నాన్నకు ప్రేమతో... | Jahnvi achieve the world's tallest mountains | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో...

Published Thu, Mar 24 2016 11:01 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

నాన్నకు ప్రేమతో...

నాన్నకు ప్రేమతో...

గడ్డకట్టించే శీతలం.. అడుగు తీసి అడుగువేయలేనంత మంచు.. నిమిషాల్లో మారిపోయే శిఖరాగ్ర వాతావరణం..  అయినా సరే, ఆ అడుగులకు ఏవీ అడ్డు కాలేదు. ఆ తపనకు ఏదీ అడ్డురావడం లేదు.  తండ్రి ఇచ్చిన స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని.. భారతీయ ఆత్మను కవచంగా చేసుకొని..  ప్రపంచంలోని ఎత్తై పర్వతాలను అధిరోహిస్తూనే ఉంది.  ఆ పర్వతారోహకురాలే...  జాహ్నవి శ్రీపెరంబుదూరు.


చిన్న వయసులోనే ప్రపంచంలోని ఎత్తై శిఖరాలన్నింటిని అధిరోహించాలని దీక్ష పట్టిన జాహ్నవి ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహణకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పుడు తన వయసు పద్నాలుగు. నలభై కేజీల బరువున్న ఈ ఎర్లీ టీనేజ్ అమ్మాయి అంతకు రెట్టింపు బరువును భుజాల మీదకు ఎత్తుకొని అవలీలగా పర్వతాలను ఎక్కుతూ ‘భారత్ అమ్మాయిలు ఎంత బలవంతులో చూడండి’ అని నిరూపిస్తోంది. ఇప్పటికే ‘మిషన్ 7 సమ్మిట్’ కార్యక్రమం మొదలుపెట్టిన జాహ్నవి ఆఫ్రికాలోని అతి ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని, యూరోప్‌లోని అతి ఎత్తై ఎలబ్రుస్ పర్వతాన్ని ఎక్కి రికార్డులు సొంతం చేసుకుంది. వీటితో పాటు ‘అస్సీ 10 ఛాలెంజ్’గా పిలిచే పది ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించి మరో సరికొత్త రికార్డును సాధించింది. ఇటీవలే ఆస్ట్రేలియాలోని ఎత్తయిన ‘మౌంట్ కొసియుజ్కో’ పర్వతంపై కాలుమోపి భారతీయుల్లో ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది.

 
అధిరోహణం మొదలైంది ఇలా...

జాహ్నవి తండ్రి కృష్ణారావు మానసిక వైద్యుడు. తల్లి సరస్వతి ఉపాధ్యాయురాలు. తండ్రి పర్వతారోహకుడు కూడా కావడంతో కూతురిలో శిఖరమంత ఆశయాలను నింపాడు. జాహ్నవికి రెండేళ్ల వయసు ఉండగానే తనతో పాటు కొండల మీదకు ట్రెక్కింగ్‌కు తీసుకువెళ్లేవాడు. కొడుకు ఉన్నప్పటికీ కూతురినే ఈ లక్ష్యసాధనకు ఎంచుకోవడానికి కారణాలను వివరిస్తూ - ‘భారతీయ స్త్రీలు పర్వతారోహణలో వెనుకంజలో ఉంటారు అని హేళనగా నవ్వుకునే విదేశీయుల మాటలు నన్ను బాధించేవి. నా కూతురు వారి హేళనలకు సరైన సమాధానం అనిపించేది. పర్వతారోహణకు కొండ ప్రాంతాలు నడకదారి ఏవీ సవ్యంగా ఉండవు. పైగా దారిలో పాములు, విపరీతంగా గాలులు... వీటికి భయపడి స్త్రీలు ఎక్కువగా ఈ రంగంలోకి రారు. కాని వీటినేవీ లెక్కచేసేది కాదు జాహ్నవి. ప్రతికూల పరిస్థితులు ఏవైనా తట్టుకోవడం నిత్యం సాధన చేసేది. చిన్న చిన్న బరువులు మోస్తూ కొండలెక్కడం అలవాటు చేసుకుంది. యోగా, రన్నింగ్, ఫిట్‌నెస్‌లకు సంబంధించిన సాధన కూడా మొదలుపెట్టింది. తనలోని పట్టుదల చూసి చాలా ఆశ్చర్యమేసేది.  భారతీయ స్త్రీలను చులకన చేసేవారికి తనే సరైన సమాధానం అని ప్రతీసారీ చేతల్లో నిరూపిస్తూనే ఉంది’’ అని కూతురి పట్టుదలను వివరించారు కృష్ణారావు.

తొమ్మిదేళ్ల వయసులో...


తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని 16 వేల అడుగుల ఎత్తున్న రూప్‌కుండ్ పర్వతం అధిరోహించిన జాహ్నవి           ఆ తర్వాత చలికాలంలో గడ్డకట్టుకుపోయే హిమాలయాల్లో సాహసయాత్ర చేసింది. ఆ వివరాలను జాహ్నవి తెలియచేస్తూ ‘ముందు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ఇంత చిన్నవయసు అమ్మాయేంటి? అంత పెద్ద శిఖరాలేంటి? అనే ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. ఎన్నో విడతలుగా ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. లేహ్‌లో ఎంతో కష్టమైన 20 వేల అడుగుల ఎత్తున్న ‘స్టోక్ కాంగ్రీ’ పర్వతాన్ని అధిరోహించినప్పుడు నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. స్త్రీగా ఎదురయ్యే ఇబ్బందులేవీ ఇప్పటి వరకు నేను ఎదుర్కోలేదు. పైగా వాటిని జీవనశైలిలో భాగం చేసుకున్నాను. అమ్మాయిలకు ఆకాశమే హద్దుగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిలో పర్వతారోహణ ఒకటిగా నేను భావిస్తున్నాను. భయం అనే మాటకు తావు లేకుండా నేను వేసే ప్రతి అడుగు అమ్మాయిలకు స్ఫూర్తికావాలని, భారతీయ ఖ్యాతిని పెంచాలనే భావనను ఎప్పుడూ వీడను’ అని వివరించింది ఈ పిన్నవయసు పర్వతారోహకురాలు.

భూమ్మీద ఎత్తై శిఖరం...


త్వరలో దక్షిణ అమెరికాలో 6,962 మీటర్ల ఎత్తున్న మౌంట్ అకన్‌కాగ్వా పర్వతం ఎక్కడానికి సిద్ధమవుతోన్న జాహ్నవి భూమ్మీద ఎత్తయిన ఎవరెస్ట్‌తో సహా మిగతా ఖండాల్లోని పర్వత శిఖరాలన్నింటినీ అధిరోహించి ప్రపంచంలోనే అతి చిన్న వయసున్న సాహస యాత్రికురాలిగా రికార్డు సాధించాలన్న ఆశయాన్ని ఏర్పరచుకుంది. ఈ సాహస బాలిక హైదరాబాద్‌లోని రికెల్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. పెయింటింగ్, కథలు రాయడం ఇష్టమని చెప్పే జాహ్నవి భరతనాట్యమూ నేర్చుకుంటోంది.

 
ఆర్థికభారం అవరోధం...


ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ఆశయంతో ముందుకు అడుగువేస్తున్న జాహ్నవికి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అడ్డం పడుతున్నాయి. ఆ తపనకు ఆర్థిక ఇబ్బందులే ఊపిరి అందకుండా చేస్తున్నాయి. తండ్రి క్యాన్సర్ బారిన పడటం, సరైన స్థోమత లేని కారణంతో ఆత్మవిశ్వాసానికి పరీక్షలు ఎదురవుతున్నాయి. ఈ విషయాల గురించి జాహ్నవి తండ్రి కృష్ణారావు మాట్లాడుతూ ‘పర్వతారోహణకు అయ్యే లక్షల రూపాయల ఖర్చును ఇన్నాళ్లూ సొంతంగా భరిస్తూ వచ్చాను. ఇకపై జాహ్నవి లక్ష్యానికి ఊతం కావల్సింది సమాజమే.....’ అంటూ చేతులెత్తి విన్నవించుకున్నారు. జాహ్నవి శిఖరాగ్రం మీదకు చేరి భారతదేశ విజయకేతనాన్ని సగర్వంగా ఎగురవే యాలన్న ఆరాటానికి అంతా కలిసి ఊతమిద్దాం.

 - ఎన్.ఆర్

జాహ్నవి కోసం వైద్యవృత్తిని వదిలేశాను

జాహ్నవి తండ్రి కృష్ణారావు చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే... ‘నా గురించి పెద్దగా చెప్పేదేమీ లేదు. వృత్తిరీత్యా ‘మెంటల్ హెల్త్’ వైద్యుడిని. నాకు కూడా సాహసక్రీడల్లో చాలా ఆసక్తి. అందుకే జాహ్నవిలో ఇలాంటి అభిరుచి పెంపొందించేలా పెంచాను. దాంతో  ‘మెంటల్ డాక్టర్‌కు మెంటల్ వచ్చింది’ అని కొందరు కామెంట్స్ చేశారు. ఇక్కడ మన దేశంలో మానసిక సమస్యలను ఒక జబ్బులా చూస్తారు. కానీ నేను కెనడాలో పనిచేసే చోట దాన్ని జబ్బులా కాకుండా ఒక వేదనలా చూస్తారు. కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యం ఇస్తారు. హిప్నోథెరపీ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు (ఆల్టర్నేటివ్ థెరపీస్)  చేస్తారు. అవేవీ ఫలితాలు ఇవ్వనప్పుడు మాత్రమే మందులు రాస్తారు. ఇక నా కూతురు జాహ్నవి విషయానికి వస్తే ఆమె కోసం నేను నా వైద్యవృత్తిని వదిలేశాను. నేను సాహసక్రీడల్లో పాల్గొనేవారిని రక్షించడం, వారికి చేయూత నివ్వడం వంటి కార్యకలాపాలకు ఆస్కారం ఇచ్చే ‘రెస్క్యూవర్’గా పనిచేస్తున్నాను. ఇక నా వ్యక్తిగత అంశాల విషయానికి వస్తే నాకు ముందుగా ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చింది. నేను ఫిట్‌గా ఉండటం, చాలా ఆరోగ్యకరంగా కనిపిస్తూ ఉండటం వల్ల లక్షణాలను గుర్తించలేదు. దాంతో అది బాగా ముదిరిపోయి నాలుగో దశకు చేరింది. వెన్నుపూసల్లోకి, కాలేయానికి కూడా పాకింది. నా గురించి, నా జబ్బు గురించి దృష్టిపెట్టడం కంటే జాహ్నవి లక్ష్యం, దాని సాధన కోసమే అందరి దృష్టి ఉండాలని నేను కోరుకుంటున్నాను.

కృష్ణారావు జాహ్నవి తండ్రి


Sriperambuduru Jaahnavi

AXIS Bank A/c No.

914010036210131

Dr.A.S.Rao Nagar Branch

IFSC Code: UTIB0000427

జాహ్నవి ఫోన్ నంబర్:  +91 8464858658

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement