భోగాలపై వ్యామోహంతో భ్రష్టత్వం
ఇశ్రాయేలీయులను ఇరవై ఏళ్లు ఏలిన గొప్ప న్యాయాధిపతి, మహాబలవంతుడు సంసోను. దేవుని వరప్రసాదంగా పుట్టిన కారణజన్ము డతను. ఫిలీషియులనే అత్యంత క్రూరులైన శత్రువుల చేతిలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విముక్తులను చేసే మహోన్నత లక్ష్యాన్ని, అంతటి బలాన్ని దేవుడతనికిచ్చాడు. ఫలితంగా ఒక గాడిద దవడ ఎముకతో వెయ్యిమంది శత్రువులను, కేవలం చేతులతో సింహాన్ని చీల్చి చంపాడు.
కాని దేవుని నుండి ఎన్నో ఆధిక్యతలను పొందిన సంసోను దారితప్పి స్త్రీలోలుడై అల్పకార్యాలకు పాల్పడి జీవితంలో అత్యధిక మూల్యాన్ని చెల్లించాడు. శత్రువులను చీల్చి చెండాడేంత బలాన్ని దేవుడిస్తే, ఆత్మీయంగా, నైతికంగా బలహీనుడై ఆ శత్రువులకే బందీగా చిక్కి, రెండు కళ్లూ కోల్పోయి, చెరసాలలో తిరగలి విసిరాడు. దేవునికి ప్రీతికరంగా, ప్రజలకు ఆదర్శప్రాయంగా సాగవలసిన సంసోను జీవితం అద్భుతంగా ఆరంభమై, క్రమంగా అధ్వానమై చివరికి దయనీయమైంది.
ఒక క్రమం లేక, దైవిక వ్యూహం లేక, గురితప్పి జీవించడమే సంసోను చేసిన మహాపరాధం. దేవుడిచ్చిన బలం న్యాయాధిపతి పదవి. ఆ కారణంగా లభించిన గౌరవం విలువ తెలుసుకోలేకపోయాడతను. అడపాదడపా బలప్రదర్శన చేసి, అందరితో ఆహా ఓహో అనిపించుకోవడానికి కనిపించిన శత్రువులను సంహరించాడే తప్ప ఇశ్రాయేలు సైన్యాన్ని సమాయత్తం చేసి, తన నాయకత్వంలో యుద్ధం చేసి శత్రువులను జయించే ఆలోచన రానంతగా స్త్రీ వ్యామోహం అతన్ని ఆవహించింది. డెలీలా వంటి సుందర స్త్రీల సాంగత్యం అతనికి దేవునికన్నా మిన్న అయింది. దేవుడు చెప్పినట్టుగా కాక తనకు తోచినట్టుగా విచ్చలవిడిగా జీవించాడు. శత్రువుల వేటలో, దేవుని ప్రజల పరిచర్యలో, దైవారాధనలో తరించవలసిన సంసోను అల్పభోగాలకోసం, స్త్రీ వ్యామోహంతో తన జీవితాన్ని వెచ్చించి భ్రష్టత్వానికీ కేరాఫ్ అడ్రస్ అయ్యాడు.
కొందరంతే, దేవుడత్యున్నతమైన పిలుపునిచ్చి పరిచర్యకు పిలిస్తే, డబ్బు, పేరు, అధికారం, ఆస్తులు వంటి డెలీలాల వ్యామోహంలో పడి ఆత్మీయ జీవితంలో డీలాపడిపోతాడు. విశ్వానికే యజమాని అయిన యేసుప్రభువు తన భాగ్యాలన్నీ వదిలేసి పేదవాడిగా, రిక్తుడిగా, దాసుడుగా ఈ లోకానికొస్తే, ఆయన్ను సేవించేవారమని చెప్పేవాళ్ళు కోట్లకు పడగెత్తడం, స్థలాలు, బ్యాంకు బ్యాలెన్సుల వెంట పడడం ఎంత సమంజసం? సంసోనుకొక్క స్త్రీ వ్యామోహం మాత్రమే ఉండేది. కాని చాలామందికి డబ్బు, భూమి, పేరు ప్రఖ్యాతులు, అధికారం వంటి చాలా వ్యామోహాలున్నాయి.
సంసోను పగలు దేవునికోసం పోరాటాలు చేశాడు. రాత్రిళ్ళు దేవుని ఆజ్ఞల్ని యథేచ్ఛగా ఉల్లంఘించాడు. శత్రువులే అతని ముందు మోకరిల్లేంత బలవంతుడుగా దేవుడు తీర్చిదిద్దితే, స్త్రీల ముందు మోకరిల్లేంత బలహీనుడయ్యాడు. అయినా దేవుడెంత కరుణామయుడంటే, చెరసాలలో అతను చేసిన పశ్చాత్తాప ప్రార్ధన నంగీకరించి అతన్ని విశ్వాసపరుల జాబితాలో చేర్చాడు. (హెబ్రీ 11:32). గుడ్డివాడైనా నిండా సంకెళ్లున్న అవసాన దశలో అతడు ఒక గుడిని కూల్చగా శత్రువులు వేలమంది చనిపోయారు. వెయ్యి నక్కలు కలిసి కుట్రచేసి ఒక సింహాన్ని ఓడించినా, సింహం సింహమే, నక్కలు నక్కలే కదా!!