ఆచరించాం... అనుసరించారు... | interview IAS officer Gummalla balaramya | Sakshi
Sakshi News home page

ఆచరించాం... అనుసరించారు...

Published Mon, Dec 9 2013 12:25 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

interview IAS officer Gummalla balaramya

తండ్రి ఐఏయస్ ఆఫీసర్... తల్లి సర్పంచ్...
 కూతురు కూడా ఐఏయస్.
 కొడుకు... నేడో రేపో అమెరికా వెళ్లబోతున్న ఇంజినీర్.
 ఏమనిపిస్తోంది? వెల్‌ప్లాన్‌డ్ అని కదా!
 కెరియర్ ఓరియంటెడ్ అని కదా!
 పైపైకి ఎదగడమే ఆ ఫ్యామిలీ ధ్యేయం అని కదా!
 అయితే ఈ వారం లాలిపాఠం మీరు చదవాల్సిందే
 ‘ఇది చదువు’ ‘అది చదువు’ అని ఒత్తిడి చేయకుండా
 ‘అది వద్దు’ ‘ఇది వద్దు’ అని కట్టడి చేయకుండా
 ‘ఎదగడ’మంటే మనకు మనం ఎదగడం కాదనీ
 ఎంత ఎదిగితే అంతగా ఒదిగి సాటి మనిషికి సాయం చేయాలనీ
 ఆచరించి చూపిన తల్లిదండ్రుల గురించి మీరు చదవాల్సిందే...


 హైదరాబాద్, పంజగుట్టలోని ఆఫీసర్స్ కాలనీ. క్వార్టర్ నంబరు 43. ఇది విశ్రాంత ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య నివాసం. జిల్లా కలెక్టర్‌గా పిల్లల పెంపకంలో తాను అనుసరించిన పద్ధతులను చెప్పడానికి ముందు ఆయన తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మా ఊరు చిత్తూరు జిల్లా మాధవమాల. మా ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. నన్నైనా చదివించాలని మా అమ్మ పట్టుబట్టింది. కానీ మా ఊళ్లో బడి లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా మా అమ్మ... ఆ ఊరిలో చదువుకున్న ఒక రాజుగారిని ఒప్పించి పదిమంది పిల్లల్ని చైతన్యవంతం చేసి వీధిబడిని ఏర్పాటు చేసింది. అందులో శ్లోకాలు, బాలరామాయణం, పెద్దబాలశిక్ష, లెక్కలు నేర్చుకున్నాను.

ఆరోతరగతికి ఎంట్రన్స్ రాసి శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పాఠశాలలో చేరాను. 1974లో ఎం.ఏ పూర్తయిన నాటికి కూడా నాకు పోటీపరీక్షల గురించి తెలీదు. తర్వాతెలాగో స్నేహితుల ద్వారా తెలుసుకుని గ్రూప్-4 రాసి జూనియర్ అసిస్టెంట్‌గా చేరాను. 1983లో గ్రూప్-2 రాసి తాసిల్దారునయ్యాను. అదే ఏడాది పెళ్లయింది. ఆ తర్వాత నాలుగేళ్లకు గ్రూప్-1 ఆఫీసర్‌గా సెలక్టయ్యాను. ఆర్డీవోగా, డిఆర్‌వోగా, జాయింట్‌కలెక్టర్‌గా, కలెక్టర్‌గా, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌గా, ఎండోమెంట్స్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించాను. నిరక్షరాస్య కుటుంబంలో పుట్టిన నేను ఐఏఎస్ అధికారి అయిన వైనం ఇది’’ అని చెప్పారు.
 
‘‘మా అమ్మాయి సివిల్స్ రాస్తానని చెప్పినప్పుడు సంతోషించాను. సృజన చాలా తెలివైన అమ్మాయి, చదువుని ఇష్టపడే అమ్మాయి, త్వరగా గ్రహిస్తుంది కూడ. ఒకసారి వింటే ఇక మర్చిపోదు. మూడో ఏటనే స్కూలుకి పోతానని మారాం చేసేది. పెద్దయిన తర్వాత కూడా నేనెప్పుడూ తనని పుస్తకాలు చదవమని చెప్పలేదు. ఇంగ్లిష్ సాహిత్యం, రామాయణం, భారతంతో సహా నా లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నింటినీ చదివేసింది. సాహిత్యాభిలాష స్వతహాగా కలగాలి తప్ప ఒకరు ఒత్తిడి చేస్తే అలవడదు. సాహిత్యం, డ్రామాలు నా హాబీలు. ఇప్పటికీ నటిస్తున్నాను.

తండ్రికి పాఠాలు..!

మా అమ్మాయి చదివిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఒకప్పుడు మా మధ్య ఏదైనా విషయం మీద చర్చ జరిగేది, ఇప్పుడు చర్చ లేదు... పాప చెప్పింది వినడమే నా వంతు. (నవ్వు) మా పిల్లలు అలా అయితే బావుణ్ను, ఇలాగైతే బావుణ్ణు అనే కోరికకు మేమేమీ అతీతులం కాదు. మా అబ్బాయి పొడగరి, ఐపిఎస్ అయితే బావుణ్ణనే కోరిక నాకు, అమ్మాయిని మెడిసిన్ చదివించి మా ఊళ్లో హాస్పిటల్ కట్టి ఆమె చేత మా ఊరి వాళ్లకు వైద్యం చేయించాలని మా ఆవిడ కోరిక. ఐఎఎస్, ఐపిఎస్ రెండూ నిత్యం సమాజంతో సంబంధాలు కలిగి ఉండాల్సిన వృత్తులు. వాటిని ఇష్టంగా స్వీకరించాలి, తప్ప ఒకరు ప్రభావితం చేయడం సరికాదు. అందుకే నేను మా అబ్బాయితో తన అభిరుచి తెలుసుకోవడానికన్నట్లు ప్రస్తావించాను. కానీ చార్వాక్ మాటల్లో పోలీస్ వ్యవస్థ పట్ల తృష్ణలాంటివేవీ కనిపించలేదు, టెక్నాలజీ వైపు ఆసక్తి కనబరిచాడు’’ అన్నారాయన.
 
లలిత కళల్లో ప్రవేశం!

తన పెంపకంలో పిల్లలకు ఒద్దిక, జాగ్రత్త, ఆదరణ అలవాటయ్యాయి అంటారు సుగుణశీల. ‘‘మాకు బంధువుల రాకపోకలు ఎక్కువ. మా ఊరి నుంచి వచ్చిన వాళ్లను స్టేషన్ నుంచి తీసుకురావడం మా అబ్బాయి పని, వాళ్లకు అన్నీ అమర్చి భోజనాలు వడ్డించడం అమ్మాయి బాధ్యత. పిల్లలకు అతిథులను సాదరంగా స్వాగతించే లక్షణం అలవడుతుందని ఇలా ఇద్దరికీ చెరో పని అప్పగించేదాన్ని. మా అమ్మాయి బాగా పాడుతుందని సంగీతంతోపాటు కూచిపూడినాట్యంలో శిక్షణ ఇప్పించాను.
 
వంట నేర్పించాను!

నేను పిల్లలను జాగ్రత్తగా పెంచాలని మాత్రం అనుకునేదాన్ని. క్వార్టర్స్‌లో వంటవాళ్లు, చేతిలో పని అందుకోవడానికి మనుషులుంటారు. అయినా ఆడపిల్లకు వంట తెలిసి ఉండాలని నేర్పించాను. అలాగే చిన్నప్పటి నుంచి ఇంటికి వచ్చిన వారిని పలకరించి కూర్చోమని చెప్పడం, నాన్నగారి కోసమా అని అడిగి వచ్చినది ఎవరో తెలుసుకుని ఆ సమాచారాన్ని వాళ్ల నాన్నగారికి తెలియచేయడం అలవాటు చేశాను. ‘పిల్లలకు అధికారం విలువ తెలియాలి, అంతేకాని అధికారాన్ని ఆస్వాదించడంలో ఆనందం పొందడం అలవాటైతే కష్టం’. మా కాలనీలో ఆఫీసర్ ఇంటి ఫంక్షన్‌ల కంటే మా అటెండర్ ఇంట్లో వేడుకలకు తప్పనిసరిగా వెళ్తాను. పిల్లలు కూడా పనివాళ్లను ఆదరంగా చూడడం నేర్చుకున్నారు. ఇప్పటికీ మా పిల్లలు పనివాళ్లకు పనిపురమాయించడం ఆర్డర్ జారీ చేసినట్లు ఉండదు. మా అమ్మాయికి ఎంత జాగ్రత్త అలవాటైంది అంటే... షాపింగ్‌కెళ్లినప్పుడు మేము అనుకున్న బడ్జెట్‌కంటే ఎక్కువ ధరలో ఉన్న డ్రెస్ తనకు నచ్చినప్పుడు రెండు డ్రస్‌లు బదులు ఒక్కటే తీసుకుంటుంది’’ అన్నారు సుగుణశీల.
 
ఆయన అభిప్రాయాల బాటలోనే...

‘‘మా వారు అధికారాన్ని హోదా అనుకోరు, బాధ్యత అంటారు. ఐఏఎస్ అధికారిగా ఎవరికి ఎంతగా సర్వీస్ అందించవచ్చో అంత సర్వీస్‌నీ ఇవ్వాలంటారు. పిల్లల పెంపకంలో నేను ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకునేదాన్ని. సృజన చిన్నప్పుడు ఉదయాన్నే వాళ్ల నాన్నగారి పక్కనే కూర్చుని... వచ్చిన వారితో ఆయన వ్యవహరించే తీరు, సాయం అందించడానికి ఆయన పడే తపన చూసేది. సృజన చారిటీలలో సేవ చేయడానికి, సివిల్స్‌ను కెరీర్‌గా తీసుకోవడానికి కారణం అదే’’ అంటారామె.
 
ప్రతి మనిషికీ మానవతావిలువలు, మంచితనం ఉండాలంటారు బలరామయ్య. సహాయం కోరి వచ్చిన వారిని నిరాశతో పంపించకూడదు. ఎదుటివారిని ప్రేమించాలి, అభిమానించాలి. అప్పుడే మనిషి పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాడు. అలాంటి వారిని అందరూ ఇష్టపడతారు... అనే బలరామయ్య బాటలోనే ఆయన పిల్లలు కూడా నడుస్తున్నారు. మంచి పౌరులు ఇలా ఉండాలని నేర్పించడమే కాదు, తాము ఆచరించి చూపించిన తల్లిదండ్రులు గుమ్మళ్ల బలరామయ్య, సుగుణశీల.

 - వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 పిల్లల్ని వ్యక్తులుగా తీర్చిదిద్దడానికే...
 పిల్లల్ని నా అభిప్రాయాల మేరకు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాను. నేను అధ్యయనం చేసిన సమాజాన్ని, జీవితం పట్ల దృక్కోణాన్ని రంగరించి నా భావాలకు అనుగుణంగా వారిని ప్రభావితం చేశాను. కానీ వారి కెరీర్‌ని నేను నిర్ణయించాలనుకోలేదు.
 - జి. బలరామయ్య, విశ్రాంత ఐఏఎస్ అధికారి
 
 సృజన: సివిల్స్‌లో 44వ ర్యాంకర్. మసూరిలో ట్రైనింగ్‌లో ఉన్నారు.
 చార్వాక్: బీటెక్, ఎంబిఎ.
 బలరామయ్య: విశ్రాంత ఐఎఎస్ అధికారి (కర్నూలు కలెక్టర్, కడప జాయింట్ కలెక్టర్, టిటిడి జెఇవో, అనంతపూర్ డిఆర్‌ఓ, పిడి డిఆర్‌డిఎ కడప, ఎండోమెంట్స్ కమిషనర్)
 సుగుణశీల: చిత్తూరు జిల్లా పూడి పంచాయితీ సర్పంచ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement