
అమెరికాలో ఒక జడ్జి తన హోదాను పక్కన పెట్టారు. లాయర్‌గా ప్రమాణస్వీకారం చేయడానికి వచ్చిన మహిళ చేతిలో ఉన్న బిడ్డను తాను ఎత్తుకుని ఆ మాతృమూర్తి చేత అడ్వకేట్‌గా ప్రమాణం చేయించారు! వాషింగ్టన్‌లో ఈమధ్యే జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలందుకుంటోంది. ఆ జడ్జి పేరు రిచర్డ్ డింకిన్స్, ఆ తల్లి పేరు జూలియానా లామర్. ఆమె న్యాయశాస్త్రం చదివేటప్పుడు గర్భవతి. కోర్సు పూర్తయ్యే లోపు తల్లయింది. లా కోర్సు పూర్తి చేసి అడ్వకేట్‌గా వృత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది.
స్టేట్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పత్రాన్ని చదవడం అనే అధికారికంగా వస్తున్న సంప్రదాయం. ఆ కార్యక్రమంలో బిడ్డను ఎత్తుకునే, జడ్జి చెప్పినట్లు ప్రమాణం చేస్తోంది. అయితే ఆమె చేతుల్లో ఉన్న బిడ్డ క్షణం కూడా కుదురుగా ఉండడం లేదు. కిందకు దూకడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె అలా ప్రమాణ స్వీకారం చేయడానికి తంటాలు పడడాన్ని చూస్తూ ఊరుకోలేకపోయారు డింకిన్స్. ఆమె చేతుల్లోంచి బిడ్డను తీసుకుని, ఒక చేత్తో ఆ బిడ్డను ఎత్తుకుని మరో చేత్తో ప్రమాణ పత్రాన్ని పట్టుకుని ప్రమాణం చేయించారు.
ఆ తర్వాత ఆ వీడియోను లామర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కొన్ని గంటల్లోనే డెబ్బై వేల వ్యూస్ వచ్చాయి! లామర్‌తోపాటు న్యాయశాస్త్రం చదివిన స్నేహితురాలు సారా మార్టిన్ ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. మొత్తానికి ఈ వీడియో చూసిన వాళ్లలో ఒకరు.. జడ్జి గారికి ఈ ఏడాది ప్రెసిడెన్షియల్ గుడ్ హ్యూమానిటీ అవార్డు ఇవ్వాలని, మరొకరు... స్త్రీల పట్ల గౌరవం కలిగిన సమాజానికి ఇదొక ఉదాహరణ అని, ఒక మహిళ తన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్న సమాజానికి ఇదొక ప్రతీక అని కామెంట్ చేశారు.
►మారాం చేసి జడ్జి చేత గారం చేయించుకున్న పిల్లాడు బెకమ్ కూడా హీరో అయిపోయాడు. వాడు అంత అల్లరి చేయకపోయి ఉంటే ఇంత మంచి మానవీయ దృశ్య ప్రపంచానికి దక్కేది కాదు. ఒక నెటిజన్ అయితే ఆ బిడ్డ పెద్దయిన తర్వాత చూసుకోవడానికి వీలుగా ఈ వీడియో దాచి ఉంచమని లాయరమ్మకు సలహా కూడా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment