగుని ఏనుగు అనండి. కానీ అడవిలో మాత్రం గణేశ్ బాబా అనే అనాలి. ఇది అటవీ ప్రాంతపు సామెత. ఈ సామెత ఆ బైక్ రైడర్ బాగా ఒంట పట్టించుకున్నాడు కామోసు. అందుకే బతికిపోయాడు. థాయ్‌లాండ్‌లోని ఖావో యై నేషనల్ పార్క్‌లో బోల్డన్ని ఏనుగులు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. బైకుల హోరుతో వాటికి పిచ్చెక్కిపోతోంది. తుంటరి బైకర్లు దొరకలేదు కానీ, ఏనుగుల మందకి ఒంటరి బైకర్ ఒక దొరికారు. ఏనుగులన్నీ ఆయన మీదకి వెళ్లాయి. కోపంతో తొండం, తోక లేపి తెగ ఊపేశాయి. గుండెలు అవిసిపోయేలా ఘీంకరించాయి. లావొక్కింతయు లేని ఆ నిర్భాగ్యుడికి బహుశః గజేంద్ర మోక్షం గుర్తుకొచ్చి ఉంటుంది. గజరాజులకు వొంగి, చేతులు జోడించి దణ్ణం పెట్టాడు. ఏనుగుల్లోని గణేశుడు మేల్కొన్నాడో ఏమో. లేక దాసుడి తప్పులు దణ్ణంతో సరి అనుకున్నాయేమో. ఏనుగులు ఒక్కసారి ఆగిపోయాయి. కాసేపు గుడ్లురిమి చూశాయి. తరువాత గునగున నడిచి వెళ్లిపోయాయి. మనోడు హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఎలిఫెంట్ గాడ్ కాదు... ఎలిఫెంటే గాడ్ అనుకున్నాడు. ఈ సంఘటన అక్టోబర్ 18న జరిగింది. ఈ మధ్య ఖావో యై నేషనల్ పార్కులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుంటే ఇది బయటపడింది. ఖావో యై నేషనల్ పార్కు వారి వెబ్‌సైట్ లో ఇప్పుడీ వీడియో వీర విహారం చేస్తోంది. నెట్టింట్లో ఇదొక పెద్ద సంచలనం. https://www.facebook.com/TulunaduNews/videos/833345003363381/
బతికిన కాలేజీ
పరీక్షలో ఫెయిల్. ప్రేమలో ఫెయిల్. ఉద్యోగంలో ఫెయిల్, సంసారంలో ఫెయిల్... బతుకొక కొట్టివేత అయినప్పుడు, బతకడం ఒక తీసివేత అయినప్పుడు ఆత్మహత్య అందంగా కనిపిస్తుంది. ఈ కష్టాలంచి, కడగండ్ల నుంచి, ఇడుముల నుంచి, ఇక్కట్ల నుంచి ఎగిరిపోతే ఎంత బావుంటుంది అనిపిస్తుంది. ఆ క్షణంలో ఆత్మహత్య చేసేసుకోవాలనిపిస్తుంది. అదిగో... సరిగ్గా అలాంటోళ్ల కోసమే ఈ స్కూలు. ఈ స్కూల్‌లో మీ చేత తల్లిదండ్రులకు తుది లేఖ రాయిస్తారు. కుటుంబానికి వీలునామా చేయిస్తారు. కళ్లారా మీ అంత్యకియలెలా జరుగుతాయో చూపిస్తారు. ఆ తరువాత ఓ శవపేటికలో పడుకోబెట్టి మూసేస్తారు. పది నిమిషాలు అంతా నిశ్శబ్దం... చీకటి ప్రపంచంలో పది నిమిషాలు ఉండేసరికి బతుకు విలువ తెలుస్తుంది. చావు ఎంత భయంకరమైందో అర్థం అవుతుంది. దక్షిణ కొరియాలో ఆర్థిక సమృద్ధి, హార్థిక శూన్యత పెనవేసుకుని మరీ పెరుగుతున్నాయి. రోజుకు సగటున 40 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారట. దక్షిణ కొరియాలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఆ ఆత్మహత్యల సంస్కృతిని చంపేసేందుకు పుట్టింది ఈ డెత్ స్కూలు. హ్యోవోన్ హీలింగ్ సెంటర్ వారు నిర్విహ స్తున్న ఈ స్కూలు మీ చావు మీరే కళ్లారా చూసేలా చేస్తుంది. పది నిమిషాల్లో ఒక్క ఉదుటున లేచి బాబోయ్... ఇక చచ్చినా చావొద్దు అనుకుంటారు. ఆ స్కూలుకి వెళ్లకపోయినా, ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఓ పది నిమిషాలు చావును అనుభవిస్తే చాలు. చచ్చినా చావరు. బతికి సాధించాలనుకుంటారు.
http://www.dailymail.co.uk/news/article&3284587/Learn&dead&day&Suicidal&
people&locked&coffins&bizarre&death&experience&schools&South& Korea&40& people&kill&day.html?ito=social&facebook
ఈ తేనెకళ్ల పసివాడి గొంతు పిసికేయగలరా?
అమాయకంగా, తేనె కళ్లతో మీ వైపు చూస్తున్న ఈ బుజ్జిగాడిని గొంతు పిసికి చంపేయమంటే మీరేం చేస్తారు? ఈ పసిప్రాణాన్ని చిదిమేయమంటే మీరేం చేస్తారు? మెడమీద తలకాయ, శరీరంలో హృదయం ఉన్న వాడెవడైనా చంపడు గాక చంపడు. అయితే మీ వైపు అమాయకంగా చూస్తున్న ఈ పసివాడే పెద్దవాడయ్యాక ప్రపంచ యుద్ధానికి కారణమై, లక్షలాది మంది ప్రాణాల హరించిన క్రూరాతిక్రూర నియంత హిట్లర్ అవుతాడని తెలిస్తే ఏం చేస్తారు? ప్రపంచంలో నరమేథం చేసి, యూదు జాతినే అంతరింపచేయడానికి ప్రయత్నించిన కిరాతకుడు ఇతనేనని తెలిస్తే ఏం చేస్తారు? న్యూయార్క్ టైమ్స్ ఇదే పశ్న వేసింది. రాబోయే రోజుల్లో కాబోయే నరరక్త పిశాచిని మీ చేతులతో చంపేస్తారా? ఈ పిల్లవాడు హిట్లర్ అవుతాడని తెలిస్తే చంపేస్తామన్న వారి సంఖ్య 42 శాతం. 30 శాతం హిట్లరేనని తెలిసినా చంపేది లేదని తెగేసి చెప్పారు. మరో 28 శాతం మాత్రం ఎటూ తేల్చలేక, ఏ జవాబూ చెప్పలేక ఉండిపోయారట. దీనిపై ధర్మసందేహాలు, ప్రశ్నోపప్రశ్నలు పుట్టుకొస్తున్నాయట. ట్విట్టర్‌లో దీనిపై జోకులు షేర్ అవుతున్నాయి కూడా. ఈ పశ్న, దానిపై చర్చ కూడా ఇంటర్‌నెట్‌ను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి.
మోదీ పాట... గర్బా ఆట!
ప్రధాని నరేంద్ర మోదీ మంచి కవి, రచయిత అన్న సంగతి చాలామందికి తెలియదు. ఆయన గుజరాత్‌లో చాలా పుస్తకాలే రాశారు. దసరా సమయంలో గుజరాతీయులందరూ ఎంతో ముచ్చటగా ఆడుకునే సామూహిక నృత్యం గర్బా. మోదీ గర్బాపై రాసిన ‘ఘూమే ఏనో గర్బా...’ అన్న పాట ఈ దసరాకి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ప్రసిద్ధ గర్బా గాయకుడు దేవాంగ్ పటేల్ ఈ గర్బా గీతాన్ని ఆలపించి, ఓ వీడియో తయారు చేశాడు. ఇప్పడు ఇంటర్‌నెట్‌లో వేలాది మంది దీన్ని లైక్ చేస్తున్నారు. అయితే మోదీ ఈ పాటను ఇప్పుడు రాయలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రాశారు. కానీ ఇప్పుడు దేవాంగ్ పటేల్ పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది. గర్బా లయబద్ధ నృత్యాధారిత సంగీతాన్ని ఆస్వాదించండి.
https://www.youtube.com/watch?v=8E2VdoNTyYU
అనగనగా...!!
అనగనగా అంటూ నాన్న కథ చెప్పినప్పుడు మన ఊహలు రెక్కలు విప్పుకుంటాయి. మనం నాన్న ఒళ్లో కూర్చున్నా మనసు రాకుమారి, యువరాజు, రెక్కల గుర్రం, మాయలమరాఠీ, సప్తసముద్రాలకవతల చెట్టు తొర్రలో చిలుక దాకా వెళ్లిపోతుంది. గుర్రం పరిగెత్తడం నుంచి, కత్తి యుద్ధం దాకా అన్నీ మనసు తెరపై బొమ్మ కడతాయి. ఇప్పుడు పెద్దవాళ్లం అయినా మన మనసు భుజాలమీద భేతాళుడిలా చిన్ననాటి కథలు వేలాడుతూనే ఉంటాయి. కథ మన మనసుకు కళ్లు, ఊహలకు కాళ్లు ఇస్తుంది. ఇది నా కథ. మీ కథ. మనందరి కథ. బహుశః అందుకేనేమో అందరికీ ఈ వీడియో తెగ నచ్చేస్తోంది. నాన్న కథ చెబుతుంటే ఓ గడుగ్గాయి కథా ప్రపంచంలోకి వెళ్లి, అభినయించేస్తున్న వీడియో ఇది. బుల్లిపాప కథలో మమేకం అయిన తీరు తెగ ముద్దొచ్చేస్తుంది. ఊ కొడుతూ, ఉలిక్కిపడకుండా నటించడం అబ్బురపరుస్తుంది. నిజానికి గతేడాది అప్ లోడ్ అయినా ఇప్పటికీ ఇది హిట్టే. రెండు లక్షల షేర్లు, 70 వేల లైకులు, వేల సంఖ్యలో కామెంట్లతో టాప్ ఆఫ్ ది చాట్స్‌లోఉంది. చూడండి. మీ నాన్నో, మావయ్యో మిమ్మల్ని గుండెల మీద పడుకోబెట్టుకుని చెప్పిన కథల్లోకి మరోసారి వెళ్లిపోండి.
https://www.facebook.com/TulunaduNews/videos/833345003363381/